శరీరం చచ్చుబడ్డా.. ఆశయాన్ని బతికిస్తోంది

తెల్లవారితే పెళ్లిరోజు. భర్తతో ఆనందంగా గడపాలనుకున్న ప్రణాళికలకు విధి అడ్డుకట్ట వేసింది. విచిత్రమైన అనారోగ్యం ఆమెను అచేతనంగా మార్చింది. కానీ ఆమె తన జీవితం అయిపోయింది అనుకోలేదు. తనలాంటి వాళ్లకు అవగాహన కల్పిస్తోంది. వాళ్లలో స్ఫూర్తిని నింపడంతోపాటు వికలాంగుల

Updated : 06 Dec 2021 19:15 IST

తెల్లవారితే పెళ్లిరోజు. భర్తతో ఆనందంగా గడపాలనుకున్న ప్రణాళికలకు విధి అడ్డుకట్ట వేసింది. విచిత్రమైన అనారోగ్యం ఆమెను అచేతనంగా మార్చింది. కానీ ఆమె తన జీవితం అయిపోయింది అనుకోలేదు. తనలాంటి వాళ్లకు అవగాహన కల్పిస్తోంది. వాళ్లలో స్ఫూర్తిని నింపడంతోపాటు వికలాంగుల హక్కుల కోసం పాటుపడుతోంది. ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డును సాధించింది. కోయంబత్తూరుకు చెందిన స్వర్ణలత గురించే ఇదంతా!

చిన్నతనం నుంచీ స్వర్ణలతకు చేదు అనుభవాలే. మొదట అమ్మాయి తర్వాత అయినా అబ్బాయి పుడతాడనుకుంటే ఈమె పుట్టింది. దీంతో అమ్మానాన్నలు దూరంగా ఉంచే వారు. ఇంజినీరింగ్‌ చదువుతానంటే తండ్రి తన వల్ల కాదన్నాడు. కంప్యూటర్‌ సైన్స్‌ డిప్లొమాలో చేరింది. మూడో ఏడాదిలో పినతండ్రి నుంచి లైంగిక వేధింపులు. ఇంట్లో చెబితే ఆమెనే దోషిలా నిలబెట్టారంతా. చదువు కొనసాగించడానికి వీల్లేదంటూ గృహనిర్బంధం చేశారు. బతిమాలి ఒప్పించి అలా కాలేజీ కని కాలు బయటపెట్టిందో లేదో రోడ్డు ప్రమాదానికి గురైంది. పలు శస్త్రచికిత్సల తర్వాత తిరిగి నడవడానికే ఆరునెలలు పట్టింది. ఇన్ని ఇబ్బందులు ఎదురైనా చదువు పూర్తిచేసి, ఉద్యోగంలో చేరింది. అక్కడ గురుప్రసాద్‌తో పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ ఒక్కటయ్యారు. అత్తారింట్లోనూ అవే ఛీత్కారాలు. అది 2009. స్వర్ణలతకు అప్పటికి ఏడాది బాబు. జ్వరం వచ్చినట్లుగా అనిపించి కాసేపు నడుం వాల్చింది. కాసేపటి తర్వాత మంచం దిగడానికి ప్రయత్నిస్తే శరీరం సహకరించలేదు. ఏమీ అర్థం కాలేదామెకు. తీరా చూస్తే మెడ కింది భాగం నుంచి ఏ అవయవమూ కదట్లేదు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఫలితం లేదు. చివరకు ఆమెకు ‘మల్టిపుల్‌ స్కెరోసిస్‌’ (ఎంఎస్‌) వచ్చిందని తేల్చారు. అంటే కండరాలన్నీ గట్టిపడి కదల్లేని స్థితికి చేరుకోవడం. ఈ పరిస్థితుల్లో పనెలా చేస్తావని సంస్థ ఉద్యోగంలోంచి తీసేసింది.

పట్టువదలని పోరాటం

‘ఈ జన్మకిక అడుగు వేయలేనేమో అనే ఆలోచనే భరించలేకపోయే దాన్ని. నా కొడుకునీ ఎత్తుకోలేని స్థితి. చనిపోవాలనిపించేది. అటు అమ్మావాళ్లు, ఇటు అత్తింటి వాళ్లెవరూ చేయూతనివ్వలేదు. మా ఆయనొక్కరే తోడుగా ఉన్నారు. మొదట్లో 60 శాతం ఉన్న అనారోగ్యం క్రమేపీ శరీరమంతా వ్యాపించింది. ఫిజియోథెరపీ, చికిత్స తర్వాత చేతులను కదపగలిగా. ఈక్రమంలో నాలాంటి ఎంతో మందిని చూశా. నా పరిస్థితి చాలా మెరుగనిపించింది. ఉత్సాహాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించేదాన్ని. రెండేళ్ల తర్వాత మళ్లీ గర్భం దాల్చా. ఈసారి అమ్మాయి రూపంలో మా జీవితాల్లోకి తిరిగి ఆనందం వచ్చింది. ఇద్దరి ఆలనాపాలనా మా వారే చూసుకునేవారు. నాలాంటి వాళ్ల కోసం ఏదైనా చేయాలనుందని ఆయనతో చెప్పా. అలా 2014లో కోయంబత్తూరులో నాడీ, కండరాల లోపాలున్నవారి కోసం ‘స్వర్ణ ఫౌండేషన్‌’ ప్రారంభించా’ అని వివరించింది స్వర్ణలత.

తన ఫౌండేషన్‌ ద్వారా ఎంఎస్‌కు గురైనవారిని గుర్తించి, వ్యాధిపై అవగాహన, చికిత్స, కౌన్సెలింగ్‌ వంటి వాటిల్లో సాయం చేస్తోంది. యోగా, ఫిజియోథెరపీలనూ అందిస్తోంది.   పేదల చికిత్సకు ఆర్థికసాయాన్నీ చేస్తోంది. కోవైలోని ఏడు పాఠశాలల్లో వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలతో మూత్రశాలల నిర్మాణం చేపట్టి, వాళ్లు తిరిగి బడికెళ్లేలా చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల సౌకర్యార్థం ‘సారథి’ పేరిట వాహనాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకూ వేలమంది ఈ ఫౌండేషన్‌ ద్వారా లబ్ధి పొందారు. వీటితోపాటు స్ఫూర్తి ప్రసంగాలతో స్వర్ణలత తనలాంటి వారిలో చైతన్యాన్ని కలిగిస్తోంది. పది భాషలను నేర్చుకున్న ఈమె ఆంగ్లం, తమిళంలో 150 ప్రసంగాలిచ్చి ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానాన్ని దక్కించుకుంది. రచయిత, గాయని, ఫొటోగ్రాఫర్‌ కూడా. ‘మిసెస్‌ ఇండియా’ సౌత్‌ అందాల పోటీల్లో ఫస్ట్‌ రన్నరప్‌గానూ నిలిచిన ఈమె పట్టుదల, జీవితాన్ని గెలవాలనే తపన స్ఫూర్తిదాయకం కదూ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్