అందమైన ఆల్‌రౌండర్‌
close
Published : 08/12/2021 00:40 IST

అందమైన ఆల్‌రౌండర్‌

ఆ అమ్మాయి ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఇంకా.. మోడల్‌, గాయని, నృత్యకారిణి, రేడియోజాకీ. మేనేజ్‌మెంట్‌ విద్యార్థిని కూడా! అప్పుడే ఆశ్చర్యపోకండి. ఇంకా ఉంది.. తాజాగా మిస్‌ సౌత్‌ ఇండియా పోటీల్లో తెలంగాణ క్వీన్‌గానూ నిలిచింది. సాధారణ మధ్యతరగతి అమ్మాయి.. ఎలాంటి శిక్షణ లేకుండా సాధించింది ఇది! దీప్తి శ్రీరంగం.. అసలు తన లక్ష్యం అందాల పోటీల్లో గెలవడమే! వసుంధర ఆమెను పలకరించగా బోలెడు విషయాలను పంచుకుంది.

మాది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మార్కాపురం. మధ్యతరగతి  కుటుంబం. నాన్న శ్రీరంగం నరసింహాచారి, అమ్మ అనురాధ. ఇంజినీరింగ్‌ చేసి, హైదరాబాద్‌లో టెక్‌ మహీంద్రాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నా. ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నా. నేను మొదట్నుంచీ చురుకే. ఫస్ట్‌ ర్యాంకర్‌ అని చెప్పను కానీ బాగానే చదువుతా. కానీ సాంస్కృతిక కార్యక్రమాలంటే మాత్రం ముందుంటా. సంగీత, నృత్యపోటీలేమున్నా పాల్గొంటా. ఎన్నో బహుమతులూ గెలుచుకున్నా. బీటెక్‌ చదువుతున్నపుడే నా మనసు అందాల పోటీలవైపు మళ్లింది. అది 2017.. మానుషి చిల్లర్‌ మిస్‌ ఫెమీనా, మిస్‌ వరల్డ్‌గా ఎంపికైంది. ప్రపంచ వేదికపై కిరీటంతో ఆమెను చూడటం నన్ను ఆకర్షించింది. నాకూ అలా పోటీపడాలనిపించింది. అసలు దానికేం అర్హతలు కావాలో గూగుల్‌లో వెతికా. ఇక్కడ గెలవడానికి అందం ఒక్కటే సరిపోదని తెలుసుకున్నా. వెతికేకొద్దీ ఆసక్తి బాగా పెరిగింది. ఎప్పటికైనా ‘మిస్‌ ఇండియా’ టైటిల్‌ గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నా. గూగుల్‌, యూట్యూబ్‌లో వెతికి సాధన చేసేదాన్ని. నేను శాస్త్రీయ నృత్యకారిణిని, పాటలూ బాగా పాడతా. దీంతో రేడియో జాకీగా ప్రయత్నించా. అవకాశమొచ్చింది. ఇవన్నీ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో అవకాశాలు వెతుక్కుంటూ హైదరాబాద్‌ చేరుకున్నా. గత ఏడాది ఫెమినా మిస్‌ ఇండియా పోటీలకు ప్రయత్నించా. ఆడిషన్లు ఆన్‌లైన్‌లో నిర్వహించారు. కానీ ఎంపికవ్వలేదు. నిరాశపడ్డా కానీ కుంగిపోలేదు. ఈసారి మరింత సాధనపై దృష్టిపెట్టా. ఈ ఫిబ్రవరిలో మిస్‌ ర్యాంప్‌ వాక్‌ పోటీల్లో పాల్గొని వింగ్స్‌ మెడల్‌ గెల్చుకున్నా. పీజీ కళాశాలల క్యాంపస్‌ ప్రిన్సెస్‌ పోటీల్లో ఎంపికైనవారికి మిస్‌ ఇండియా కాంపిటిషన్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుందని తెలుసుకొన్నా. అందుకోసమే ఎంబీఏలో చేరా. అలా ఈ ఏడాది కోయంబత్తూరులో జరిగిన 19వ ఎడిషన్‌ మణప్పురం మిస్‌ ఇండియా - 2021 గ్రాండ్‌ ఫినాలే పోటీల్లో పొల్గొనే అవకాశం దక్కించుకున్నా. దాన్ని వినియోగించుకోవాలని గట్టిగా ప్రయత్నించా. నాలుగో స్థానంలో నిలవడంతోపాటు మిస్‌ సౌత్‌ ఇండియా తెలంగాణ క్వీన్‌ కిరీటం గెలుచుకున్నా. టీవీ ప్రకటనలకు మోడలింగ్‌నూ చేస్తున్నా. డిస్నీ హాట్‌ స్టార్‌ యాడ్‌లో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తో కలిసి నటించడం మర్చిపోలేని అనుభూతి. ఇది నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నిజానికి ఆర్థిక ఇబ్బందులేమీ లేవు. ముంబయి, పుణె, చెన్నై.. ఇలా పెద్ద నగరాల్లో ఎన్నో సంస్థలు శిక్షణనిస్తున్నాయి. కానీ సొంతంగా ప్రయత్నించాలన్నది నా అభిమతం. అందుకే శిక్షణవైపు దృష్టిపెట్టట్లేదు. ఇప్పటివరకూ నా వైఫల్యాలనే పాఠాలుగా చేసుకుంటూ ముందుకు సాగుతున్నా.

నా ఆలోచనను ఇంట్లో పంచుకున్నప్పుడు అమ్మానాన్న, నా సోదరుడు ప్రోత్సహించారు. బీటెక్‌ నుంచి స్నేహితుల మద్దతూ తోడైంది. దీంతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళుతున్నా. ఓ చిన్న పట్టణం నుంచి హైదరాబాద్‌లో అవకాశాల కోసం అడుగుపెట్టా. ఇప్పుడిప్పుడే సఫలీకృతమవుతున్నా. తాజా గెలుపు నాకు ఓ బూస్టర్‌. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌ నాకు స్ఫూర్తి. తనలా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచ వేదికపై పోటీపడాలన్నది నా కల. ఆ దిశగా కృషి చేస్తున్నా. అక్కడి చేరుకుంటానన్న నమ్మకం ఉంది. అందాల పోటీల్లోనే కాదు ఏ రంగంలోనైనా.. సవాళ్లు ఉంటాయి. ఆత్మవిశ్వాసం, సాధించాలన్న తపన, కృషి ఉంటేనే సాధించగలం. ముందు ఆ ధైర్యం చేయాల్సింది మాత్రం మనమే! 

- మల్లిక్‌ బస్వోజు, ఈటీవీ, హైదరాబాద్‌


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని