Updated : 18/12/2021 13:15 IST

21తో మేలెంత?

కలలకు రెక్కలు తొడుక్కుని నింగిలోకి స్వేచ్ఛగా ఎగరాలనుకునే సమయంలో ఆ రెక్కలని విరిచేస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం చాలామంది అమ్మాయిల పరిస్థితి కూడా అలానే ఉంది. శరీరాన్నీ.. మనసునీ, కట్టుకోబోయే వాడినీ, ప్రపంచాన్నీ... పూర్తిగా అర్థం చేసుకోకుండానే పెళ్లి అనే బంధంలోకి అడుగుపెట్టాల్సి వస్తోంది. దాని ఫలితమే ‘ఆడపిల్ల బలహీనంగా మారుతోంది’. ఈ నేపథ్యంలో ‘21’కి మారనున్న పెళ్లి వయసు అమ్మాయిలకు ఎంతవరకూ ప్రయోజనమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!


పరిణతి వస్తుంది

- డాక్టర్‌ జె.కృష్ణసాహితి, సైకియాట్రిస్టు

ఆడపిల్లల్లో కొందరికి 12 ఏళ్లకి నెలసరులు మొదలయితే... కొందరికి ఆలస్యంగా 15కి మొదలవుతాయి. ఇలాంటి పిల్లలకి 18 ఏళ్లకే పెళ్లయితే శారీరకంగా చాలా సమస్యలు ఎదురవుతాయి. అవి తీవ్రమైతే మానసిక ఇబ్బందుల్నీ ఎదుర్కోవాలి. 15 నుంచి 20 ఏళ్ల మధ్య వయసులో నెలసరుల వల్ల ఆడపిల్లలు తీవ్ర రక్తహీనతను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమయంలో వీళ్లకి పెళ్లై గర్భం కూడా వస్తే ఐరన్‌ లోపం తల్లీ, బిడ్డలపై పడుతుంది. దాంతో వాళ్లు సాధారణ తల్లుల మాదిరిగా ‘అమ్మతనాన్ని’ ఆస్వాదించే పరిస్థితి ఉండదు. అదే 21 ఏళ్లకు అయితే ఎనీమియా సమస్య అంత తీవ్రంగా ఉండదు. అన్నింటికంటే ముఖ్యంగా 21 ఏళ్లకు అమ్మాయిలు డిగ్రీ  పూర్తి చేస్తారు. మనసు, శరీరం పరిణతి చెందిన వయసది. చిన్నదో పెద్దదో ఉపాధిని వెతుక్కుంటారు. అత్తింట్లో చదువుకున్న అమ్మాయికీ, సంపాదనాపరులకీ ఉండే స్థానం వేరు. భర్త చేతిలో మోసపోవడానికి ఆస్కారం తక్కువ. ఏదైనా కారణాలతో భర్త కుటుంబాన్ని నడపలేని స్థితిలో ఉన్నా, విభేదాలొచ్చినా చదువుకున్న అమ్మాయి ధైర్యంగా ఉండగలుగుతుంది. పరిణతితో వ్యవహరిస్తుంది. అదే 18కే వివాహ బంధంలోకి అడుగుపెడితే... డిగ్రీ పూర్తిచేయడానికి కూడా భర్త, అత్తమామల అనుమతి తీసుకోవాలి. గర్భం వస్తే ఆ చదువు అటకెక్కుతుంది. అటు చదువులేక... ఇటు ఉపాధి లేక ఒకరిపై ఆధారపడాల్సిన పరిస్థితి ఆమెను మానసికంగా బలహీనురాలిని చేస్తుంది. తల్లిదండ్రులు చూపించిన అబ్బాయి లేదా తాను ఇష్టపడ్డ అబ్బాయి తనకు తగిన వాడా కాదా అనేది తెలుసుకునేందుకు కూడా 21 ఏళ్లు మంచి వయసు. ఎందుకంటే ఈ వయసులో ఎమోషనల్‌ కోషెంట్‌ అనేది అమ్మాయిలు సాధించుకోగలుగుతారు.


పటిష్ట వ్యవస్థ అవసరం!
- రమేష్‌ శేఖర్‌ రెడ్డి, మహిత స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌

అమ్మాయిల పెళ్లి వయసుని 18 నుంచి 21కి మార్చడం మంచి మార్పే. అంత మాత్రాన సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయనుకుంటే పొరపాటే. ఎందుకంటే... పెళ్లి వయసు 18 ఉన్నప్పుడే ఎన్నో బాల్యవివాహాలు జరిగాయి. వాటిల్లో ఎన్నింటి గురించి ఫిర్యాదులు అందాయి? ఎంతమంది బాలికా వధువులకు తగిన న్యాయం జరిగింది. లాక్‌డౌన్‌లో తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్నో బాల్య వివాహాలు నమోదయ్యాయి. దీనికి కారణం... అమ్మాయిని ఒక డెడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌గా, బరువుగా భావించడం. ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది అన్న భావన. ఈ లింగ వివక్ష పోనంత వరకూ ఇలాంటి మార్పులు కోరుకున్న ఫలితాలని ఇవ్వకపోవచ్చు. వయసు పెరిగేకొద్దీ... అమ్మాయిలకు ఎక్కువ కట్నం ఇచ్చుకోవాల్సి వస్తుందన్న భయంతో మరిన్ని ఇల్లీగల్‌ వివాహాలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదే జరిగితే... ఆ పెళ్లిళ్ల గురించి ఎవరు ఫిర్యాదు చేస్తారు? దానికో పటిష్టమైన వ్యవస్థ ఉందా అనేది చూసుకోవాలి. బదులుగా అమ్మాయిలు చదువుకోవడానికీ, స్కిల్స్‌ నేర్చుకోవడానికి కావాల్సిన పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. డ్రాపవుట్లు పెరిగిపోకుండా... సురక్షితమైన రవాణా, రెసిడెన్షియల్‌ హాస్టల్‌ సదుపాయాలు ఏర్పాటు చేయాలి. కొంతమందికి డిగ్రీ అంటే ఇష్టం లేకపోవచ్చు. అలాంటి వారికి స్కిల్స్‌ని పెంచే వొకేషనల్‌ కోర్సులని పెంచితే మంచిది. ఇవన్నీ జరిగితే వాళ్లు వాళ్ల కాళ్ల మీద నిలబడితే 18 ఏళ్లకే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏ ఆడపిల్లకీ ఉండదు. తల్లిదండ్రులూ ఆ వయసులో పెళ్లి అనే ఆలోచన విరమించుకుంటారు.

అమ్మాయిల పెళ్లి వయసుని 18 నుంచి 21 ఏళ్లకు మార్చాలన్న నిర్ణయం వల్ల ఎంతవరకు మేలు కలుగుతుంది?


Advertisement

మరిన్ని