Updated : 29/01/2022 04:58 IST

అదిగదిగో...అదే మా ఇల్లు

ఆ ఇరుకైన గల్లీలో ఒక ఇంటి చూరికి ఆనుకుని మరో చూరు..అందుకే స్వచ్ఛమైన గాలీ, వెలుతురే కాదు... నిర్మలమైన ఆకాశాన్ని చూడ్డం కూడా అరుదే అయ్యింది ఆమెకు. ఇక పొద్దునే కాలకృత్యాలు తీర్చుకోవాలంటే తోటిబస్తీవాసులతో పెద్ద యుద్ధం చేయాలి. అలాంటి బస్తీ నుంచి వచ్చి బహుళజాతి సంస్థలో పెద్ద ఉద్యోగం సంపాదించింది. అయినా తన పూర్వ జీవితాన్ని ఎందుకు తలుచుకుందో తెలియాలంటే ముంబయికి చెందిన షహీనాఅట్టర్‌వాలా కథ తెలియాలి..

‘బ్యాడ్‌ బాయ్‌ బిలియనీర్స్‌- ఇండియా’.. ముంబయి మురికివాడలపై తీసిన వెబ్‌సిరీస్‌ ఇది. ఆ మహానగరంలో ఆకాశాన్ని తాకే భవనాల చెంతనే దిష్టిచుక్కల్లా ఉండే మురికివాడలని చూస్తున్నప్పుడు మైక్రోసాఫ్ట్‌ సంస్థలో ప్రొడక్ట్‌ డిజైనర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న షహీన్‌అట్టర్‌వాలా చూపులు ఓ చోట బలంగా ఆగిపోయాయి. ఎందుకంటే ఒకప్పుడు తను నివసించిన ఇల్లు అక్కడే ఉంది మరి. ‘ఇల్లంటే అది ఇల్లు కాదు. పేరుకు మాత్రమే. సదుపాయాల మాట దేవుడెరుగు. ఒక్కోసారి రోడ్డుపైనే నిద్ర పోవాల్సి వచ్చేది. ఇప్పుడైతే కనీసం మరుగుదొడ్లు ఒక మాదిరిగానైనా ఉన్నాయి. అవీ లేక ఇబ్బంది పడ్డ రోజులున్నాయి. అప్పట్లో మా కుటుంబం బాంద్రా రైల్వే స్టేషన్‌కు సమీపంలోని దర్గా గల్లీలో ఉండేది. పొట్టకూటి కోసం ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ముంబయికి వచ్చిన కుటుంబం మాది. నాన్న రోడ్ల పక్కన అత్తర్లు అమ్మేవాడు. ఆ పనే మాకింత అన్నం పెట్టేది. ఒక్కోసారి నేనూ తోడుగా వెళ్లేదాన్ని. మురికివాడలో జీవితం చాలా కష్టంగా ఉంటుంది. లైంగిక వేధింపులకు గురికాని ఆడవాళ్లు ఉండరేమో. అది సహజమైన విషయం అక్కడ. నా చుట్టూ ఎంతో మంది మహిళలు నిస్సహాయంగా జీవిస్తుండేవారు. కుటుంబం మీద ఆధారపడి, నిత్యం వేధింపులకు గురయ్యేవారు. స్వేచ్ఛ కనిపించదు, వినిపించదు. నాకు 15 ఏళ్లు వచ్చే సరికి ఈ పరిస్థితులన్నీ అర్థమయ్యాయి. ఇవి నాలో నిరాశని పెంచడానికి బదులు కొత్త ఉత్సాహానికి నాంది పలికాయి. నా జీవితం ఇలా ఉండకూడదని అనుకున్నా. 2015 నుంచి ఒంటరిగా జీవితానికి ఎదురీదాను. అదే నన్ను ఇక్కడ ఉంచింది’ అంటూ షహీనా ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ఆ సిరీస్‌లోని కొన్ని ఫొటోలను కూడా పంచుకుంది.

ఆ కంప్యూటర్‌ని చూశాకే...
చిన్నతనంలో కంప్యూటర్‌ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియని షషీనాకు పాఠశాలలో దాన్ని మొదటిసారి చూసినప్పుడు అది ఆమె లక్ష్యానికి కొత్త ఊపిరిలూదింది. దాని ముందు కూర్చుంటే కొత్త అవకాశాలు వస్తాయని ఆ చిట్టి బుర్రకు తొందరగానే అర్థమైంది. ఎలాగైనా సరే కంప్యూటర్‌ తరగతులకు వెళ్దామంటే.. ఇంట్లో తనే పనికి వెళ్లాల్సిన పరిస్థితులు ఆమెను వెనక్కి నెట్టాలని చూశాయి. అయితే తండ్రి సహకారం, ఆమె సొంత ప్రయత్నాలు కలిసి ఆమెను ముందుకు నడిపించాయి. డిజైనింగ్‌లో అవకాశాలను పసిగట్టిన ఆమె..ఆ దిశగా తన నైపుణ్యాలను పెంచుకుంది. చివరకు మైక్రోసాఫ్ట్‌లో కొలువు సంపాదించింది. మురికివాడలో దయనీయ పరిస్థితుల్ని అనుభవించిన ఆ కుటుంబం 2021లో ఒక అపార్ట్‌మెంట్‌లోకి మారింది. ‘ఇప్పుడు మా ఇంటి నుంచి నిర్మలమైన, స్వచ్ఛమైన ఆకాశాన్ని చూడొచ్చు. గాలి, సూర్యరశ్మి ఇంట్లోకి వస్తున్నాయి. చుట్టూ పక్షుల శబ్దాలు, పచ్చదనంతో మా ఇల్లు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. బతుకీడ్చడమే కష్టమైన మాకు ఇలాంటి ఇల్లు కలలో కూడా అసాధ్యం అనుకుంటే ఇంకా అక్కడే ఉండేదాన్నేమో. కానీ కృషి, పట్టుదల ఉంటే ఏదీ అసాధ్యం కాదు అనుకున్నాను.’ అంటూ యువతలో స్ఫూర్తి నింపుతున్న షహీనా ప్రస్తుతం ఎంతోమంది పేదపిల్లలకు వ్యక్తిత్వ వికాస తరగతులు చెబుతూ మెంటర్‌గా ఉంటోంది. దశాబ్దాలుగా తన తండ్రి తమ ఎదుగుదల కోసం పడిన కష్టమే ఇప్పటి జీవితానికి పునాది వేసిందంటూ తన ప్రేమను చాటుకుంది. ఆమె చెప్పిన ఈ బతుకుపాఠం.. నెట్టింట ఎంతోమందిని ఆకట్టుకుంది. ఆమె ఎదిగిన తీరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని