వృథాతో వ్యాపారం

దుస్తులు చిరిగినా, పాడైనా పక్కనపెట్టేస్తాం. ఇదీ పర్యావరణానికి హానే! వీటిని రీసైక్లింగ్‌ చేస్తే వృథాని అరికట్టొచ్చు కదా! ఇదే ఆలోచించింది దిల్లీకి చెందిన ఫ్యాషన్‌ డిజైనర్‌. పరిశ్రమల్లో వృథాగా పడేసే వస్త్రాలను రీసైక్లింగ్‌ చేస్తూ కొత్త డిజైన్లను సృష్టిస్తోంది. కృతి తుల.. ఎకోఫ్రెండ్లీ బ్రాండ్‌ డూడ్‌లెజ్‌ను ప్రారంభించింది.

Updated : 12 Dec 2021 05:40 IST

దుస్తులు చిరిగినా, పాడైనా పక్కనపెట్టేస్తాం. ఇదీ పర్యావరణానికి హానే! వీటిని రీసైక్లింగ్‌ చేస్తే వృథాని అరికట్టొచ్చు కదా! ఇదే ఆలోచించింది దిల్లీకి చెందిన ఫ్యాషన్‌ డిజైనర్‌. పరిశ్రమల్లో వృథాగా పడేసే వస్త్రాలను రీసైక్లింగ్‌ చేస్తూ కొత్త డిజైన్లను సృష్టిస్తోంది. కృతి తుల.. ఎకోఫ్రెండ్లీ బ్రాండ్‌ డూడ్‌లెజ్‌ను ప్రారంభించింది.

ప్రకృతిలో ఏదీ వృథా కాదు.. రీసైకిల్‌ చేస్తే తిరిగి వాడుకోవచ్చు అంటుంది కృతి. పర్ల్‌ అకాడమీ, లండన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌లో ఫ్యాషన్‌ డిజైన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ పొందింది. చదువు పూర్తయ్యాక 2010లో ఒక అతిపెద్ద ఎక్స్‌పోర్ట్‌ హౌస్‌లో ఇంటర్న్‌షిప్‌ కోసం చేరింది. అక్కడ పెద్ద ఎత్తున వృథా వస్త్రాలన్నీ కుప్పలా చూసింది. దీన్ని చూసి ఆమెలోని సృజనాత్మకత కొత్త మార్గాలను అన్వేషించింది. డిజైన్‌లో పొరపాట్లు, రంగుల తేడా, మిషన్‌పై వచ్చినప్పుడు జరిగే తేడాలే ఈ వృథా ఏర్పడటానికి కారణమయ్యేది. ఎక్స్‌పోర్ట్‌కు ఉపయోగపడకపోవడంతో వాటిని వ్యర్థంకింద లెక్కేసేవారు. వాటిని రీసైకిల్‌చేసి కొత్త దుస్తులుగా మారిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. కొన్నేళ్లు అక్కడ పనిచేసి, ఓ సంస్థను స్థాపించాలనుకుంది.

తాను ప్రారంభించే బ్రాండ్‌ పర్యావరణాన్ని పరిరక్షించేదిగా ఉండాలనుకుంది కృతి. 2012లో ఎకో ఫ్రెండ్లీ స్టార్టప్‌ ‘డూడ్‌లేజ్‌’ను ప్రారంభించింది. తన డిజైన్లకు పూర్తిగా వృథా వస్త్రాన్నే ఎంచుకుంది. పెద్దపెద్ద తానుల్లో మిగిలిన చివరి పీసెస్‌, మెషిన్‌పై జరిగిన పొరపాటు కారణంగా మిగిలిన వస్త్రం.. వంటివన్నీ కృతి చేతిలో ముడిసరుకుగా మారాయి. వీటి కోసం వివిధ ఫ్యాబ్రిక్‌ ఎక్స్‌పోర్ట్‌, మాన్యుఫాక్చరింగ్‌ సంస్థల నుంచి వస్త్రాన్ని సేకరించడం మొదలుపెట్టింది.

