వయసు 18..అభిమానులు 10లక్షలు!

ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్‌.. అంటే పది లక్షల మంది ఆమెను అనుసరిస్తున్నారు. తనో సినీ నటో, ప్రముఖ వ్యాపారవేత్తో అనుకుంటున్నారా? కాదండీ బాబూ.. సాధారణ మధ్యతరగతి అమ్మాయి. చదివేది డిగ్రీ.. అదీ ప్రభుత్వ కళాశాలలో! మరి అఫ్రీన్‌ వాజ్‌కి ఇదెలా సాధ్యమైందంటే.. ఏటికి ఎదురీదుతూ ఉత్సాహపు కెరటంలా సాగుతున్న తన గురించి తెలుసుకోవాల్సిందే!

Updated : 13 Jan 2022 06:30 IST

ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్‌.. అంటే పది లక్షల మంది ఆమెను అనుసరిస్తున్నారు. తనో సినీ నటో, ప్రముఖ వ్యాపారవేత్తో అనుకుంటున్నారా? కాదండీ బాబూ.. సాధారణ మధ్యతరగతి అమ్మాయి. చదివేది డిగ్రీ.. అదీ ప్రభుత్వ కళాశాలలో! మరి అఫ్రీన్‌ వాజ్‌కి ఇదెలా సాధ్యమైందంటే.. ఏటికి ఎదురీదుతూ ఉత్సాహపు కెరటంలా సాగుతున్న తన గురించి తెలుసుకోవాల్సిందే!

అఫ్రీన్‌కు డ్యాన్స్‌ అంటే ప్రాణం. నృత్యం చేస్తూ సరదాగా వీడియోలు తీసుకునేది. అప్పట్లో (2019లో) టిక్‌టాక్‌ జోరు మీదుంది. అందులో వీడియోలు ఉంచితే తన ప్రతిభ అందరూ చూస్తారు కదా అనుకుంది. కానీ చుట్టుపక్కల వాళ్లు, సహవిద్యార్థులు రకరకాలుగా విమర్శించడం మొదలుపెట్టారు. మరొకరైతే వెనకడుగు వేసేవారేమో! తను మాత్రం పట్టించుకోలేదు. ఎదురయ్యే అవమానాల్ని పంటి బిగువున భరించింది. ప్రతిభతోనే మెప్పించాలనుకుంది. నిరూపించుకోవాలని దీక్ష పూనింది. క్రమంగా తనను అనుసరించే వారు లక్షల్లోకి చేరారు. ఇంతలో ప్రభుత్వం టిక్‌టాక్‌ను నిషేధించింది. ‘అయిందా సంబరం’ అంటూ అందరూ ఎత్తిపొడిచారు. బాధపడ్డా ఈసారీ వెనకడుగు వేయలేదు. మరో మార్గంలో ప్రయత్నిద్దామనుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకుంది. డ్యాన్స్‌, ఫ్యాషన్‌ వీడియోలు పెట్టేది.

అఫ్రీన్‌ది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బొమ్మూరు. మధ్యతరగతి కుటుంబం. అమ్మ అనిత ప్రైవేటు ఉపాధ్యాయిని, నాన్న షాన్‌వాజ్‌ చిరు వ్యాపారి. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. వీటి ధ్యాసలో చదువును అశ్రద్ధ చేయొద్దన్న అమ్మ మాటల్ని మాత్రం మరచిపోలేదంటుంది. రోజూ కళాశాలకు వెళ్లడం, సాయంత్రం పాఠాలు చదువుకోవడం తప్పనిసరి. తాజాగా డిగ్రీ మూడో సెమిస్టర్‌ ఫలితాల్లో 91.7 శాతం సాధించింది. మరి ఇవన్నీ ఎలా అంటే... ఖాళీ సమయంలోనే! అవమానించిన వారే..

ఇన్‌స్టా వీడియోలు చేస్తున్నప్పుడూ చాలామంది అవమానకరంగా మాట్లాడేవారు. అసభ్య వ్యాఖ్యలు పెట్టేవారు. ఇవేమీ తన ఆత్మవిశ్వాసాన్ని సడలించలేకపోయాయి. వారితోనే శభాష్‌ అనిపించుకోవాలన్నది ఆమె లక్ష్యం. చీరకట్టు వంటి సంప్రదాయ అంశాలు, కొవిడ్‌ జాగ్రత్తలు వంటి సామాజిక అంశాలపైనా వీడియోలు చేస్తూ ఉంటుంది. క్రమంగా ఇక్కడా అనుసరించే వారూ పెరిగారు. ఇటీవలే ఆ సంఖ్య 10 లక్షలు దాటింది. ఇప్పుడు చుట్టు పక్కల వారు, సహవిద్యార్థులు, అధ్యాపకులూ మెచ్చుకుంటున్నారు. చదువులోనూ మెరుగైన ఫలితాలు వస్తుండటంతో గౌరవమూ పెరిగింది. ప్రస్తుతం కాలేజీలో, బయటా తనో సెలబ్రిటీ.

అఫ్రిన్‌ నృత్యంలో, నటనలో శిక్షణేమీ తీసుకోలేదు. టీవీలో చూసి సొంతగానే నేర్చుకుంది. ట్రెండింగ్‌లో ఉన్న పాటల్ని తనదైన శైలిలో ప్రయత్నిస్తుంది. వాటిని అమ్మ కానీ అన్నయ్య సొహేల్‌ కానీ వీడియో తీస్తారు. ఇప్పటి వరకూ 975 వీడియోలు చేసింది. తనకు తమిళనాడు, బెంగుళూరు, కేరళల్లోనూ అభిమానులున్నారు. వాళ్ల కోసమూ ఆయా భాషల్లో వీడియోలు చేస్తుంది. వీక్షణలు, అనుసరించే వారు పెరగడంతో ప్రకటనల ద్వారా చెప్పుకోదగిన ఆదాయమూ వస్తోంది. ఉన్నత విద్య చదవాలన్నది తన లక్ష్యం. సినిమాల్లో అవకాశం వస్తే అక్కడా ప్రతిభను చాటగలనని నమ్మకం.
నిండా 20 ఏళ్లు కూడా లేని అమ్మాయి. ఇంకా సమాజాన్నీ పూర్తిగా చూడలేదు. తన ప్రతిభను ప్రదర్శించే క్రమంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. ఒత్తిడి, కుంగుబాటుకు ఇంతకుమించిన కారణాలేం ఉంటాయి? ‘కొత్త దారిలో నడుస్తున్నప్పుడు ఆడపిల్లలకు ఇవన్నీ సహజం. వాటన్నింటినీ వెనక్కి నెడుతూ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఏదైనా సాధించగలం. నా కుటుంబంలాంటి అండా తోడైతే దేన్నైనా అధిగమించగలం’ అన్నది అఫ్రీన్‌ మాట.


 

ఉప్పాల రాజాపృథ్వీ, రాజమహేంద్రవరం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్