close
Published : 19/01/2022 01:18 IST

వేల మంది పిల్లలను కాపాడుతోంది

చట్టాలు, శిక్షలు, అవగాహన కార్యక్రమాలు... వేటి పని అవి చేసుకుపోతున్నా.. బాలలు పెద్ద సంఖ్యలో కార్మికులుగా మగ్గిపోతున్నారు... ఇంకొంత మంది బాల్యవివాహాల ఊబిలో కూరుకుపోతున్నారు. అలాంటి దారుణాలకు వ్యతిరేకంగా పోరాడుతోంది 18 ఏళ్ల అంజూవర్మ.

రియాణలోని ఫతేహాబాద్‌ జిల్లా దౌలత్‌పూర్‌ గ్రామంలో పుట్టి పెరిగింది 18 ఏళ్ల అంజూ వర్మ. సల్వార్‌సూట్‌ తప్ప వేరే ఏ దుస్తులూ వేసుకోవడానికి అమ్మాయిలకు అనుమతి ఉండదక్కడ. బాల్య వివాహాల్లాంటి దురాచారాలు సర్వసాధారణం. తండ్రి వైపు కూడా కన్నెత్తి చూడకూడదన్నది అక్కడి నియమం. ఇక బయటి వారి సంగతి చెప్పేదేముంది. ఇవన్నీ చూస్తూ పెరిగిన అంజూ ఈ దురాచారాలపై నిత్యం మదనపడేది.

ఐదేళ్ల వయసులో కొన్నాళ్లు మేనత్త ఇంట్లో ఉంది. అక్కడామె ను తెల్లవారు జామునే లేపి ఇంటెడు చాకిరీ అంజూతోనే చేయించేది. చిన్న తప్పుకీ తీవ్రంగా దండించేది. దీనికి తోడు లైంగిక వేధింపులకూ గురయ్యింది. తండ్రి సహకారంతో ఆ నరకం నుంచి బయటపడింది అంజూ. తర్వాత పదేళ్ల వయసులో ఒకసారి కొందరు బాల కార్మికులను చూసింది. పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతులు హోటల్లో టేబుళ్లు తుడవడం, ఎంగిలి గిన్నెలను కడగడం తనను కలచివేసింది. ఇవన్నీ ఆమెను బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడేలా పురిగొల్పాయి. 2017లో 14 ఏళ్ల వయసులో తను ‘బులంద్‌ ఉడాన్‌’ సంస్థను ఏర్పాటు చేసినప్పుడు ఏడుగురు స్వచ్ఛంద కార్యకర్తలుండే వారు. ఇప్పుడు తన పరిధి క్రమంగా ఊరు, జిల్లా దాటి మూడు రాష్ట్రాలకు విస్తరించింది. తనతో చెయ్యికలిపిన కార్యకర్తల సంఖ్య ఇప్పుడు వందకు పైగానే. వీళ్లంతా 18 నుంచి 35 ఏళ్ల మధ్య వారే. రోడ్ల మీద, బస్టాండుల్లోనూ... ఇలా ఎక్కడైనా బాధగానో, దీనంగానో కనిపించిన ప్రతి చిన్నారితోనూ ఈ కార్యకర్తలు మాట్లాడతారు. అవసరమున్న వారికి చేయూతనందిస్తారు. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకునేలా అధికారులపై ఒత్తిడి తీసుకొస్తుంది అంజు.

‘బులంద్‌ ఉడాన్‌’ ద్వారా వెయ్యికి పైగా చిన్నారులను బడిలో చేర్పించింది అంజూ.  ఈ పిల్లలందరూ పరీక్షల్లో 70% పైగా మార్కులు తెచ్చుకోవడం అత్యంత సంతృప్తినిచ్చిందని అంజూ చెప్తోంది. 70కి పైగా బాల్య వివాహాల అడ్డుకుంది. పదుల కొద్దీ లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు న్యాయం జరిగేలా పోరాడింది. లాక్‌డౌన్‌ సమయంలో 700కు పైగా కుటుంబాలకు రెండు నెలలు నిత్యావసరాలను అందించింది.

ట్రక్కు డ్రైవర్‌గా పనిచేసే అంజూ తండ్రి రాజేంద్ర కుమార్‌.. తను నెల సంపాదన 20 వేలల్లో, సగం కుమార్తె సంస్థ కోసమే ఇస్తాడంటే వాళ్లు ఎంత మద్దతుగా నిలుస్తున్నారో అర్థం అవుతుంది. ఈ సంస్థ సేవలకు మెచ్చి ఎంతో మంది విరాళాలను అందిస్తున్నారు. రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో బాలల హక్కుల కోసం పోరాడుతున్న అంజూ టెడెక్స్‌ వంటి వేదికలపైనా ప్రసంగిస్తోంది. ప్రస్తుతం డిగ్రీ చదువుతోన్న అంజూకు అయ్యేఎస్‌ అధికారి కావాలన్నది కల.


Advertisement

మరిన్ని