ఈ పైలట్‌.. డాక్టర్‌
close
Updated : 05/12/2021 06:10 IST

ఈ పైలట్‌.. డాక్టర్‌

వైద్యం, విమానం నడపడం రెండూ ఇష్టమే. ఒకదాన్నే ఎందుకు ఎంచుకోవాలనుకుంది. అందుకే రెండింటినీ చేసి ‘ద యంగెస్ట్‌ డాక్టర్‌ పైలట్‌’గా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం పొందింది. ఓవెపు కొడుకుని చూసుకుంటూనే రెండు బాధ్యతల్నీ నిర్వర్తిస్తోంది. ఇటీవల ‘మిసెస్‌ ఇండియా ప్రైడ్‌ ఆఫ్‌ నేషన్‌’ పోటీల్లో ‘ఫేస్‌ ఆఫ్‌ నార్త్‌’ కిరీటాన్నీ దక్కించుకుంది. ఇవన్నీ తరన్‌జ్యోత్‌ కెయింత్‌కు ఎలా సాధ్యమయ్యాయో చదివేయండి.

చిన్నప్పటి నుంచీ ఆకాశంలో ఎగరాలని కలలు కనేది తరన్‌ జ్యోత్‌. చదువులో ఎప్పుడూ ముందే. తండ్రిని చూసి వైద్యంపైనా ఆసక్తి కలిగింది. ఇంటర్‌ పూర్తయ్యాక ఏది ఎంచుకోవాలా అని ఆలోచనలో పడింది. అమ్మానాన్నల్ని అడిగితే నీ ఇష్టమన్నారు. మొదట మెడికల్‌ ఎంట్రన్స్‌లో ర్యాంకు సాధించి దిల్లీ మౌలానా అజాద్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తిచేసింది. కానీ పైలట్‌ అవ్వాలన్న కోరిక నిలువనీయలేదు. ఈసారి దానిపై దృష్టిపెట్టింది. వైద్యురాలిగా సేవలందిస్తూనే, పైలట్‌ కోర్సు చేసి కమర్షియల్‌ పైలట్‌ అయ్యింది. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ‘ద యంగెస్ట్‌ విమెన్‌ డాక్టర్‌ పైలట్‌’ స్థానాన్ని దక్కించుకుంది.

ఆత్మవిశ్వాసమే... ‘చిన్నప్పుడు నాన్నని చూసి.. నాకూ ఆయనలాగే సేవ చేయాలనిపించేది. స్కూల్‌ మైదానంలో ఉన్నప్పుడు పైన ఎగిరే విమానాలను చూసి వాటిని నేనెప్పుడు నడుపుతానా అనుకునేదాన్ని. ఈ రెండూ నా మనసుపై ముద్ర వేశాయి. దేన్ని సాధించాలన్నా ముందు బాగా చదవాలని అర్థమైంది. అందులోనూ అమ్మానాన్న నాకిష్టమైన కెరీర్‌ ఎంచుకోమని ప్రోత్సహించేవారు. దాంతో రెండూ చేయాలనుకున్నా. ముందు డాక్టర్‌నై, తర్వాత పైలట్‌ కలను పూర్తి చేసుకున్నా. పెళ్లైంది, ఆరేళ్ల బాబు. ఇంటితోపాటు రెండు కెరియర్‌లనూ సమన్వయం చేయడం కష్టమైనా ఇష్టంగా చేస్తున్నా. అందం, ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే నాకు.. అందాల పోటీల్లోనూ పాల్గొనాలని ఉండేది. ఈ ఏడాది నవంబరులో ‘మిసెస్‌ ఇండియా ప్రైడ్‌ ఆఫ్‌ నేషన్‌ 2021’ పోటీల్లో పాల్గొన్నా. ‘ఫేస్‌ ఆఫ్‌ నార్త్‌’గా కిరీటాన్ని దక్కించుకున్నా.

లక్ష్యం ఉంటే చాలదు. దానికి తగిన కృషి, పట్టుదల ఉంటేనే అనుకున్నది సాధించగలుగుతాం అని నమ్ముతా. ఎన్నో అవకాశాలు మన ముందున్నాయి. అందుకొని కొంచెం కష్టపడితే చాలు. విజయం మనదే. జీవితం ఏదిస్తే అది తీసుకోవాలి అనుకోకుండా ఉన్న ఈ ఒక్క జీవితాన్ని మనకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుకోవాలి’ అని చెబుతున్న తరన్‌జ్యోత్‌ను చూసి మనం చాలా నేర్చుకోవాలి కదూ...!

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని