Published : 24/01/2022 00:24 IST

ఈమె బ్రాండ్‌ సబ్బులు నోరూరిస్తాయి..

సాధారణంగా అమ్మాయిలు తమ చర్మతత్వానికి ఏ బ్రాండ్‌ సబ్బు వాడితే బాగుంటుందా..?! అని ఆరా తీస్తుంటారు. కానీ, ఆమె తనే ఓ బ్రాండ్‌ను సృష్టించాలనుకుంది. తన సంకల్పానికి సృజనాత్మకతను జోడించింది. డెజర్ట్‌ల రూపంలో సబ్బులు తయారు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపుతెచ్చుకుంది.. ముంబయికి చెందిన 23 ఏళ్ల రిషికా నాయక్‌. భారీ వేతనంతో ఉద్యోగాలు లభించినా.. తనకాళ్లపై తను నిలబడాలన్న లక్ష్యంతో ‘ది సాస్‌ బార్‌’ కంపెనీని స్థాపించింది. తన సరదా అలవాటే.. ఇప్పుడు వ్యాపారంగా మారిపోయిందంటున్న రిషికా విజయగాథ ఇది..

గత మూడేళ్లుగా రిషికా.. కప్‌కేకులు, క్యాండీ, ఐస్‌క్రీం, డోనట్స్‌ రూపంలో సబ్బులను తయారు చేసి విక్రయిస్తోంది. వాటిని చూస్తే  సబ్బులని ఎవరూ నమ్మలేరు. అంత సహజంగా కనిపిస్తాయి. అంతేకాదు.. రోజ్‌, వెనిలా, స్పియర్‌మింట్‌, అర్జెంటినా లెమన్‌ వంటి పరిమళాలను వెదజల్లుతాయి. యంత్రాలేవీ ఉపయోగించకుండా చేతులతోనే తయారు చేస్తున్న వీటికి ప్రస్తుతం మంచి డిమాండ్‌. ఆకృతి, పరిమళాలను బట్టి ఒక్కోదాని ధర రూ.150- రూ. 350 వరకు ఉంటుంది. బహుమతిగా ఇచ్చేందుకు వివిధ ఆకృతుల్లో సబ్బులను తయారు చేసి గిఫ్ట్‌బాక్సులను సైతం అందుబాటులోకి తెచ్చింది.

అలా వచ్చిందీ ఆలోచన..

‘2017లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాను. సిడ్నీలోని ఓ మార్కెట్‌కి వెళ్లినప్పుడు ఒక మహిళ హ్యాండ్‌మేడ్‌ సబ్బులను విక్రయిస్తుండటం చూశా. సబ్బు ఆకృతి సాధారణంగానే ఉన్నా.. లైమ్‌ పై, చాకొలేట్‌ పరిమళాల గుభాళింపు బాగా ఆకర్షించింది. తిరిగి భారత్‌కి వచ్చాక ఈ హ్యాండ్‌మేడ్‌ సబ్బులపై అధ్యయనం చేస్తే.. భారత్‌లో ఇలాంటివి చాలా అరుదుగా ఉన్నాయని తెలిసింది. దీంతో సరదాగా నేనే సబ్బులు తయారు చేయాలని నిర్ణయించుకున్నా.

అలా 2018లో రూ.25వేలు పెట్టి సబ్బుల తయారీకి కావాల్సిన ముడి సరుకులు కొనుగోలు చేశా. అప్పుడు నా వయసు 19 ఏళ్లే. మూస పద్ధతిలో కాకుండా భిన్నంగా డెజర్ట్‌ల రూపంలో తయారు చేసి.. వాటి ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశా. కొంతమంది స్నేహితులు ఆ సబ్బుల్ని కొనుగోలు చేసి ఇతరులకు బహుమతిగా ఇచ్చారు. వారికీ అవి నచ్చడంతో ఆర్డర్స్‌ పెరిగాయి. అలా దీన్నే వ్యాపారంగా మార్చుకొని కంపెనీ ప్రారంభించా. కొంతమంది సిబ్బందిని నియమించుకొని వేల సంఖ్యలో సబ్బులు తయారు చేస్తున్నా. సబ్బులు అచ్చం డెజర్ట్‌ల మాదిరిగానే కనిపించడం కోసం సహజసిద్ధమైన రంగుల్ని ఉపయోగిస్తున్నాం. గతంలో కొన్నాళ్లు స్టైలిస్ట్‌గా పనిచేయడం నా వ్యాపారానికి ఉపయోగపడింది. ఇప్పటి వరకు 10వేల కస్టమర్లకు మా సబ్బుల్ని విక్రయించాం. అందులో చాలా మంది మళ్లీ ఆర్డర్స్‌ ఇస్తున్నారు. ప్రస్తుతం అమెజాన్‌, ఫేస్‌షాప్‌ వంటి ఆన్‌లైన్‌ షాపింగ్‌ పోర్టళ్లు, షాపింగ్‌ మాల్స్‌ కూడా మా ఉత్పత్తులు కావాలని అడుగుతున్నాయి. మా వ్యాపారం మంచి లాభాలతో కొసాగుతుండటం చాలా సంతోషంగా ఉంద’ని రిషికా నాయక్‌
చెప్పుకొచ్చారు.


Advertisement

మరిన్ని