Updated : 07/01/2022 05:08 IST

బంగారు డాక్టరమ్మ!

వైద్యవిద్యనే కష్టంగా భావిస్తాం. దానిలో రెండు బంగారు పతకాలతో పాటు నగదు బహుమతుల్నీ సాధించింది రామరపు సౌమ్య. తెలుగు రాష్ట్రాలకూ కలిపి అత్యుత్తమ ప్రతిభ చూపినందుకు వీటిని అందుకుంది.

మాది హైదరాబాద్‌. నాన్న మోహన్‌ సాగర్‌ మిథానీ ఉద్యోగి. అమ్మ విమల విశ్రాంత ఉపాధ్యాయురాలు. ముగ్గురు అమ్మాయిల్లో రెండోదాన్ని. అమ్మ కారణంగా చిన్నప్పటి నుంచీ విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి కలిగింది. అదే వైద్యవిద్య వైపు నడిపించింది. ఎంబీబీఎస్‌ భాస్కర్‌ మెడికల్‌ కాలేజ్‌లో చేశాను. మొదటి రెండేళ్లు డిస్టింక్షన్‌ వచ్చింది. వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజ్‌ నుంచి 2016లో పీజీ పూర్తి చేశా. స్పెషలైజేషన్‌ ఈఎన్‌టీ. అప్పటికీ ఏపీ, తెలంగాణ ఎన్‌టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం కిందే ఉండేవి. రెండు రాష్ట్రాలకీ కలిపి అత్యధిక మార్కులు సాధించినందుకూ, ఉత్తమ విద్యార్థిగా 2 బంగారు పతకాల్ని, విశ్వవిద్యాలయం నుంచి 2 నగదు బహుమతులు వచ్చాయి. వీటిని 2018లోనే అందుకోవాల్సింది. సాధారణంగా కాన్వకేషన్‌ రెండేళ్లకోసారి జరుగుతుంది. కానీ రాష్ట్ర విభజన వల్ల ప్రత్యేక విశ్వవిద్యాలయాల ఏర్పాటు, ఆ తర్వాత కొవిడ్‌... ఇలా ఆలస్యమయింది. ఎప్పుడైనా వీటిని అందుకోవడం ఆనందమే. కానీ.. మామూలుగా వీటిని గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం చేస్తారు. కొవిడ్‌ వల్ల వర్చువల్‌గా తీసుకోవాల్సి రావడం కొంచెం అసంతృప్తి. ప్రస్తుతం చేవెళ్లలో ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేస్తున్నా. మావారు మహేష్‌ కూడా ఈఎన్‌టీ వైద్యుడే. ఇందులోనూ ప్రత్యేక విభాగాలుంటాయి. చెవి నుంచీ మెదడుకి సర్జరీ చేయొచ్చు. అందుకే మరింత పరిజ్ఞానం కోసం ఆధునిక కోర్సులు చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం చిన్న ఆసుపత్రి కూడా నడుపుతున్నా. మాది మధ్యతరగతి కాబట్టి, చదువు మీదే దృష్టి పెట్టేదాన్ని. అమ్మానాన్నా మాకు ఎంతో స్వేచ్ఛనిచ్చారు. అక్క, చెల్లి, నేను... ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ చదివేవాళ్లం. అక్క శ్వేత ఐఐటీ రూర్కీలో ఎంటెక్‌ చదివింది. ప్రస్తుతం బీడీఎల్‌లో పని చేస్తోంది. చెల్లి ఎంటెక్‌ అయ్యాక ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలో ఎరోనాటికల్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తోంది. ఏదైనా సాధించగలమని ముందు మీరు నమ్మండి. శ్రమపడండి. అప్పుడు అదే సాకారమవుతుంది... ఇదే నమ్ముతాను నేను.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని