లోపాన్ని ఆటతో జయిస్తోంది

పుట్టుకతోనే దివ్యాంగురాలు. కానీ ఆ లోపాన్ని తలచుకొని బాధపడలేదామె. ఆటలపై దృష్టిపెట్టి, పతకాలు సాధించింది. దేశానికే ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగింది. రాష్ట్రపతి నుంచి ఉత్తమ క్రీడాకారిణిగా అవార్డునూ అందుకుంది.

Published : 09 Dec 2021 01:28 IST

పుట్టుకతోనే దివ్యాంగురాలు. కానీ ఆ లోపాన్ని తలచుకొని బాధపడలేదామె. ఆటలపై దృష్టిపెట్టి, పతకాలు సాధించింది. దేశానికే ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగింది. రాష్ట్రపతి నుంచి ఉత్తమ క్రీడాకారిణిగా అవార్డునూ అందుకుంది. సాధించాలన్న తపనకు వైకల్యం ఎప్పుడూ అడ్డుకాదని నిరూపిస్తోంది షేక్‌ జాఫ్రిన్‌.

ర్నూలుకు చెందిన జాఫ్రిన్‌ పుట్టుకతోనే చెవిటి, మూగ. స్పీచ్‌థెరపీ సాయంతో కొంచెం మాట్లాడగలదు. నాన్న షేక్‌ జాకీర్‌ అహ్మద్‌ అడ్వొకేట్‌, అమ్మ మయూన్‌ రెహనా గృహిణి. ఆటలపై తన ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు. అలా ఏడేళ్ల వయసు నుంచే లాన్‌ టెన్నిస్‌ సాధన చేస్తోంది. ఉదయం 4 గంటలకే సాధన ప్రారంభించి.. ఫిట్‌నెస్‌, ఆటకి రోజూ 4 గంటలు కేటాయిస్తుంది. ప్రస్తుతం భారత డెఫ్‌ టెన్నిస్‌ జట్టుకు కెప్టెన్‌. 2014 జర్మనీలో జరిగిన ఓపెన్‌ డెఫ్‌ యూత్‌ టెన్నిస్‌ కప్‌లో సింగిల్‌, డబుల్స్‌ విభాగాల్లో 2 వెండి, 2015 ఏషియన్‌ పసిఫిక్‌ గేమ్స్‌లో డబుల్స్‌ విభాగంలో కాంస్యం, 2016 స్లోవేనియాలో జరిగిన డబుల్స్‌లో బంగారం, కంస్య పతకాలు, 2017 టర్కీలో జరిగిన డెఫ్‌ ఒలింపిక్స్‌లో మిక్సిడ్‌ డబుల్‌ విభాగంలో కాంస్యం, 2018 స్లోవేనియా ఓపెన్‌ డెఫ్‌ టెన్నిస్‌ పోటీల్లో వెండి పతకాలు సాధించింది. ఇప్పటివరకు 9 అంతర్జాతీయ, 8 జాతీయస్థాయి పతకాలు గెలిచింది. డెఫ్‌ క్రీడాకారుల్లో (ఏఐఎస్‌సీడీ) ఈమెది దేశంలో మొదటి, ప్రపంచంలో (ఐసీఎస్‌డీ) 12వ ర్యాంకు. ఈనెల దిల్లీలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ఉత్తమ క్రీడాకారిణి అవార్డునూ అందుకుంది.  చదువులోనూ ముందే. పదిలో ఏ గ్రేడ్‌తోపాటు ప్రతిభ, నగదు బహుమతుల్ని అందుకుంది. ఇంటర్‌లో 70 శాతంపైగా మార్కులొచ్చాయి. ప్రస్తుతం ఎంసీఏ చదువుతోంది.

‘మధ్యతరగతి కుటుంబమైనా ఎంచుకున్నది ఖర్చుతో కూడుకున్న ఆటైనా ఇంట్లోవాళ్లు వెనకాడలేదు. నాపై నమ్మకంతో మెరుగైన శిక్షణను ఇప్పిస్తున్నారు. ఇందుకోసం ఆస్తులూ అమ్మారు. అప్పు చేసి మరీ నా లక్ష్యం చేరుకోవడానికి బాటలు వేస్తున్నారు. బెంగళూరులోని పీబీఐ టెన్నిస్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నా. నెలకు రూ.1.28లక్షలు వరకూ ఖర్చవుతోంది. వచ్చే ఏడాది మేలో బ్రెజిల్‌లో జరిగే 24వ సమ్మర్‌ డెఫ్‌ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించడం నా లక్ష్యం. కొంచెం ఆర్థిక ఆసరా ఇస్తే.. దేశానికి మరిన్ని పతకాలు తీసుకురాగలననే నమ్మకం ఉంది’ అని చెబుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్