Updated : 06/01/2022 06:00 IST

వేలమందికి సరస్వతీ కటాక్షం...

బాగా చదువుకోవాలన్న కోరికను నెరవేర్చుకోవడం కోసం రోజూ 16 కిలోమీటర్లు నడిచేది. ఉన్నత విద్య చదవడం కోసం అహోరాత్రులూ కష్టపడింది. ఆ క్రమంలో... తనలా ఎంతోమంది తపిస్తున్నారని అర్థమయ్యింది. వారికి అండగా నిలవాలనుకుంది... ‘ట్యుటోర్‌ కేబిన్‌’ అంకుర సంస్థతో గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన చదువులను అందిస్తోన్న నేహా కథ ఇది...

మధ్యప్రదేశ్‌లోని మాండ్‌సర్‌ జిల్లాలో ఓ కుగ్రామం నేహాది. మధ్యతరగతి కుటుంబం. ఆ ఊళ్లో ప్రాథమిక పాఠశాల వరకు మాత్రమే ఉంది. దాంతో ఊరి అమ్మాయిల చదువు ఎనిమిదో తరగతి దాటదు. కానీ నేహాకు పెద్ద చదువులపై ఆసక్తి. అందుకే 8 కిలోమీటర్ల దూరంలోని షామ్‌గర్‌ ఉన్నత పాఠశాలకు, ఇంటర్‌ కాలేజీకి నడిచి వెళ్లి చదువుకుంది. తర్వాత ఉజ్జయిని విక్రమ్‌ విశ్వవిద్యాలయంలో బీఏ చదివింది. ఆ ఊళ్లో డిగ్రీ చేసిన తొలి యువతి తనే.

ఒంటరిగా ఉంచుతారా...
‘ఇండోర్‌లో ఎంబీయే చదువుతానంటే అమ్మా నాన్నలు ఒప్పుకోలేదు. ఎలాగో వాళ్లతో ఊ అనిపించుకుని వెళ్లాక అక్కడి విశ్వవిద్యాలయంలో ప్రవేశం దొరకలేదు. దాంతో అసోసియేటెడ్‌ ఛార్టెర్డ్‌ అక్కౌంటెంట్‌ (ఏసీఏ) కోర్సు చదువుతూనే, ఎంబియ్యే ప్రయత్నాలూ మానలేదు. ఊళ్లో బంధువులు, ఇరుగు పొరుగు ఆడపిల్లను ఒంటరిగా ఇండోర్‌లో ఉంచారంటూ అమ్మా నాన్నను విమర్శించే వారు. అయినా వాళ్లు నాకు అండగా నిలిచారు. మొత్తమ్మీద క్యాట్‌కు హాజరై ఉత్తీర్ణత సాధించి, క్రిస్టియన్‌ ఎమినెంట్‌ కళాశాలలో ఎంబీయేలో చేరా. నా ఖర్చుల కోసం పిల్లలకు ట్యూషన్స్‌ చెప్పేదాన్ని. పగలంతా కాలేజీ, సాయంత్రం నుంచి రాత్రి వరకు ట్యూషన్స్‌. అర్ధరాత్రి వరకూ నా చదువు. చాలా కష్టంగా, ఒత్తిడిగా ఉండేది. కొన్నిసార్లు ఏడుపొచ్చేది. ఎన్ని ఇబ్బందులొచ్చినా వెనుకడుగు వేయకూడదని నాకు నేను గట్టిగా అనుకునేదాన్ని. తర్వాత ఓ పోటీ పరీక్షల శిక్షణా సంస్థలో ఉద్యోగం సంపాదించా. అక్కడే చాలా విషయాలు అర్థమయ్యాయి. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఫీజులు కడుతున్నా, పిల్లలకు నాణ్యమైన విద్య అందకపోవడం గుర్తించా. మా ఊరు గుర్తొచ్చేది. నాలాంటి వాళ్లు ఎందరో సరైన అవకాశాల్లేక చదువుకు దూరమవుతున్నారని అనిపించింది. ఆ ఆలోచనల నుంచే 2016లో ‘ట్యూటర్‌ కేబిన్‌’ పుట్టింద’ని వివరించింది నేహా.

ఇంతింతై..
దీనికి వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేసి, 15 మంది ట్యూటర్స్‌తో నేహా విద్యాబోధన ప్రారంభించింది. 2016లో ఇండోర్‌లో మొదలైన ఈ బోధన ఈ అయిదేళ్లలో దేశవ్యాప్తంగా విస్తరించింది. ట్యూటర్స్‌ సంఖ్య 1,500 అయ్యింది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకూ, పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికీ ఈ స్టార్టప్‌ ద్వారా బోధన అందుతోంది. దేశవ్యాప్తంగా అన్ని ఎడ్యుకేషన్‌ బోర్డ్స్‌కు సంబంధించిన కోర్సులన్నింటికీ ప్రాంతీయ భాషల్లో ఆన్‌లైన్‌లో బోధన నిర్వహిస్తోంది. పది, ఇంటర్‌ చదివినా మంచి ఇంగ్లిషు మాట్లాడటం వస్తే ఏదో ఒక ఉపాధి దొరుకుతుందన్నది తన ఆలోచన. అందుకే ఆంగ్లం మాట్లాడటంలో ఉచితంగా శిక్షణనందిస్తోంది. దాని వల్ల వేల మంది లబ్ధి పొందారు. పిల్లల చదువు సాగుతోన్న తీరును వెబ్‌సైట్‌లోనే అమ్మానాన్నలు తెలుసుకోవచ్చు. వారు తరగతులకు హాజరు కాకపోతే అయిదు నిమిషాల్లో ఆ విషయం తల్లిదండ్రులకు చేరుతుంది. కొవిడ్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచితంగా తరగతులు నిర్వహిస్తోంది. ‘గతేడాది దేశంలో అత్యుత్తమ కృషి చేస్తున్న 60 అంకుర సంస్థల్లో స్థానం దక్కింది. బెంగళూరు ఐఐఎం ‘బెస్ట్‌ ఎడ్యుటెక్‌ స్టార్టప్‌’గా గుర్తించింది. రూ.25వేలతో మొదలుపెట్టాం. మా టర్నోవరు గత ఏడాది రూ.50 లక్షలకు చేరింది. మా ఊళ్లో పేద పిల్లలకూ ఉచితంగా విద్యనందిస్తున్నా. నన్ను, నా కుటుంబాన్ని విమర్శించిన వారు ఇప్పుడు నన్ను చూసి గర్వంగా భావించడమే నా విజయం అనుకుంటున్నా. అదెలా ఉన్నా... వేల మంది గ్రామీణ విద్యార్థులకు మంచి చదువు చవగ్గా అందించడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది’ అంటోన్న నేహా కథ నిజంగానే స్ఫూర్తిదాయకం కదూ...


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి