ఆమె ముందు పర్వతాలు మోకరిల్లాయి..

పర్వతారోహణ ఎంతో కష్టమైన ప్రక్రియ. పర్వతాన్ని అధిరోహించే క్రమంలో ఎదురయ్యే ఎన్నో అవాంతరాలు, ఆపదలను ఎదుర్కొని శిఖరాగ్రానికి చేరుకోవాలి. ఇలాంటి సాహసోపేత పర్వతారోహణల్లోనూ పురుషులకు ఏమాత్రం తీసిపోమని అంటోంది ప్రియాంక మోహితే. 28 ఏళ్ల ఈ యువతి..

Updated : 27 Jan 2022 14:33 IST

పర్వతారోహణ ఎంతో కష్టమైన ప్రక్రియ. పర్వతాన్ని అధిరోహించే క్రమంలో ఎదురయ్యే ఎన్నో అవాంతరాలు, ఆపదలను ఎదుర్కొని శిఖరాగ్రానికి చేరుకోవాలి. ఇలాంటి సాహసోపేత పర్వతారోహణల్లోనూ పురుషులకు ఏమాత్రం తీసిపోమని అంటోంది ప్రియాంక మోహితే. 28 ఏళ్ల ఈ యువతి.. ప్రపంచంలోని ఎత్తయిన పర్వతాలను అధిరోహిస్తూ.. రికార్డులు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే పర్వతారోహణ విభాగంలో భారత ప్రభుత్వం అందించే అత్యుత్తమ జాతీయ పురస్కారం ‘టెన్జింగ్‌ నార్గే నేషనల్‌ అడ్వెంచర్‌ అవార్డు 2020’ ఇటీవల ఆమెను వరించింది. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే.. సెలవుల్లో పర్వతాలను అధిరోహిస్తూ తనకున్న అభిరుచిని కొనసాగిస్తున్న ప్రియాంక ప్రస్థానమిదీ.

ప్రపంచంలోని పదో ఎత్తయిన శిఖరం.. అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళగా ప్రియాంక మోహితే నిలిచింది. గతేడాదే ఆమె ఈ ఫీట్‌ చేసి చరిత్ర సృష్టించింది. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ప్రియాంక.. ప్రస్తుతం బెంగళూరులో బయోకాన్‌ సంస్థలో రిసెర్చ్‌ అసోసియేట్‌గా పనిచేస్తోంది. చిన్నప్పుడు ఛత్రపతి శివాజీ వీరగాథలను ఆమెకు తన మామయ్య చెప్పేవారట. దీంతో అప్పటి నుంచే సాహసాలపై మక్కువ పెంచుకుందామె. కాస్త పెద్దయ్యాక ఆమె మనసు పర్వతారోహణవైపు మళ్లింది. అది చాలా కష్టమని, వెళ్లడం మంచిదికాదని చాలా మంది ప్రియాంకకు సూచించారట. కానీ, తన అభిరుచి వైపే అడుగులు వేసిందామె. అలా రాక్‌ క్లైంబింగ్‌, హైకింగ్‌లో శిక్షణ తీసుకుంటూ పర్వతారోహణలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

2013లో మౌంట్‌ ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి.. ఆ ఘనత సాధించిన మహారాష్ట్రకి చెందిన తొలి అతి పిన్న వయస్కురాలిగా పేరు గడిచింది. 2016లో ఆఫ్రికాలోని కిలిమాంజరో పర్వతం, 2018లో లోట్సే పర్వతాన్ని అధిరోహించింది. ఇక 2019లో మకాలు పర్వతాన్ని ఎక్కిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. ఆమె సాధించిన ఘనతల్లో ఇవి కొన్ని మాత్రమే. గతేడాది ప్రియాంక అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహించిన విషయాన్ని ఆమె ఉద్యోగం చేస్తున్న సంస్థ యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త కిరణ్‌ మజుందార్‌ షా సోషల్‌మీడియా ద్వారా వెల్లడించడంతో ప్రియాంక గురించి దేశానికి తెలిసింది. అదే ఏడాది రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ పురస్కారం అందుకోవడం తనకు సంతోషం కలిగించిందని చెప్పింది ప్రియాంక.

‘‘రాష్ట్రపతి నుంచి గౌరవం పొందడం నమ్మశక్యం కాని అనుభూతి. రాష్ట్రపతి భవన్‌ను సందర్శించడం కూడా అదే తొలిసారి. అవార్డు ప్రదానోత్సవంలో నా పేరును ప్రకటించినప్పుడు ఎంతో గర్వంగా అనిపించింది. నాకే కాదు, నా కుటుంబానికి ఇది ఎంతో గర్వకారణం. పర్వతారోహణ అనేది ప్రమాదకరమైందే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కానీ, అన్నింటికి సిద్ధంగా ఉండాలి. అందుకే, 11 ఏళ్లుగా శిక్షణ పొందుతున్నా. ఏ రంగంలోనైనా స్త్రీ, పురుషులనే తేడా ఉండదని నమ్ముతున్నాను. ఆ నమ్మకమే నన్ను ఈ ఘనతలు సాధించేలా చేస్తోంది’’అని ప్రియాంక మోహితే చెప్పుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్