Published : 28/11/2021 01:29 IST

బహుముఖ స్ఫూర్తి

జానపదాలు పాడి సినిమాల్లో అవకాశాలను పొందిన వాళ్లను చూస్తుంటాం. కానీ ఈ అమ్మాయి.. నేపథ్య గాయనిగా రాణిస్తూనే జానపద గీతాల్లోనూ సత్తా చూపుతోంది. అంతేనా.. లిరిక్స్‌, ర్యాప్‌ రాయడం, డబ్బింగ్‌ వంటివీ సునాయాసంగా చేస్తోంది. మూడో ఏటనే గాన ప్రస్థానాన్ని ప్రారంభించి లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకుంది. తనే.. స్ఫూర్తి జితేందర్‌. ఈ యువ తరంగాన్ని వసుంధర పలకరిస్తే తన గురించి చెప్పుకొచ్చిందిలా...

నాకు మూడేళ్ల వయసులో చెల్లి ఏడుస్తోంటే ఊరుకోబెట్టడానికి అప్పటికప్పుడు ఓ పాట అల్లేసి పాడానట. అలా చిన్నప్పుడే ఏవైనా పదాలు చెబితే అప్పటికప్పుడు పాడేసేదాన్నట. అయిదేళ్లొచ్చాక ఓ సీరియల్‌ కోసం మల్లిక్‌ నాతో పాడించారు దానికి రూ.250 పారితోషికమూ ఇచ్చారు. అదే నా మొదటి సంపాదన. కమర్షియల్‌ సింగర్‌గా పాడింది మాత్రం 11 ఏళ్ల వయసులో. అది ‘యమహో యమా’ చిత్రం కోసం. ముందు మా నాన్న జితేందర్‌ ఒప్పుకోలేదు. ఆయనే దానికి దర్శకుడు. కానీ సంగీత దర్శకుడు నచ్చజెప్పారు. అలా మొదలైంది నా ప్రయాణం.

ఇప్పటివరకూ 70కిపైగా సినిమాల్లో పాడా. కిక్‌ సినిమా టైటిల్‌ సాంగ్‌తో నాకు బాగా గుర్తింపు వచ్చింది. పూరి జగన్నాథ్‌ ఇజమ్‌, లోఫర్‌ సినిమాల్లోనూ పాడా. సైమా సహా పలు అవార్డులనూ అందుకున్నా. కానీ గుర్తుపట్టడం మొదలైంది మాత్రం ‘పిల్లోడా’ పాటలో కనిపించినప్పుడు. ఇది ఆర్‌ఎక్స్‌ 100 ‘పిల్లా.. రా’ పాటకి ఫీమేల్‌ వెర్షన్‌. దానికి లిరిక్స్‌ నేనే రాశా. కొన్ని పాపులర్‌ పాటలకు ఇలా వీడియోలు చేసి పెట్టా. హుషారు సినిమా ఫీమేల్‌ వెర్షన్‌ను ఆ ఆల్బమ్‌లోనూ చేర్చారు. వీటి తర్వాతే ఎక్కడికెళ్లినా సెల్ఫీలు అడుగుతుండటం చేసేవారు. పోయినేడాది ‘సవారి’ చిత్రంలో పాడిన ‘ఉండిపోవా నువ్విలా’ పాటని ఏడుకోట్ల మందికి పైగా వీక్షించారు. 

జానపదాల వైపు ప్లాన్‌ చేసుకుని రాలేదు. 2019లో అనుకోకుండా ‘ధన్‌ ధనారే’ పాటను ఓ ప్రయోగంలో భాగంగా పాడా. బాగుందని రిలీజ్‌ చేస్తే... పెద్ద హిట్‌ అయ్యింది. ఇప్పటి వరకూ దాన్ని పది కోట్ల మందికి పైగా వీక్షించారు. ఆ తర్వాత ‘యాడవున్నడో ఎన్నెల బావ, ఉంగరాల జుట్టోడా, గుండె జల్లుమన్నదే బావా’... ఇలా ఓ 80కి పైగా జానపదాలు పాడా.

నా పాట విన్న వాళ్లందరూ.. ‘పాటకు తగ్గట్టుగా గొంతు భలే మారిపోతుంది’ అంటారు. అది నాకు వారసత్వంగా వచ్చిందనుకుంటా. అమ్మ చైతన్య శాస్త్రీయ గాయని. మా మామయ్య జై శ్రీనివాస్‌ ప్లే బ్యాక్‌సింగర్‌. తాత, ముత్తాతలు హరికథ, ఒగ్గు కథల్లో పేరుగాంచిన వాళ్లు. మా తాత నర్సింహరాజు చెప్పే హరికథల్ని వినడానికి ఊరు ఊరంతా వచ్చేసేదట. అమ్మ పాటలు చిన్నప్పటి నుంచీ వింటూ పెరిగా. నా ఆసక్తిని గమనించి తనూ ప్రోత్సహించేది. వెస్ట్రన్‌ క్లాసికల్‌ను చరితా బేన్‌ దగ్గర ఎనిమిదేళ్లు నేర్చుకున్నా. ట్రినిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ నుంచి వెస్టర్న్‌ వోకల్‌ మ్యూజిక్‌లో ఎనిమిది గ్రేడ్లు పూర్తిచేశా. లాస్‌ఏంజలిస్‌ కాలేజీలో డిప్లొమా చేయబోతున్నా. బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్యలో బీఎస్‌సీ చదువుతున్నా. ఖాళీ సమయంలో ఇంగ్లిష్‌లో ర్యాప్‌ సాంగ్స్‌ రాసి, పాడి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తా. వెబ్‌సిరీస్‌, సీరియళ్లు, సినిమాల్లో డబ్బింగ్‌ చెబుతున్నా. లాక్‌డౌన్‌ నుంచి 25 మంది పిల్లలకు సంగీత పాఠాలు చెబుతున్నా. నా లక్ష్యం హాలీవుడ్‌లో టాప్‌ 10 గాయకుల జాబితాలో చోటుతోపాటు గ్రామీ అవార్డు సాధించడం. ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే ఉన్నా. అందుకే లాస్‌ఏంజలిస్‌ వెళుతున్నా. ఎవరికైనా లక్ష్యంతోపాటు దానిపై ప్యాషన్‌ కూడా ఉండాలి. అప్పుడే విజయం సాధించగలమని నమ్ముతా. తోటి వాళ్లకూ అదే చెబుతా.. ముందు మీకేం కావాలో తెలుసుకుని దాని కోసం గట్టిగా ప్రయత్నించమని!

- జ్యోతికిరణ్‌, ఈటీవీ, హైదరాబాద్‌


Advertisement

మరిన్ని