ఎవరికీ పట్టని సమస్యపై.. ఓ అమ్మాయి పోరాటం
close
Updated : 28/01/2022 05:24 IST

ఎవరికీ పట్టని సమస్యపై.. ఓ అమ్మాయి పోరాటం

‘బాగా చదువుకొని.. ఉద్యోగం సంపాదించో లేదా వ్యాపారం ప్రారంభించో జీవితంలో స్థిరపడాలి. వివాహం చేసుకొని కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి’.. సాధారణంగా యువత ఆలోచన ఈ విధంగానే ఉంటుంది. ఇదే జీవిత లక్ష్యంగా భావించేవాళ్లూ ఉన్నారు. కానీ, ప్రాచీ శేవ్‌గావొంకర్‌ ఆలోచన.. లక్ష్యం పూర్తిగా భిన్నం. ఆమె ఆరాటం ఉద్యోగం కోసం కాదు.. ప్రపంచ శ్రేయస్సు కోసం. వాతావరణ మార్పులు, భూతాపం కారణంగా ఏర్పడుతున్న విపత్తులు, వాటికి బలవుతున్న ప్రజల్ని చూసి చలించిపోయిన ప్రాచీ.. భూతాపం పెరగకుండా తన వంతు ప్రయత్నం చేస్తోంది. ‘కూల్‌ ది గ్లోబ్‌’ అనే యాప్‌ రూపొందించి.. గ్రీన్‌హౌజ్‌ గ్యాస్‌ ఉద్గారాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వాటిని తగ్గించేందుకు సలహాలు, సూచనలు ఇస్తోంది. భూతాపంపై తన పోరు గురించి ఆమె మాటల్లోనే..

పుణెలో మాస్‌ కమ్యూనికేషన్‌ చదువుకుంటున్న రోజుల్లో ఓసారి ‘ప్రపంచానికి ఉన్న అతిపెద్ద సమస్య ఏంటి?’అని గూగుల్‌ని అడిగా. ‘వాతావరణ మార్పు’ అని సమాధానం వచ్చింది. నిజమే.. ప్రపంచ దేశాలు దీని గురించే చర్చించుకుంటున్నాయి. కానీ, సామాన్య ప్రజలకు దీనిపై అసలు అవగాహన ఉందా? అనే ప్రశ్న నాలో రేకెత్తింది. గ్రీన్‌హౌజ్‌ గ్యాస్‌ ఉద్గారాలు పెరగడం వల్లే భూతాపం పెరుగుతోంది. కాబట్టి ఆ ఉద్గారాలను వీలైనంత వరకు తగ్గించాలని భావించా. ప్రపంచ సమస్యను నేను ఒక్కదాన్నే పరిష్కరించలేను. కానీ, నావంతు ప్రయత్నం చేయాలనుకున్నా. అలా నేను, నా కుటుంబం కలిసి ఏటా 10శాతం గ్రీన్‌హౌజ్‌ గ్యాస్‌ ఉద్గారాలు తగ్గించాలని నిర్ణయించుకున్నాం. నా ఆలోచన నచ్చి ఇరుగుపొరుగు వాళ్లు కూడా నాతో చేతులు కలిపారు.

దీంతో నా ఆలోచనని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలతో పంచుకోవాలనిపించింది. అందుకే, ‘కూల్‌ ది గ్లోబ్‌’ యాప్‌ను రూపొందించా. పేరుకు నేను వ్యవస్థాపకురాలినే కానీ.. వందల మంది ఐటీ విద్యార్థులు ఈ యాప్‌ రూపకల్పనకు తోడ్పాటునందించారు. ఇందులో యూజర్లకు ప్రతి నెలా గ్రీన్‌హౌజ్‌ గ్యాస్‌ ఉద్గారాలు ఎంతమేర తగ్గించాలనే లక్ష్యాన్ని ఇస్తాం. యూజర్‌ సొంత కారులో కాకుండా పబ్లిక్‌ వాహనంలో ప్రయాణిస్తే దాదాపు 2.3 కిలోల కర్బన ఉద్గారాలు తగ్గించినట్లే. రోజులో రెండు గంటలు టీవీ ఆఫ్‌ చేస్తే 1,200 గ్రాముల కర్బన ఉద్గారాల ఉత్పత్తిని నిలిపి వేసినట్లే. ఇలా రోజువారీ పనుల్లోనే చిన్న మార్పులను సూచిస్తూ పెద్ద మార్పునకు శ్రీకారం చుట్టాం.

మా యాప్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ప్రస్తుతం 55 దేశాల్లో పాతికవేలకుపైగా యూజర్లున్నారు. సాధారణ ప్రజానీకం ఏకమైతే అద్భుతాలు జరుగుతాయని బలంగా నమ్ముతా. అందుకే, కనీసం వంద కోట్ల మంది పౌరులను భూతాపం తగ్గించే మా ప్రయత్నంలో భాగం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెబుతోంది ప్రాచీ.

ప్రాచీ ప్రయత్నాన్ని మెచ్చి అనేక సంస్థలు ఆమెకు అవార్డులు ప్రదానం చేశాయి. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న ఆమెని రోటరీ క్లబ్‌ బాంబే ‘తారు లాల్వానీ’ అవార్డుతో సత్కరించింది. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ‘వాతావరణ మార్పు’, ‘భూతాపం’ గురించి ప్రాచీ ఉపన్యాసాలిచ్చింది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు ఆమెను గెస్ట్‌ లెక్చరర్‌గా ఆహ్వానిస్తున్నాయి. ప్రాచీ ప్రారంభించిన ఈ చిన్ని ప్రయత్నం ద్వారా గొప్ప మార్పు రావాలని మనమూ ఆశిద్దాం..


Advertisement

మరిన్ని