close
Published : 08/12/2021 00:40 IST

ఆమె లక్ష్యం.. లక్షమంది

సాధారణ గృహిణులు వ్యాపారులయ్యారు. వంటింటి నుంచే సాధికారత సాధించారు. వారికి ఆ అవకాశం కల్పించింది.. పుణెకు చెందిన అదితి అగర్వాల్‌. తన ఫుడ్‌ టెక్‌ వేదిక ద్వారా వెయ్యిమంది గృహిణులకు ఉపాధిని అందించింది. 20వేలమందికి పైగా వినియోగదారులకు ఈ రుచులను అందిస్తోంది. లక్షమంది మహిళలకు ఉపాధినివ్వడమే లక్ష్యమంటోన్న ఈమె ప్రయాణాన్ని మనమూ చూద్దామా!

దితికి చిన్నప్పటి నుంచి రకరకాల వంటకాలపై ఆసక్తి. ఇంజినీరింగ్‌ చేసి, ఏడేళ్లపాటు ఐటీ సంస్థల్లో పనిచేసింది. ఆ తర్వాత ఇష్టమైన కెరీర్‌లోకి అడుగు పెట్టాలనుకుని ‘ఫుడ్‌గినీ’ని ప్రారంభించింది. పూర్తిగా శాఖాహారాన్ని, అందులోనూ ఉత్తరాది రుచులను దేశవ్యాప్తంగా రుచి చూపించాలనుకుంది. ఆన్‌లైన్‌ వేదికగా మొదలుపెట్టి రెండేళ్లలోనే పుణెతోపాటు ముంబయి, సూరత్‌, రాయ్‌పుర్‌ల నుంచీ ఆర్డర్లను అందుకోగలిగింది. ఆయా ప్రాంతాల్లో థర్డ్‌ పార్టీ ఫుడ్‌ డెలివరీ డిస్ట్రిబ్యూటర్స్‌ను ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. గతేడాది కొవిడ్‌ నేపథ్యంలో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయి. ఇంటికి ఆధారమైన వ్యక్తి ఉద్యోగాన్ని కోల్పోవడంతో తినడానికీ లేక కష్టపడ్డ వారెందరో. ఆ కుటుంబాల గృహిణులకు చేయూతను ఇవ్వాలనుకుందీమె.

‘వీళ్లలో చాలామంది పాకశాస్త్ర ప్రవీణులే. వారికోసం గతేడాది ‘పింక్‌ ఆప్రాన్స్‌’ ప్రారంభించా. ఇంటిపట్టునే ఉండి వారి నైపుణ్యాల్ని ప్రదర్శించగలిగే వేదికగా దీన్ని మార్చా. మహిళా సాధికారతను కల్పించడానికి నేను చేసిన ఈ ప్రయత్నం చాలామందికి ఆర్థిక చేయూతను ఇచ్చింది. తమకు తెలిసిన వంటలతో ఆదాయాన్ని పొందడంలో ఆ మహిళలూ విజయం సాధించారు. ఈ రుచులను ఆస్వాదించే వారితోపాటు ఉపాధి పొందే మహిళల సంఖ్యా పెరిగింది. అలా ఏడాదిలోనే వెయ్యిమందికిపైగా మహిళలు ఈ వేదికద్వారా 20వేలమందికి తమ వంటకాలను అందించగలిగారు. కొవిడ్‌ తర్వాత అందరూ ఆరోగ్యకరమైన, ఇంట్లో వండే, పరిశుభ్రమైన ఆహారానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో మాకు వ్యక్తిగతంగానే కాకుండా క్లౌడ్‌ కిచెన్స్‌, రెస్టారెంట్స్‌ నుంచీ ఆర్డర్లు వస్తున్నాయి. హోంచెఫ్స్‌ వండిన వంటకాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచి, ఆర్డర్లకు తగ్గట్లుగా డెలివరీ చేస్తుంటాం. డెలివరీ, ఆన్‌లైన్‌ ఫాలోయింగ్‌, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వంటివన్నీ పర్యవేక్షించడానికి కొందర్ని నియమించుకున్నాం. ఇలా ఇంతమందికి ఉపాధి కల్పించడం సంతోషంగా ఉంది.

వినియోగదారుల సంతృప్తిని చూసినప్పుడు మరింత ఆనందంగా ఉంటుంది. ఈ స్థాయికి రావడానికి సవాళ్లనూ ఎదుర్కొన్నా. ఆర్డర్‌ సిద్ధం చేశాక కొందరు క్యాన్సిల్‌ చేసేవారు. దాంతో కొంత ఒత్తిడి. చెఫ్స్‌ కూడా ఆందోళన చెందేవారు. కొన్నిసార్లు అరగంట కన్నా ఎక్కువ సమయం డెలివరీకి తీసుకుంటే కొందరు రిజెక్ట్‌ చేసేవారు. వీటన్నింటికీ పరిష్కార మార్గాలను ఆలోచించాం. 70శాతం అనుకూలంగా వచ్చే ఫీడ్‌బ్యాక్‌ మాకు సాయపడింది. వంటలు చేసేవారంతా ఎఫ్‌ఎస్సెస్‌ఏఐ సర్టిఫైడ్‌. ఇందులో చేరాలనుకునేవారికి ముందుగా శిక్షణనిస్తాం. రోజుకి 150-200 ఆర్డర్లు వస్తున్నాయి. పార్టీలు, కార్పొరేట్‌ సంస్థలు, ఇళ్లల్లో శుభకార్యాలకూ ఆహారాన్ని అందిస్తున్నాం. నా లక్ష్యం లక్షమంది గృహిణులకు సాధికారత కల్పించాలనే’ అని అంటోంది అదితి.


Advertisement

మరిన్ని