ఈ మోడల్‌..న్యాయవాది కూడా
close
Published : 22/01/2022 01:29 IST

ఈ మోడల్‌..న్యాయవాది కూడా

పేరు నిషా యాదవ్‌.. ఎత్తు ఐదు అడుగుల 11 అంగుళాలు. అందంలోనూ అదుర్స్‌. అందుకే, ఫ్యాషన్‌ రంగంలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే,  సంప్రదాయానికి పెద్దపీట వేసే రాజస్థానీ కుటుంబానికి చెందిన నిషా.. ఈ రంగంలో రాణించడానికి చాలా కష్టాలే ఎదుర్కొంది. చదువులోనూ టాపరే. మోడలింగ్‌ చేస్తూనే ఉన్నత చదువులు పూర్తిచేసుకొని ప్రస్తుతం లా ప్రాక్టీస్‌ చేస్తోంది..

నిషా యాదవ్‌ది రాజస్థాన్‌లోని కోట్‌పుత్లీ సమీపంలోని ఓ కుగ్రామం. అక్కడికి కార్లు, బస్సులు పోలేవు. ఆ ఊరిలో ఓ పేద రైతు కుటుంబంలో జన్మించిన ఆమెకు నలుగురు సోదరీమణులు, ఒక సోదరుడు. తండ్రికి చదువు విలువ తెలుసు. అందుకే, ‘అమ్మాయిలకు ఎందుకు చదువు? వారేం సాధిస్తారు?’ అంటూ ఇరుగుపొరుగు వారు గేలి చేసినా అవేవీ పట్టించుకోలేదు. పిల్లల్ని కష్టపడి ఉన్నత చదువులు చదివించాడు. ఫలితంగా వారంతా వివిధ రంగాల్లో ఉన్నత ఉద్యోగాలు, వృత్తుల్లో స్థిరపడ్డారు. మోడలింగ్‌ చేస్తూ న్యాయవాద వృత్తిలో కొనసాగుతోంది.

మోడల్‌ అవ్వాలనుకుంది..
చిన్నతనంలో చదవడం కోసం నిషా.. రోజు 12 కిలోమీటర్లు నడిచి వెళ్లేది. మాతృభాషలోనే చదువుకోవడంతో రాజస్థానీ భాష తప్ప హిందీ, ఇంగ్లిష్‌పై పట్టులేదు. దీంతో ఇంజినీరింగ్‌లో చేరిన ఆమెకు చదవడానికి, మాట్లాడటానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. తోటి విద్యార్థులు ఆమె మాట్లాడే తీరు చూసి ఎగతాళి చేసేవారు. నిషా వాటికి ఏ మాత్రం కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసంతో భాషపై పట్టు సాధించింది. మరోవైపు కళాశాలలో ఫ్యాషన్‌ పోటీలు నిర్వహించగా అందులో పాల్గొని ప్రథమ బహుమతి సాధించింది. అది పత్రికలో రావడం.. కళాశాలలో గుర్తింపు రావడంతో మోడల్‌ అవ్వాలని అప్పుడే నిర్ణయించుకుంది. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక మోడలింగ్‌ ప్రయత్నాలు కొనసాగిస్తూనే అజ్‌మేర్‌లో మాస్టర్స్‌ ఇన్‌ ఎకనామిక్స్‌ చేసింది. తర్వాత యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమైంది. మరోవైపు ఫ్యాషన్‌ పోటీల్లోనూ పాల్గొనేది. ఓ సారి ఎస్‌బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్స్‌ ఎంట్రెన్స్‌ పరీక్ష రాయాల్సిన రోజే అందాల పోటీలు జరిగాయి. చదువును పక్కన పెట్టి అందాల పోటీలో పాల్గొంది. కానీ, అందులో తను గెలవకపోవడంతో తీవ్ర నిరాశకు గురైంది. ఇకనైనా మోడలింగ్‌ మానేయమని కుటుంబసభ్యులు చెప్పడంతో లా కాలేజీలో చేరింది. అయినా తను మోడలింగ్‌ను వీడలేదు. ‘ఇండియాస్‌ నెక్ట్స్‌ టాప్‌ టెన్‌ మోడల్‌’లో రన్నరప్‌గా నిలిచింది.

స్మృతి ఇరానీ పోస్టుతో..
న్యాయశాస్త్రం పట్టా అందుకున్న తర్వాత దిల్లీకి చేరుకున్న నిషా.. అక్కడ లా ప్రాక్టీస్‌ చేస్తూనే ఖాళీ సమయంలో మళ్లీ మోడలింగ్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. అలా 2019లో లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో మోడలింగ్‌ చేసే అవకాశం దక్కింది. ఆ తర్వాత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్‌మీడియాలో నిషా గురించి పోస్టు పెట్టడంతో ఆమె జీవితమే మారిపోయింది. అవకాశాలు క్యూ కట్టాయి. స్టార్‌ మోడల్‌గా పేరు ప్రఖ్యాతలు వచ్చినా తను ఒక రైతు బిడ్డనని గర్వంగా చెప్పుకుంటానంటోంది నిషా. ‘మీరు ఏదైనా కావాలనుకుంటే.. దాని కోసం అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి. అవసరమైతే కుటుంబంతో పోరాడేందుకైనా వెనకాడొద్దు’అని యువతకు సూచిస్తోంది.


Advertisement

మరిన్ని