ఏదీ వృథా కాదు.. ‘నైలాన్‌, పాలిస్టర్‌ వంటివి భూమిలో కలవడానికి 200 ఏళ్లకు పైగానే పడుతుంది. పత్తి పంటకు వినియోగించే ఎరువులు, పురుగుల మందులు.. కాలుష్య కారకాలే. భవిష్యత్తులో ఇది పెద్ద విపత్తుకు కారణమవచ్చు కూడా. ఇదే కొనసాగితే రేపటి తరానికి ఆరోగ్యవంతమైన, సారవంతమైన భూమిని ఇవ్వలేం. ఆ తర్వాత పండే పంటలూ అనారోగ్యాలకు దారితీసే ప్రమాదముంది. ఒక పెద్ద గార్మెంట్‌ లేదా ఎక్స్‌పోర్ట్‌ సంస్థ నుంచి రోజుకి సుమారు 45వేల మీటర్ల వృథా వస్త్రం బయటికి వస్తుంది. ఇందులో కొంత బొంతల తయారీదారులకు, ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరింగ్‌ సంస్థలకు విక్రయించగా మిగతాది బయటపడేస్తుంటారు’ అని ఆవేదన వ్యక్తం చేస్తోంది కృతి.

‘సేకరించిన వస్త్రాన్ని రకాన్ని బట్టి విడదీస్తాం. అన్నింటినీ కలిపి ఒకే వస్త్రంలా స్టిచ్‌ చేయిస్తాం. ఆ తర్వాత మిక్సింగ్‌, పేచింగ్‌, ఎంబ్రయిడరీ, మిషన్‌వర్క్‌ వంటివన్నీ చేయిస్తూ డిజైన్‌కు తగ్గట్లుగా తీర్చిదిద్ది, ఆపై దుస్తులను రూపొందిస్తాం. మిగిలిన ఫ్యాబ్రిక్‌లో కొంత భాగాన్ని బ్యాగులు, హోమ్‌ ఫర్నీచర్‌ లేదా కలెక్షన్స్‌ వంటి తయారీకి, మరికొంత భాగాన్ని మా ప్రత్యేక యూనిట్‌కు అందిస్తాం. ఈ వస్త్రంతో కాగితం తయారుచేసి ట్యాగ్స్‌, కవర్లు రూపొందిస్తాం. ప్యాకింగ్‌కీ వృథా వస్త్రాన్నే వినియోగిస్తాం. అసలు వృథా అనేదే లేకుండా ప్రతిఒక్కదాన్ని ఉపయోగకరంగా మార్చాలన్నదే నా లక్ష్యం. రీసైక్లింగ్‌ ఇప్పుడు నయాఫ్యాషన్‌. దేశంలో మా డిజైన్స్‌ 40 మల్టీ డిజైనర్‌ స్టోర్స్‌తో దొరుకుతున్నాయి. సొంత వెబ్‌సైట్‌నూ ప్రారంభించాం. విదేశాల నుంచీ ఆర్డర్లు అందుకుంటున్నాం. ఇప్పుడు ఎన్నో ఎక్స్‌పోర్ట్‌, మాన్యుఫాక్చరింగ్‌, వీవింగ్‌ సంస్థలు, బ్రాండ్స్‌ తమ వృథా వస్త్రాల్ని పంపి, షార్ట్‌ కలెక్షన్స్‌ తయారు చేసివ్వమని కోరుతున్నాయి’ అని చెబుతున్న కృతి ఈ క్రమంలో ఎన్నో సవాళ్లనూ ఎదుర్కొంది. వాటిని దాటుకుంటూ ముందుకు సాగుతోన్న ఈమె కృషికి ‘గ్రీన్‌ వార్డ్‌రోబ్‌ ఇనీషియేటివ్‌’, ‘గ్రేజియా యంగ్‌ ఫ్యాషన్‌’ అవార్డులు వరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్