వంటతో.. కోట్ల వీక్షకులు...

ఆమె ఓ పల్లెటూరి అమ్మాయి. కానీ వీడియో పెడితే చాలు.. కోట్ల మంది చూసేస్తారు. ఇంతకీ ఆమె పెట్టేది వేటిపైనో తెలుసా? తను చేసే వంటకాల గురించి! అంత ప్రత్యేకత ఏముంది అందులో? చదివి తెలుసుకోండి!

Updated : 30 Nov 2021 08:33 IST

ఆమె ఓ పల్లెటూరి అమ్మాయి. కానీ వీడియో పెడితే చాలు.. కోట్ల మంది చూసేస్తారు. ఇంతకీ ఆమె పెట్టేది వేటిపైనో తెలుసా? తను చేసే వంటకాల గురించి! అంత ప్రత్యేకత ఏముంది అందులో? చదివి తెలుసుకోండి!

నదీ జీవనశైలిది శ్రీలంకలోని మారుమూల గ్రామం. చదువు, ఉద్యోగమంటూ పట్టణానికి వెళ్లింది. అక్కడి పర్యావరణ కాలుష్యం, కల్తీ ఆహారం ఆరోగ్యానికి హాని చేయడం గుర్తించింది. అంతే... సొంతూరికి తిరిగి ప్రయాణమైంది. పల్లె జీవితాన్ని, అలనాటి జీవన విధానాల్ని పరిచయం చేయడం ప్రారంభించింది. తద్వారా ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తోంది. ఇది వీక్షకులను ఆకట్టుకోవడం మొదలుపెట్టింది. తన వీడియోల్లో.. తాజా ఆకు కూరలు, కాయగూరలు, పండ్లను కోయడం, భిన్న రకాలుగా వాటిని వండటం గురించి చెబుతుంది. చేసి చూపిస్తుంది కూడా. పైనాపిల్‌, అరటి, మామిడి, దానిమ్మ, కివీ, పనస తదితర పండ్లతో రసాలు, స్వీట్లూ, రంబూటన్‌, ద్రాక్ష పండ్లతో ప్రత్యేకంగా చేసే జ్యూస్‌లు, కొబ్బరి, చాక్లెట్‌ వంటి వాటితో కేకులూ తయారు చేస్తుంది. ఆయుర్వేద విలువలున్న ఆకులు, పూలతో టీలు కాచేస్తుంది. చేపలు, చికెన్‌తో రకరకాల వంటకాలు, పచ్చళ్లు చేసేస్తుంది.

ఇవన్నీ మట్టి పాత్రలు, చెక్క, కొబ్బరి చిప్పలతో చేసిన గరిటెలతో, కట్టెల పొయ్యిపైనే చేస్తుంది. మట్టి ఇల్లు, పూలతో నిండిన పరిసరాలు, పొలాలు.. చూపరులను కట్టి పడేస్తాయి. చాలామందికి అమ్మమ్మ, నానమ్మల రోజుల్ని గుర్తుకు తెస్తాయి. అవే ఎక్కువ మంది మనసుని దోచుకోవడానికి కారణమవుతున్నాయి. వీటి ప్రాముఖ్యాన్ని పరిచయం చేయడానికే ‘ట్రెడిషనల్‌ మీ’ యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించానంటుంది నదీ.

‘శ్రీలంక రుచులతోపాటు పొరుగు దేశాలవీ చూపిస్తుంటా. ఈ అందమైన వాతావరణం, ఆరోగ్యకరమైన రుచులను అందరికీ పంచాలనేదే నా లక్ష్యం. అందుకే ప్రతి వంటలో పోషకాలు ఉండేలా చూస్తా. రోలు, కట్టెల పొయ్యి వంటివన్నీ నా వంటలకు మరింత రుచిని పెంచుతాయి. మా సోదరుడు లాహిరు కూడా సొంతంగా రకరకాల పండ్ల రసాలు, మాక్‌టెయిల్స్‌, స్నాక్స్‌ చేస్తుంటాడు. బంగాళాదుంప, చిలగడ దుంప, క్యారెట్‌లతో చేసే స్వీట్లు, కివీ, పైనాపిల్‌, ద్రాక్ష పండ్లతో చేసే జామ్స్‌ అంటే తనకు చాలా ఇష్టం. వీటిని ఎక్కువరోజులు భద్రపరుస్తుంటా. ఇప్పటి వరకూ 50కిపైగా వీడియోలను ఉంచా. మొత్తం 17 కోట్లమందికి పైగా వీక్షించారు. రోస్టెడ్‌ ఫిష్‌ విత్‌ బిరియానీ, రుమానీ మామిడిపండు లడ్డు వంటకాలను కోటి మందికిపైగా చూశారు. నా ఛానెల్‌కు 13 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు. చిన్నప్పటి నుంచి రకరకాల వంటకాలు చేయడం నా అభిరుచి. ఇప్పుడిదే నా లోకమైంది’ అని చెబుతున్న నదీ వంటలు చూసిన వారందరూ ఫిదా అయ్యామంటూ కామెంట్లు పెడుతుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్