అధికారులు వస్తే దాక్కునేదాన్ని!

చదువంటే ఇష్టమున్నా... కూలికి వెళ్లకపోతే రోజుగడవని జీవితం ఆ అమ్మాయిది. కానీ చదవాలన్న ఆమె సంకల్పానికి అమ్మ, టీచరమ్మల సాయం తోడైంది. పూట భోజనం కోసం వెతుక్కున్న ఆ అమ్మాయి జాతీయ మైనారిటీ కమిషన్‌ సభ్యురాలిగా ఎదిగింది. ఈ పదవి సాయంతో తోటి ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపాలనుకుంటోంది.

Updated : 10 Aug 2022 12:01 IST

చదువంటే ఇష్టమున్నా... కూలికి వెళ్లకపోతే రోజుగడవని జీవితం ఆ అమ్మాయిది. కానీ చదవాలన్న ఆమె సంకల్పానికి అమ్మ, టీచరమ్మల సాయం తోడైంది. పూట భోజనం కోసం వెతుక్కున్న ఆ  అమ్మాయి జాతీయ మైనారిటీ కమిషన్‌ సభ్యురాలిగా ఎదిగింది. ఈ పదవి సాయంతో తోటి ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపాలనుకుంటోంది. ఆమే ఆదిలాబాద్‌కి చెందిన సయ్యద్‌ షహజాది..

నాకు ఊహ తెలిసినప్పట్నుంచీ అమ్మ అమినాబీతో కలిసి పత్తి జిన్నింగుల్లో కూలికో, అవి లేనప్పుడు తాపీ పనులకో వెళ్లే దాన్ని. అలా అయితేనే మా కడుపు నిండేది మరి. లేకపోతే పస్తులే. అప్పుడప్పుడు జిన్నుంగు మిల్లులని అధికారులు తనిఖీ చేసేవారు. అప్పుడు దాక్కునే దాన్ని. ఇవన్నీ గమనించిన బాలకార్మిక పాఠశాల ఉపాధ్యాయిని రణిత మేడమ్‌ మా అమ్మకు నచ్చజెప్పి నాకు చదువు చెప్పింది. బాలకార్మికులకు పరీక్ష పెడితే నాకే ఫస్ట్‌ వచ్చేది. మరోవైపు ‘ఆడపిల్లకు చదువెందుకు?’ అంటూ మతపెద్దలు పంచాయతీ పెట్టి అమ్మకు జరిమానాలు వేశారు. నాకోసం అన్నీ భరించింది. బాగా చదువుతానని నేరుగా ప్రభుత్వ బడిలో ఏడో తరగతిలో చేర్పించారు. అప్పటి వరకూ ఏబీసీడీలు కూడా తెలియవు నాకు. తెలియని విషయాలని టీచర్లని అడిగితే తోటిపిల్లలు నవ్వేవారు. కానీ బాగా చదువుకుంటేనే కష్టాలు దూరమవుతాయన్న రణిత మేడం మాటలు నాపై ఎంతో ప్రభావం చూపించాయి. అందుకే ఎంత కష్టమైనా రోజూ నాలుగు కిలోమీటర్లు నడిచి బడికి వెళ్లేదాన్ని. పీఈటీ మేడం జ్యోతి నాకు ఆర్థికంగా సాయం చేశారు. క్రమంగా నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. పదో తరగతిలో ఉండగా మధ్యాహ్న భోజనంలో కోడి గుడ్డు పెట్టడం లేదని కలెక్టరేట్లో అధికారులతో జరుగుతున్న సమీక్షలో చెప్పేశా. దాంతో కలెక్టర్‌ సుధారాణి పాఠశాలకు వచ్చి సమస్య పరిష్కరించారు. అప్పుడే అనిపించింది తెగించి పోరాడితేనే కష్టాలు తొలగుతాయని. పదో తరగతిలో వినియోగదారుల ఫోరం నిర్వహించిన పరీక్షలో జిల్లా ఫస్ట్‌ వచ్చా. వాళ్లిచ్చిన రెండు వేలతో సైకిల్‌ కొనుక్కొన్నా. దాని మీదే వెళ్తూ ఇంటర్‌, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తి చేశాను. ఈ క్రమంలో వివేకానందుడి పుస్తకాలు నన్నెంతో ప్రభావితం చేశాయి. వాటితోపాటు అంబేడ్కర్‌, అబ్దుల్‌కలాం, వివేకానంద జీవిత చరిత్రలను తెలుసుకున్నాక ఏబీవీపీలో చేరి విద్యార్థి ఉద్యమాల బాట పట్టా. వాటితోపాటు ఉస్మానియాలో ఎంఏ (పొలిటికల్‌సైన్సు) పూర్తి చేశా. రామకృష్ణమఠంలో స్పోకెన్‌ ఇంగ్లిషు తరగతులకు వెళ్లి ఆంగ్లంపై పట్టు పెంచుకున్నా. ప్రజలకు ఏదో చెయ్యాలన్న కోరిక నాలో పెరిగింది. అందుకే చాంద్రాయణగుట్టలో ఉండిపోయా. కిందటి డిసెంబరు 18వ తేదీన కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వి నుంచి జాతీయ మైనారిటీ కమిషన్‌ సభ్యురాలిగా నియమిస్తున్నట్లు పిలుపు వచ్చింది. కమిషన్‌లో ఉన్న ఆరుగురిలో నేనొక సభ్యురాలిని కావడం, అందులోనూ చిన్న వయసులో (28 ఏళ్లు) ఈ గౌరవడం దక్కడం సంతోషంగానే ఉంది. దేశమంతా తిరిగి మైనారిటీల బాగు కోసం, ముఖ్యంగా అమ్మాయిల కోసం నా శక్తిమేరకు పని చేస్తా.

- అల్కె అశోక్‌, న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్