Updated : 12/01/2022 05:02 IST

కనిపించని శత్రువుతో పోరాడుతోంది

కొన్ని సమస్యలు విచిత్రంగా ఉంటాయి. దానికి కొందరు స్పందించే తీరు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలాంటిదే డాక్టర్‌ అనుభా మహాజన్‌ కథ. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఈ అమ్మాయి తనలాంటి వారి కోసం ‘క్రానిక్‌ పెయిన్‌ ఇండియా’ అని సంస్థనే స్థాపించింది. నొప్పి కోసం సంస్థ ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా?! అయితే చదవండి...

బెంగళూరు మెడికల్‌ కాలేజీలో దంత వైద్యంలో పీజీ చేస్తున్న డాక్టర్‌ అనుభకు మడమలో నొప్పి. చికిత్స, విశ్రాంతి కోసం వారానికోసారి సెలవు తీసుకోవాల్సి వచ్చేది. ‘సెలవులు పెట్టి పార్టీలకు వెళ్తోంది’ అంటూ ప్రొఫెసర్లు కూడా ఫిర్యాదులు చేస్తుంటే తనకు అవమానంగా ఉండేది. డెంటల్‌ కౌన్సెల్‌ ఆఫ్‌ ఇండియాకి తన పరిస్థితిపై ఉత్తరం రాసింది. వాళ్లు ఆమెకు ఆరునెలలు సెలవుతో పాటు, పరీక్షల సమయంలో వెసులుబాటూ ఇచ్చారు. అసలిది ఎలా ప్రారంభమైందంటే... 2014లో అనుభాకి ఓ ప్రమాదంలో కాలికి చిన్న గాయం అయింది. స్థానిక డాక్టర్‌ చికిత్స చేసి కట్టు బలంగా వేశారు. ‘అది బిగుతుగా ఉంది. రక్తప్రసరణ ఆగిపోయేలా ఉంది’ అంది అనుభ. ‘డాక్టర్‌వి నువ్వా నేనా’ అన్నట్టు చూశాడాయన. తను వైద్య విద్యార్థే కదా, ఆ కట్టుతో ముప్పని గ్రహించింది. మరోచోట వైద్యం చేయించుకుంది. తర్వాతే మొదలయ్యింది మడమలో విపరీతమైన నొప్పి. ఏ డాక్టర్‌ దగ్గరకు వెళ్లినా మడమలో టీబీ ఉందని ఒకరు... కాలిలో ట్యూమర్‌ ఉందని ఒకరు ఇలా రకరకాల కారణాలు చెప్పేవారు. ఏడాది తర్వాతే తెలిసింది... తనకి సీఆర్‌పీఎస్‌ (కాంప్లెక్స్‌ రీజనల్‌ పెయిన్‌ సిండ్రోమ్‌) సమస్య ఉందని. అంటే కాలు లేదా చేతిలో వందలాది సూదులతో ఒక్కసారే గుచ్చినంత బాధ. ఈ నొప్పి కాలి నుంచి నడుముకి, అక్కడి నుంచి చేతికి కూడా పాకొచ్చు. ఇది అరుదైన వ్యాధి. ఏదైనా సర్జరీ తర్వాత, లేదా తీవ్రమైన నొప్పిని భరించిన తర్వాత ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలుసుకుంది. తనేమీ కుంగిపోలేదు. దీని సంగతేంటో చూడాలనుకుంది.

‘ఇది కనిపించని శత్రువు. చికిత్స లేని ఈ వైకల్యాన్ని అధిగమించేందుకు ఎందరో నిపుణులు, పరిశోధకులను కలిశాను. మూడేళ్లు ఎంతో సమాచారాన్ని సేకరించాను. రకరకాల వైద్య విధానాల్ని అధ్యయనం చేశా. యోగా క్లాసులకూ వెళ్లే దాన్ని. ఓసారి అనిపించింది.... నాలాంటి వారి కోసం ఏదైనా చేయాలని. అలా 2017లో ‘క్రానిక్‌ పెయిన్‌ ఇండియా’ని స్థాపించాను. కొందరు డాక్టర్లు ఉచిత వైద్య సాయానికీ, సలహాలు ఇవ్వడానికీ ముందుకొచ్చారు. మేమంతా ఈ బాధితులకు అవగాహన కలిగించే వాళ్లం. వర్క్‌షాపులు నిర్వహించే వాళ్లం. ఈ సమస్య గురించి వైద్యులకీ అవగాహన తక్కువే. అందుకే సామాజిక మాధ్యమాలు వేదికగా ఈ వ్యాధిపై అవగాహన తీసుకొచ్చే దాన్ని. క్రమంగా బాధితులు బయటకు రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు మా సంస్థలో 1600 మంది సభ్యులున్నారు’ అని వివరించింది అనుభ. ప్రతి రెండు వేల ప్రమాద ఘటనల్లోనూ ఒకరు దీని బారిన పడతారని ఒక అంచనా. అలా చూస్తే లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నా వారికీ తెలియదని, అందుకే దేశవ్యాప్తంగా అవగాహన తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నా అంటోంది తను. చికిత్స వచ్చే వరకూ బాధితులకు ఊరట కలిగించాలన్న అనుభ తపన అభినందనీయం కదూ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి