Updated : 31/12/2021 05:24 IST

కష్టాలే కథలయ్యాయి.. మెప్పించాయి!

ఇన్నాళ్లు తెరచాటునే ఉండిపోయిన స్త్రీల కష్టాలు, కన్నీళ్లు.. తెరకెక్కితే? పరువు హత్యలు, అత్యాచారాలు మొదలు... మెనోపాజ్‌ వంటి విషయాలని సైతం ఆసక్తికరంగా తెరకెక్కించి మహిళల వెతలపై దృష్టి మళ్లేట్టు చేశారు దర్శకులు. అలా ఈ ఏడాది అందరి దృష్టినీ ఆకర్షించిన స్త్రీ ప్రాధాన్య విషయాలేంటో చూడండి...

మెనోపాజ్‌... అందరితోనూ మాట అటుంచితే ఇంట్లో భర్త, పిల్లలతోనూ కూడా చెప్పుకోలేని అవస్థ అది. ఓవైపు కెరీర్‌లో కీలక బాధ్యతల్లో ఉన్న మహిళ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొందో తెలిపే వెబ్‌సిరీస్‌ ‘బాంబే బేగమ్స్‌’. నటి పూజాభట్‌ ఈ సమస్యని ఎదుర్కొన్న తీరు అద్భుతంగా ఉండటమే కాదు మెనోపాజ్‌ బాధపై అందరికీ అవగాహన కలిగించేదిగా ఉంటుంది. కీలకమైన సమావేశంలో ఉండగా శరీరంలోంచి వెలికివచ్చే హాట్‌ఫ్లాషెస్‌ని ఆమె ఎలా తమాయించుకుందో చెప్పే ఒక్క సీన్‌ చాలు... మహిళల సమస్యలపై సినిమా ప్రపంచం ఎంత లోతుగా ఆలోచిస్తోందో తెలియడానికి. నలుగురు మహిళల చుట్టూ తిరిగే ఈ వెబ్‌సిరీస్‌ కెరీర్‌ ఒత్తిడిలో పడి వ్యక్తిగత జీవితాలని కోల్పోతున్న మహిళల గురించీ చెబుతుంది. మరో కీలక అంశం. అద్దెగర్భాలు. ఈ పేరుతో మనదేశంలో జరుగుతున్న అనేక దందాల గురించి చెప్పిన చిత్రం మిమి. అద్దెగర్భమే అయినా బిడ్డను నవమాసాలు మోసిన పేగుబంధంతో ఆ బిడ్డకోసం పోరాడే అమ్మాయి ‘మిమి’. పెళ్లికాకుండానే తల్లి అయి... ఆ బిడ్డను వదల్లేక సమమతమవుతుంది. సరోగసీ కారణంగా బలవుతున్న మహిళలందరికీ ఈ పాత్ర ఒక ప్రతినిధిగా ఉంటుంది. ఎంతోమందిని ఆలోచింపచేసిన ఈ సినిమాలో కృతీసనన్‌ మిమీ పాత్రను పోషించింది.

ఎదురీదే పాత్రల్లో...

ఒకవైపు కెరియర్‌.. మరోవైపు కుటుంబం. స్త్రీలు ఈ రెండింటినీ సమర్థంగా నిర్వహించగలుగుతున్నారా? అనే దిశగా తీసిన చిత్రాలే షేర్నీ, అరణ్యక్‌లు. బాలీవుడ్‌ నటి రవీనాటాండన్‌ నటించిన అరణ్యక్‌ చిత్రంలో పోలీసు ఆఫీసర్‌గా పని చేస్తూ, మరోవైపు ఇంటి బాధ్యతలనూ నిర్వర్తించే పాత్రలో నటించి నేటి మహిళలు కెరియర్‌లో రాణించేంద]ుకు ఎంత శ్రమిస్తున్నారో చక్కగా చూపించింది. కెరియర్‌లో ఎదురయ్యే పురుషాధిక్యతకు ఎదురీదుతూ రాణించే మహిళల ప్రతినిధిగా షేర్నీలో విద్యాబాలన్‌ అందరి మన్ననలు అందుకుంది. భర్త నుంచి విడాకులు తీసుకొని ఒంటరిగా ఆడపిల్లను పెంచుతూ వ్యాపారంలో అడుగుపెట్టి విజయం సాధించిన కథ మాసాబా మాసాబా. ఇందులో మసాబా, నీనాగుప్తా నటించారు. సమాజంలో ఎందరో ఒంటరి మహిళలకు ఎదురవుతున్న కష్టాలను ఈ సిరీస్‌లో చూపించారు.

సమాజంలో అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలు.... వాటి చుట్టూ పరిస్థితులని లోతుగా వెలికితీసిన సిరీస్‌ దిల్లీక్రైమ్‌. దిల్లీలో జరిగిన నిర్భయ కేసు నేరస్థులని పట్టుకునే క్రమంలో ఓ మహిళా పోలీసు అధికారికి ఎదురైన పరిస్థితులకు తెరరూపమే ఈ సిరీస్‌. షెఫాలీ షా నటించిన ఈ సిరీస్‌ ఎన్నో అంతర్జాతీయ అవార్డులనీ సొంతం చేసుకుంది. వీటితోపాటు తాప్సీ నటించిన ‘రష్మీ రాకెట్‌’ వంటి సినిమాలు క్రీడారంగంలో దూసుకువస్తున్న అమ్మాయిలు, వాళ్లు తోటి క్రీడాకారుల నుంచి, అధికారుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్లకి కావాల్సిన ప్రోత్సాహం గురించి తెలియ చెప్పాయి. ఈ ధోరణి మరింత విస్తృతమై మరిన్ని అంశాలు తెరమీదకు వస్తాయని, వాటి ద్వారా మహిళల సమస్యలను అర్థం చేసుకుని, సమాజంలో మార్పు రావాలని ఆశిద్దాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని