యుద్ధభూమిలో విద్యనందిస్తోంది!

కార్గిల్‌ అనగానే.. యుద్ధమే గుర్తొస్తుంది. ఏళ్లు గడుస్తున్నా అక్కడి ప్రజల జీవితాల్లో ఇప్పటికీ పెద్దగా మార్పులేదు. దాన్ని మార్చాలనుకుంది స్టాన్జిన్‌ సాల్డాన్‌. అక్కడి చిన్నారులకు విద్యను చేరువ చేస్తూ లింగవివక్ష లేని సమాజ ఏర్పాటుకు కృషి చేస్తోంది.

Published : 03 Jan 2022 01:31 IST

కార్గిల్‌ అనగానే.. యుద్ధమే గుర్తొస్తుంది. ఏళ్లు గడుస్తున్నా అక్కడి ప్రజల జీవితాల్లో ఇప్పటికీ పెద్దగా మార్పులేదు. దాన్ని మార్చాలనుకుంది స్టాన్జిన్‌ సాల్డాన్‌. అక్కడి చిన్నారులకు విద్యను చేరువ చేస్తూ లింగవివక్ష లేని సమాజ ఏర్పాటుకు కృషి చేస్తోంది.

లద్దాఖ్‌కు చెందిన స్టాన్జిన్‌కు ఉన్నతవిద్య చదవాలని కోరిక. జమ్మూ ప్రభుత్వ వైద్యకళాశాలలో సీటునూ సాధించింది. చదువుతోపాటు పలు ఎన్జీవోలతో కలిసి పనిచేసేది. మారుమూల గ్రామాల ప్రజలను కలిసి వారి అవసరాలు, సమస్యలపై అవగాహన పెంచుకొనేది. దాని ఆధారంగా సేవా కార్యక్రమాలను రూపొందించేది. దీనికి చదువు అడ్డుగా భావించి వైద్యవిద్యను రెండో ఏడాదిలో వదిలేసి, దూరవిద్య ద్వారా సామాజిక సేవలో డిగ్రీ చదివింది.

కార్గిల్‌లో విద్యపై అవగాహన కలిగించడానికి కార్యశాలలు నిర్వహించేది. దీనికోసం తనో సేవా సంస్థనూ ప్రారంభించింది. ‘2015లో ‘ఆర్‌జంబా’ను స్థాపించి, పిల్లలకు చదువు చెప్పడం ప్రారంభించా. అదే ఏడాది ‘అమెరికన్‌ ఇండియా ఫౌండేషన్‌ (ఏఐఎఫ్‌) విలియం జె.క్లింటన్‌ ఫెలోషిప్‌’కు ఎంపికయ్యా. ఈ ప్రాజెక్టులో 14 నెలలు కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలలతో కలిసి పనిచేశా. ఉపాధ్యాయుల కోసం నూతన విద్యావిధానాలు, కౌమారదశలో విద్యార్థుల ఆరోగ్య జాగ్రత్తలు, మరుగుదొడ్ల పరిశుభ్రతపై అవగాహన వంటి అంశాలుండేవి. ఫెలోషిప్‌ నిధులతో డ్రాస్‌ ప్రాంతంలోని పలు ప్రభుత్వోన్నత పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాం. ఆ తర్వాత జమ్మూ- కశ్మీర్‌కు చెందిన కైవల్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌లో సీనియర్‌ ప్రోగ్రామ్‌ లీడర్‌గా దిల్లీ శాఖలో బాధ్యతలు చేపట్టా. అక్కడే పాఠశాలల విద్యావిధానాలపై పనిచేశా’ అని ఉత్సాహంగా వివరించింది స్టాన్జిన్‌.

పూర్తి స్థాయిలో...

కార్గిల్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యార్థులెదుర్కొనే సమస్యలు, అక్కడి విద్యావిధానాలను అంచనా వేయడం మొదలుపెట్టింది ‘ఆర్‌జంబా’. మంచు కారణంగా ఏడాదిలో ఆరునెలలు సరైన రవాణామార్గం లేకపోవడం, అంతర్జాలం అందుబాటులో లేకపోవడం వంటివన్నీ పిల్లల చదువుపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఏటా మార్చి నుంచి నవంబరు వరకు మాత్రమే పాఠశాలలు నడుస్తాయి. వీటన్నింటినీ అధిగమిస్తూ విద్యార్థులకు చదువుతోపాటు పరిశుభ్రత, ఆరోగ్యం, లింగవివక్ష, నెలసరివంటి అంశాలపై అవగాహన తేవడానికి తీవ్రంగా కృషి చేసిందీ సంస్థ. ఆడపిల్లలు నెలసరి సమస్యలను బహిరంగంగా చర్చించే స్థాయికి మార్పు తేగలిగింది. విద్యార్థులకు ఆంగ్లంపై పట్టు సాధించేలా శిక్షణనందించింది. కార్గిల్‌ చీఫ్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ సహకారంతో 16 ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకంతోపాటు గ్రంథాలయం, కథలు చెప్పే తరగతులు ప్రారంభించేలా చేసిందీమె. మూడు ప్రాథమిక పాఠశాలలను దత్తత తీసుకొని విద్యార్థులకు తనవంతు సహకారాన్ని అందిస్తోంది స్టాన్జిన్‌. కొవిడ్‌ సమయంలో, ఆ తర్వాతా 200 మంది వలంటీర్లను నియమించి, వారిని ఇంటింటికీ పంపి 3 వేలమంది విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించేలా చేసింది. కార్గిల్‌లో విద్యాకుసుమాలు పూయించి, అభివృద్ధి దిశగా సాగేలా చేయడమే తన లక్ష్యమంటోంది 33 ఏళ్ల స్టాన్జిన్‌. తన పట్టుదల ముచ్చటగా లేదూ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్