మీ కథ చెబుతారా? వింటాను
close
Updated : 27/11/2021 05:32 IST

మీ కథ చెబుతారా? వింటాను!

మన సంతోషాలు, జ్ఞాపకాలు, ఆలోచనలను సోషల్‌ మీడియాలో స్నేహితులతో పంచుకుంటుంటాం. కానీ కరిష్మా... చుట్టూ ఉన్న వారి కథలను, వ్యథలను పంచుకుంటోంది. ఫేస్‌బుక్‌లో తన పోస్టులు లక్షల గుండెలను తడుతున్నాయి. స్ఫూర్తిని నింపుతున్నాయి. వాటి ద్వారానే 15 కోట్లు సేకరించింది. లక్షల జీవితాల్లో వెలుగులు నింపింది. తన స్ఫూర్తియానాన్ని చూద్దాం రండి!

రిష్మా మెహతా యూకేలో బిజినెస్‌ అండ్‌ ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసింది. అక్కడున్నప్పుడు ఓ సారి ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ న్యూయార్క్‌’ అనే ఫేస్‌బుక్‌ ఖాతాను చూసింది. అందులో ఒకతను తను కలిసిన ప్రతి ఒక్కరి ఫొటోలనూ చిన్న క్యాప్షన్‌తో ఉంచేవాడు. అది ఆమెను ఆకర్షించింది. తను పుట్టి, పెరిగింది ముంబయి. చదువు పూర్తయ్యి తిరిగొచ్చాక ఓసారి అక్కడి మురికివాడల్ని సందర్శించింది. అదో కొత్త ప్రపంచంలా తోచిందామెకు.  వారి బాధలు, దయనీయ జీవితాలను ప్రపంచానికి చూపాలనుకుంది. ముంబయికి కూడా ప్రత్యేక ఫేస్‌బుక్‌ పేజీలేమైనా ఉన్నాయా అని వెదికితే కనిపించలేదు. తనే ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ పేరుతో 2014లో ఎఫ్‌బీ ఖాతా తెరిచింది. అప్పటికి తన వయసు 21.

‘మొదట్లో నా ఆలోచన వేరు. చిన్న చిన్న కారణాలతో జీవితాలను ముగించుకునే వారే ఎక్కువ. మన చుట్టూనే ఎన్నో కథలు. ఎన్ని కష్టాలెదురైనా, చావు అంచుల వరకూ వెళ్లినా.. మొండిగా, ధైర్యంగా ముందుకు సాగుతున్న వాళ్లెందరో. వారిని పరిచయం చేయాలనుకున్నా’ అని గుర్తు చేసుకుంది కరిష్మా.

కెమెరా భుజాన వేసుకుని, ఆసక్తిగా అనిపించిన వాళ్లందర్నీ పలకరిస్తూ వెళ్లింది. ఎవరూ తమ గురించి చెప్పడానికి ఇష్టపడలేదు. తిరగ్గా తిరగ్గా కొన్నాళ్లకు ఒక 50 ఏళ్ల మహిళ కరిష్మాతో మాట్లాడటానికి ఆసక్తి చూపింది. అప్పటికి ఆమె భర్త చనిపోయి కొద్దిరోజులే. తన కష్టాలు, కడగళ్లనూ చెప్పుకుందామంటే వినే వాళ్లు లేరు. చాలా సేపు కూర్చుని ఓపిగ్గా తన కథను విన్న కరిష్మాతో ఆమె ‘ఎన్నో ఏళ్ల నుంచి గుండెల్లో దాచుకున్న బాధ ఇది. నీవల్ల దింపుకునే అవకాశమొచ్చింది తల్లీ’ అని చెప్పి తన దారిన తను వెళ్లింది. అలా మొదలైన హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే ప్రయాణం ఇటీవలే ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. ఇన్నేళ్లలో తనకు ఎదురైన భిన్న నేపథ్యాల వ్యక్తులు, వయసుల వారి కథల సంఖ్య 8000 దాటిపోయింది. ఫేస్‌బుక్‌ ఖాతాతోపాటు వెబ్‌సైట్‌నూ ప్రారంభించింది. ఓ బృందాన్నీ ఏర్పాటు చేసుకుంది.

‘‘మీ కథ నాతో పంచుకుంటారా?’ ఈ ఒక్క మాటే నేను ఎవరినైనా అడిగేది. చాలామంది చిత్రంగా చూసే వాళ్లు. కొందరు భయపడే వాళ్లు. ఎవరితోనైనా పంచుకుంటేనే బాధ తగ్గేది, సంతోషం రెట్టింపయ్యేది. ఒక్కోసారి వాటిని పంచుకోవడానికి ఎవరూ ఉండరు. ఆ అవకాశాన్ని కల్పిస్తున్నా. మొదట్లో మురికివాడల వెంట ఎందుకు వెళుతున్నానో తెలియక ఇంట్లో కంగారు పడే వాళ్లు. కానీ స్నేహితులు ప్రోత్సహించారు. తర్వాత్తర్వాత స్పందన పెరిగింది.  నేను పోస్ట్‌ చేసే కథలకు మానవతామూర్తులు స్పందించే వారు. ఈ ఎనిమిదేళ్లలో సర్జరీలు, పేద పిల్లల చదువులు, చిరు వ్యాపారాలు, ఎన్‌జీఓలు.. ఇలా ఎంతో మంది అవసరాలకు రూ.15కోట్లకుపైగా విరాళాలు సేకరించి, సాయం చేయగలిగా. వ్యభిచార ముఠాలకు చిక్కిన చాలా మంది దీని వల్ల బయటపడి కొత్త జీవితాల్ని ప్రారంభించారు. మీ పోస్టులను చూశాక ఆత్మహత్య చేసుకోవాలన్న, నిరాశలో కూరుకుపోయిన మా ఆలోచనలు మారాయి. మేమూ జీవితాన్ని ఎదురొడ్డుతాం అంటూ లక్షల మెసేజీలొచ్చాయి. కొంతమందికైనా సాంత్వన కలిగితే చాలని ప్రారంభించిన పని ఇది. ఇలా లక్షల మంది జీవితాల్లో వెలుగుల్ని నింపడం చూస్తోంటే... ఇంతకన్నా ఏం కావాలి అనిపిస్తుంటుంది’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది కరిష్మా.

తను ‘నాక్‌’ అనే సంస్థనూ నడుపుతోంది. దీని ద్వారా పాజిటివ్‌ థింకింగ్‌, మోటివేషనల్‌ తరగతులను నిర్వహిస్తుంటుంది. ప్రముఖ విశ్వవిద్యాలయాలు, టెడెక్స్‌ వేదికలపైనా ఉపన్యాసాలు ఇస్తుంది. తను విన్న అందరి కథలను పుస్తక రూపంలోకి తెచ్చింది. స్ఫూర్తి పొందాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. మన చుట్టుపక్కల చూసే ఎంతో నేర్చుకోవచ్చు అంటుందీమె. ఇదే తనకు ఎన్నో ఎంబీఏలు చదివిన అనుభవాన్ని, పరిజ్ఞానాన్నీ ఇచ్చాయంటుంది.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని