జాతీయగీతం విని ఏడ్చేశా
close
Updated : 04/12/2021 06:13 IST

జాతీయగీతం విని ఏడ్చేశా

టీవీలో దిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పెరేడ్‌ చూసి తనూ ఆ స్థానంలో నిలవాలని కలలు కంది. చదువునూ, లక్ష్యాన్నీ సమన్వయం చేసుకుంటూ ఈ ఏడాది తన ఆశయాన్ని నెరవేర్చుకుంది. అంతేనా... ఎన్‌సీసీలో అత్యున్నత గుర్తింపు అయిన కేడెట్‌ ఎక్స్‌ఛేంజ్‌ ప్రోగ్రాంకి ఎంపికైన 20 మందిలో ఏకైక తెలుగమ్మాయిగా నిలిచింది సాయి ప్రియ. తనకింకా ఎన్నో కలలు, కళలు ఉన్నాయి... ఇవన్నీ సాధించడానికి తనెలా కృషి చేసిందో వసుంధరతో పంచుకుందిలా...

నాన్న అవుతు శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టర్‌. అమ్మ శ్రీశైలజ, విజయవాడ డిప్యూటీ మేయర్‌. నాకో అన్నయ్య. ఒకసారి స్కూల్లో ఎన్‌సీసీ పెరేడ్‌ చూస్తే ఆసక్తి కలిగింది. తర్వాత టీవీలో మొదటిసారి ఇండియా గేట్‌ దగ్గర కేడెట్స్‌ మార్చ్‌ చూసి గొప్పగా అనిపించింది. అప్పటి నుంచి పీఎం ర్యాలీ నా కల. 9వ తరగతిలో ఎన్‌సీసీలో చేరా. ఇప్పుడు కేఎల్‌ యూనివర్సిటీలో బయోటెక్నాలజీ ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నా. వారంలో 2 పెరేడ్‌లు, ఏడాది పొడవునా ట్రైనింగ్‌, డ్రిల్‌, థియరీ క్లాసెస్‌ ఉంటాయి. ఎన్‌సీసీలో ఎ, బి సర్టిఫికెట్లు పూర్తిచేశా. సి సర్టిఫికెట్‌ చేస్తున్నా. లోకల్‌ క్యాంపుల్లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. ఉదయం 5 నుంచి సాయంత్రం 7 వరకు సాగే దీనిలో.. ఎక్సర్‌సైజ్‌, పెరేడ్‌ గ్రౌండ్‌లో డ్రిల్‌, థియరీ క్లాసెస్‌, వెపన్‌, రైఫిల్‌, అబ్‌స్టకిల్‌ ట్రైనింగ్‌ ఉంటాయి. ఒక్కోదాన్నీ పూర్తి చేస్తేనే మరోదానికి అవకాశం. అలాంటి 8 క్యాంప్‌లు పూర్తి చేస్తేనే రిపబ్లిక్‌ డే క్యాంప్‌లో అవకాశం. దీనిలోనూ పలు దశల్లో వడపోశాకే మార్చింగ్‌ అవకాశమిస్తారు. అలా ఈ ఏడాది దానిలో పాల్గొన్నా.
 

దేశవ్యాప్తంగా 17 డైరెక్టరేట్‌లు... తెలుగు రాష్ట్రాలు కలిపి ఒకటి. దాన్నుంచి పెరేడ్‌కు 20 మందిమి వెళ్లాం. 12 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాలకు మొదటి ర్యాంకు సాధించాం. ప్రధాని నుంచి ట్రోఫీ, ఆల్‌ ఇండియా బ్యానర్‌ను అందుకున్నాం. ఆయన ఇంటికి వెళ్లి కలిశాం కూడా. ఎంత గర్వంగా అనిపించిందో. ర్యాలీలో బ్యాండ్‌తోపాటుగా మార్చ్‌ చేస్తూ పీఎం డయాస్‌ దగ్గరికి వచ్చినపుడు ఎంత ఉద్వేగానికి గురయ్యానో. అక్కడికి చేరడానికి నేను పడ్డ కష్టం గుర్తొచ్చింది. జాతీయగీతం విన్నప్పుడు ఏడ్చేశా కూడా. ఇది కదా నా లక్ష్యం అనుకున్నా. తర్వాత నేనూహించని అవకాశం వచ్చింది. 11 రోజుల బంగ్లాదేశ్‌ యూత్‌ ఎక్స్‌ఛేంజ్‌ ప్రోగ్రామ్‌లో స్థానం దక్కింది. దీనికి దేశవ్యాప్తంగా 20 మందిని ఎంపిక చేశారు. మన గణతంత్ర దినోత్సవం లాగా బంగ్లాదేశ్‌లోనూ విక్టరీ డే నిర్వహించుకుంటారు. దానికి పొరుగు దేశాల యువతను ఎంపిక చేసి ఆహ్వానిస్తారు. అక్కడ కల్చరల్‌ ఎక్స్‌ఛేంజ్‌ ప్రోగ్రామ్‌లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నాం. దీని ద్వారా అక్కడి నాయకులు, అధికారులను కలుసుకోవచ్చు. దీనికీ పెద్ద వడపోతే జరిగింది. రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తోపాటు వివిధ సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తామన్నదీ పరిశీలించారు. తుది ఇంటర్వ్యూ ఎన్‌సీసీ డైరెక్టర్‌ జనరల్‌ స్వయంగా చేశారు.

రిపబ్లిక్‌ క్యాంప్‌కు ముందు కొవిడ్‌ నుంచి కోలుకున్నా. దాంతో ఇంట్లో భయపడ్డారు. కానీ ఇది నా కల కదా,  ప్రోత్సహించారు. చిన్నప్పటి నుంచీ సైన్స్‌ అన్నా చాలా ఇష్టం. జెనెటిక్‌ ఇంజినీరింగ్‌లో పీజీ చేసి, పరిశోధనల వైపు వెళ్తా. నాకు ఆర్మీ మెడికల్‌ కోర్‌కి వెళ్లాలని ఉంది. ఇదే నా ప్రస్తుత కల. వీటన్నింటిలో పడి స్నేహితులు, అభిరుచుల్ని వదల్లేదు. కాలేజీ యాక్టింగ్‌ క్లబ్‌లో సభ్యురాలిని. పాటలూ పాడతా. వారాంతాల్ని స్నేహితులు, కుటుంబానికి కేటాయిస్తా. ఎప్పుడు డీలా పడినా.. ‘లక్ష్యాన్ని కాదు.. దాన్ని చేరుకునే క్రమంలో ఉన్న ఈ రోజుపై దృష్టి పెట్టు’ అని నాన్న చెబుతారు. స్నేహితులూ ఫోన్‌ చేసి ఉత్సాహపరుస్తారు. ఇంజినీరింగ్‌లో నా ఆసక్తిని చెప్పినపుడు ఎన్‌సీసీ ఆఫీసర్‌, మా యూనివర్సిటీ యాజమాన్యం చాలా సపోర్ట్‌ చేశారు. వీటితోపాటు... నా స్వీయ నమ్మకం, కష్టపడే తత్వం నా లక్ష్యాన్ని చేరుకోవడానికి కారణమయ్యాయి. ప్రతి అమ్మాయీ వీటిని అలవరచుకోవాలని చెబుతా.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని