Updated : 30/12/2021 04:43 IST

మార్పు మంచిదే!

నెలసరుల వల్ల అమ్మాయి చదువుకు దూరం అవ్వాలా? ప్రయాణాలు చేయలేని పేద మహిళలు ఉద్యోగాలు వదులుకోవాలా? ఇవేకాదు మహిళలని వెనక్కిలాగాలని చూసే అనేక ఇబ్బందులకు చెక్‌పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కొత్త పథకాలు తెచ్చాయి. స్త్రీలకు అండగా నిలిచిన ఆ మార్పులేంటో తెలుసుకుందాం రండి...

క్కడ ప్రయాణం ఉచితం: పంజాబ్‌ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కానుకగా అందించింది. కోటి ముప్ఫైలక్షలమంది ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. పేద, మధ్యతరగతి మహిళలకు ప్రయాణాలు భారం కాకూడదనే లక్ష్యంతో ఆ ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందట. తమిళనాడు ప్రభుత్వమూ ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. రోజుకి ఎన్నిసార్లు ఎక్కడికైనా ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు. దేశంలోనే మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం చేసిన మొదటి రాష్ట్రం దిల్లీ. ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల్లో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించడానికి వీలుగా జీరో టికెట్‌ లేదా పాస్‌ ఇస్తారు. కర్ణాటక ప్రభుత్వం కూడా త్వరలో ఈ దిశగా అడుగులేయనుందట.

ఉచితంగా...ఆరోగ్యం: మనదేశంలో కౌమారంలో అడుగుపెట్టిన అమ్మాయిలు మధ్యలోనే స్కూల్‌ చదువుకి స్వస్తి చెప్పేయడానికి ప్రధాన కారణాల్లో నెలసరి ఒకటి. ఈ నెలసరి చిక్కుల నుంచి విముక్తి కలిగించడానికి మహిళలకు, విద్యార్థులకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లను అందించి ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిన దేశం స్కాట్‌లాండ్‌. ఆ స్ఫూర్తిని అందుకుని మన దేశంలో ఈ ఏడాది పంజాబ్‌, ‘కిషోరీ సుచితా అభియాన్‌’ పేరుతో త్రిపుర ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని ప్రారంభించాయి. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆయా ప్రాంతాలకు న్యాప్‌కిన్లను అందిస్తున్నాయి. ఆరు నుంచి ఇంటర్‌ విద్యార్థినులకు వీటిని ఉచితంగా అందిస్తున్నాయి. ఒక్క త్రిపురలోనే 3.61 కోట్లమంది లబ్ధి పొందనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2015 నుంచి 8వ తరగతి నుంచి ఇంటర్‌ వరకూ కస్తూర్బా బాలికల విద్యాలయాలు సహా అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే బాలికలకు నెలకో శానిటరీ న్యాప్కిన్స్‌ ప్యాకెట్‌ అందిస్తున్నారు. వీటిని డీకంపోజ్‌ చేయడం కోసం వసతి గృహాల్లో ఇన్సినరేటర్లనూ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది నుంచి ఈ పథకాన్ని ప్రతి నెలా 10 లక్షల మంది విద్యార్థినులకు విస్తరించారు. యునిసెఫ్‌, వాష్‌, పీఅండ్‌జీ వంటి సంస్థల సహకారంతో నెలసరి పరిశుభ్రతపై అవగాహనా కార్యక్రమాలూ జరుగు తున్నాయి. తమిళనాడు, రాజస్థాన్‌ సహా పలు రాష్ట్రాలు ప్రత్యేక పథకాలకింద విద్యార్థినులకు, ఆసుపత్రిలో చికిత్స పొందే పేద, గ్రామీణ మహిళలకు న్యాప్‌కిన్లను ఇప్పటికే ఉచితంగా అందిస్తున్నాయి. వీటి స్ఫూర్తితో కొత్త ఏడాదిలో మరిన్ని పథకాలు ఆవిష్కృతమవుతాయని ఆశిద్దాం.


మారిన యూనిఫాం...

కేరళలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాల తాజాగా విద్యార్థులందరికీ ఒకేలాంటి యూనిఫాంను కేటాయించి లింగ వివక్షకు వ్యతిరేకంగా నిలబడింది. 200 మంది విద్యార్థినీ విద్యార్థులున్న ఆ పాఠశాలలో అందరూ ప్యాంటు, షర్ట్‌ ధరించాలనే కొత్త నియమాన్ని ప్రవేశపెట్టింది. లింగవివక్ష లేకపోవడంతోపాటు సౌకర్యానికీ పెద్దపీట వేసిన ఈ విధానాన్ని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులూ ప్రశంసించారు. గతంలో విద్యార్థినులు చుడీదార్‌ లేదా స్కర్ట్‌ ధరించేవారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో మిగతా పాఠశాలలూ ఈ ప్యాంటు షర్టు విధానాన్ని పాటించడానికి సిద్ధపడుతుండటం విశేషం.


వివాహ వయసు...

ఇటీవల కేంద్రప్రభుత్వం వధువు వివాహ వయసుని 21 ఏళ్లకు పెంచాలని నిర్ణయించింది. చిన్నవయసులోనే జరుగుతున్న పెళ్లిళ్లు అమ్మాయి శారీరక, మానసిక ఆరోగ్యాలని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని దీనివల్ల ప్రసవానంతర మరణాలు, నవజాతశిశు మరణాలు పెరుగుతున్నాయని ఈ నిర్ణయం తీసుకుంది. అదే 21 ఏళ్లకు వివాహం చేసుకుంటే అమ్మాయికి చదువు పూర్తవుతుంది. దాంతో ఉద్యోగం చేసుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధిస్తుంది. ఈ మార్పు స్త్రీల జీవితాలని ప్రభావితం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.


Advertisement

మరిన్ని