బ్రేక్‌డ్యాన్స్‌తో ఒలింపిక్స్‌కు...
close
Updated : 27/11/2021 05:36 IST

బ్రేక్‌డ్యాన్స్‌తో ఒలింపిక్స్‌కు...

స్టేజ్‌... గది... రహదారి.. ప్రదేశమేదైనా జొహన్నా కాలు కదిపితే చాలు. ఆ ప్రాంతమంతా చప్పట్లతో మారుమోగిపోతుంది. పురుషాధిక్యత కనిపించే బ్రేక్‌ డ్యాన్స్‌లో వారితోనే పోటీపడుతోందీమె. 2024 ఒలింపిక్స్‌లో ఈ విభాగంలో దేశం తరఫున పోటీ పడుతోంది కూడా. ఈ అమ్మాయి గురించి ఇంకా తెలుసుకోవాలనుంటే చదివేయండి.

జొహన్నా రోడ్రిగెజ్‌కు అప్పుడు 11 ఏళ్లు. ఇంటిపక్క డాబాపై ఇద్దరబ్బాయిలు చేస్తున్న డ్యాన్స్‌ ఆమెను ఆకర్షించింది. బూమ్‌బాక్స్‌తో వాళ్లిద్దరూ చేసింది బ్రేక్‌ డ్యాన్స్‌ అని తెలిసిందామెకు. ఆ తర్వాత అమ్మతో కలిసి ఒకసారి మనాలీ వెళితే.. అక్కడ కొందరు గోడపై రంగులేస్తూ డ్యాన్స్‌ చేస్తున్నారు. అది చూసి ఆకర్షితురాలైంది. డ్యాన్స్‌పై ఆసక్తితో తరగతుల్లో చేరింది. కానీ అక్కడ నేర్పించేది తనకు నచ్చలేదు. అప్పటికే యోగా చేస్తున్న తను దానికి డ్యాన్స్‌ను కలిపి సొంతంగా సాధన మొదలుపెట్టింది. జొహన్నాకు 17 ఏళ్లప్పుడు బీ-బాయ్‌ జూన్‌తో ఏర్పడిన పరిచయం తన కెరియర్‌కు మార్గమైంది. బ్రేక్‌ డ్యాన్స్‌ నిపుణుడాయన. అతనితో కలిసి ‘హిప్‌-హాప్‌’కు హాజరైంది. మొదటిసారి అక్కడే అసలైన బ్రేక్‌డ్యాన్స్‌ అంటే ఏంటో చూసింది. వీరందరినీ బీ-బాయ్‌ లేదా బీ-గర్ల్‌ అని పిలిచేవారు. అలా క్రమంగా ఆసక్తి పెరిగి బెంగళూరులోని ‘బ్లాక్‌ ఐస్‌ క్రూ’తో కలిసి సాధన ప్రారంభించింది.

‘బ్రేక్‌ బ్రహ్మ’ పేరుతో...

జూన్‌తో పరిచయం తనకు ఎన్నో నేర్పిందంటుంది జొహన్నా. ‘ఇంటర్‌ రెండో ఏడాదిలో హిప్‌-హాప్‌, బ్రేక్‌డ్యాన్స్‌తో ప్రేమలో పడిపోయా. ఆ డ్యాన్సర్లు బాగా ప్రోత్సహించేవారు. ఏడాదికే పోటీలకు హాజరవడం మొదలుపెట్టా. మొదటిసారి పోటీలో పాల్గొన్నప్పుడు వేదిక ఎదురుగా ఉన్న జనాన్ని చూసి భయపడిపోయా. అయితే టాప్‌ ఎనిమిది మందిలో ఒకరిగా నిలవడం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అప్పటివరకు నేను పోటీల్లో పాల్గొంటున్నట్లు ఇంట్లో చెప్పేదాన్ని కాదు. కానీ అమ్మ రహస్యంగా నా డ్యాన్స్‌ను చూసేదట. ఇంటర్‌ అయ్యాక ‘బ్రేక్‌ బ్రహ్మ’ ప్రారంభించా. బెంగళూరులోని రెండు పాఠశాలల్లో పిల్లలకు బ్రేక్‌ డ్యాన్స్‌తోపాటు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ తరగతులు చెప్పడం మొదలుపెట్టా. ‘బ్లాక్‌ ఐస్‌ క్రూ’లో చేరిన రెండేళ్ల తర్వాత దానిలో సభ్యురాలినయ్యా. 2018లో సోలోగా దిల్లీలో ‘బీ-గర్ల్‌ క్యాటగిరీలో ప్రాజెక్ట్‌ స్ట్రీట్‌ ఆర్ట్‌’, 2019లో చెన్నై ఐఐటీలో ‘ఓపెన్‌ బ్యాటిల్లో’ విజేతగా నిలిచా. అంతేకాదు, తొలి మహిళగా ‘రెడ్‌ బుల్‌ బీసీ వన్‌ సైహెర్‌ ఇండియా’గా, ఈ ఏడాది సెప్టెంబరులో ‘సెకండ్‌ రెడ్‌బుల్‌ బీసీ వన్‌ ఇండియా’ ఛాంపియన్‌షిప్‌ గెలుచుకున్నా. అమ్మాయిలు ఈ తరహా డ్యాన్స్‌ చేసేలా నేను వేదిక సిద్ధం చేశా. ఇటీవల పోలండ్‌లో ‘రెడ్‌ బుల్‌ బీసీ వన్‌ వరల్డ్‌ ఫైనల్‌’లో నా డ్యాన్స్‌ను ప్రదర్శించా. 2024 - ఒలింపిక్స్‌ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. అమ్మాయిలు కూడా ఈ తరహా డ్యాన్స్‌ను చేయగలరనడానికి నేనే సాక్ష్యం. మరింత మంది ఈ రంగంలోకి రావాలని కోరుకుంటున్నా. సృజనాత్మకంగా డ్యాన్స్‌, క్రీడను కలిపి ప్రదర్శించేదే బ్రేక్‌ డ్యాన్స్‌ అంటాన్నేను. నాకు ఆరేళ్లప్పుడు నాన్న రోడ్డు ప్రమాదంలో చనిపోతే అమ్మే నా సోదరుడిని, నన్ను పెంచింది. ఆమే నాకు స్ఫూర్తి’ అని చెబుతున్న జొహన్నా పేరు ఇప్పుడు ‘బీ గర్ల్‌ జో’.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని