Published : 23/01/2022 01:02 IST

ప్లాస్టిక్‌కుప్రత్యామ్నాయం చూపుతోంది..

ఏదైనా కానుక ఇవ్వాలంటే వాటిని ప్లాస్టిక్‌ బ్యాగులు, కవర్లలోనే ప్యాక్‌ చేస్తుంటాం. అవి పర్యావరణానికి ఎంత హానికరమో తెలిసినా పట్టించుకోం. కానీ, ఒడిశాకు చెందిన చాందిని ఖండేల్‌వాల్‌ అలా ఊరుకోలేదు. వెదురుబొంగులు, గడ్డి, తాటాకులతో పర్యావరణహిత వస్తువులు తయారుచేస్తూ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాన్ని చూపిస్తోంది. ఓ స్టార్టప్‌ ప్రారంభించి వందలాది హస్తకళాకారులకు అండగా నిలుస్తోంది...

చాందినికి చిన్నప్పట్నుంచి ఆర్ట్స్‌ అంటే ఆసక్తి ఎక్కువ. పాఠశాల చదువు పూర్తి కాగానే ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ కోర్సులో చేరింది. ఆ తర్వాత భువనేశ్వర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(నిఫ్ట్‌)లో డిగ్రీ పట్టా అందుకుంది. కాలేజీ రోజుల్లో లంచ్‌ బాక్స్‌ కోసం తనతోసహా విద్యార్థులంతా ప్లాస్టిక్‌ బ్యాగులను వినియోగించడం చాందినిని ఆలోచనలో పడేసింది. ఎలాగైనా ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలని అప్పుడే నిర్ణయించుకుంది. అలా గతేడాది సెప్టెంబర్‌లో ‘ఎకో లూప్‌’ అనే స్టార్టప్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న హస్తకళాకారులతో సహజ   సిద్ధంగా లభించే వెదురు బొంగులు, తాటాకులు, గడ్డితో హ్యాండ్‌ బ్యాగులు, గిప్ట్‌బాక్సులు, ట్రేలు, బుట్టలు తయారు చేయించి అమ్ముతోంది.

వారి స్ఫూర్తితో..
‘కోర్సులో భాగంగా మేం ఒడిశాలో అనేక చోట్ల హస్తకళాకారులతో కలిసి పనిచేశాం. వారంతా సహజ వనరులతో వస్తువులు తయారు చేయడం ఆసక్తిగా అనిపించింది. వీటితో గిఫ్ట్‌ బాక్సులు, బ్యాగులు ఎందుకు తయారు చేయకూడదని ఆలోచించా. వీటిని తయారు చేయాలంటే.. కొన్ని యంత్రాలు, నైపుణ్యం అవసరం. అందుకే, ఒడిశా రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మార్కెటింగ్‌ సొసైటీ(ఓఆర్‌ఎంఏఎస్‌) సంస్థను సంప్రదించా. ఈ సంస్థ ఒడిశా వ్యాప్తంగా ఉన్న హస్తకళాకారులతో వస్తువులు తయారు చేయించి విక్రయిస్తుంటుంది. అందులో పనిచేసే హస్తకళాకారులతో మాట్లాడి నా సంస్థ కోసం పనిచేయమని కోరాను. వాళ్లూ ఒప్పుకోవడంతో ‘ఎకోలూప్‌’ సంస్థ ప్రయాణం మొదలైంది. ఇప్పుడు 20కిపైగా ‘ఎకో’ వస్తువుల్ని ఉత్పత్తి చేయగలుగుతున్నాం. ఇవేకాదు, ఇతర చెట్ల ఆకులు, సహజ వనరులతో మానవాళికి ఉపయుక్తమైన.. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ వస్తువుల్ని తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. బాలాసోర్‌లో వెదురు బొంగులతో గిఫ్ట్‌ బాక్సులను తయారు చేసేందుకు 15 మంది మహిళలను బృందంగా చేర్చి ప్రభుత్వ సాయంతో ఓ కుటీరపరిశ్రమ ఏర్పాటు చేశాం. ఇప్పుడు వారు మాతో కలిసి పనిచేస్తూనే సొంత వ్యాపారం కొనసాగించగలుతున్నారు’ అంటోంది చాందిని. ప్రస్తుతం దిల్లీ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న చాందిని.. ఒడిశాతోపాటు కశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న హస్తకళాకారులతో కలిసి పనిచేస్తోంది. ఇప్పుడు ఆమె ‘ఎకోలూప్‌’ సంస్థలో మొత్తం 500 మంది వరకు హస్తకళాకారులు భాగమయ్యారు. వారిలో ఎక్కువ మంది మహిళలేనట. సంస్థ ఉత్పత్తులను ప్రస్తుతం సోషల్‌మీడియా ద్వారానే విక్రయిస్తున్నారు. రూ. 20వేల పెట్టుబడితో ప్రారంభించిన ఈ సంస్థ ద్వారా ప్రస్తుతం ఆమె నెలకు రూ. 2లక్షల వరకు ఆర్జిస్తోంది. త్వరలో ఓ ఆన్‌లైన్‌ పోర్టల్‌, దిల్లీలో ఒక స్టోర్‌ ప్రారంభించనున్నారట. తన ఈ ప్రయాణంలో అగ్రిటెక్‌ స్టార్టప్‌ సంస్థను నిర్వహిస్తున్న తన భర్త అండగా ఉన్నారని చాందిని చెప్పుకొచ్చారు.


Advertisement

మరిన్ని