అమ్మాయిల కోసం పోరాడుతోంది!

ఆడపిల్లలకు చదువెందుకు? అని ప్రశ్నించేవాళ్లు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు.. అలాంటివారికి సమాధానంగా నిలుస్తోందామె. కష్టపడి ఉన్నత చదువులు చదవడమే కాదు, ప్రపంచ ప్రఖ్యాత సంస్థలోని విద్యావిభాగంలో ఉన్నత పదవికి ఎంపికైంది. అంతర్జాతీయ స్థాయిలో సేవలందించాలన్న తన కలను సాకారం చేసుకుంది.

Updated : 29 Jan 2022 04:54 IST

ఆడపిల్లలకు చదువెందుకు? అని ప్రశ్నించేవాళ్లు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు.. అలాంటివారికి సమాధానంగా నిలుస్తోందామె. కష్టపడి ఉన్నత చదువులు చదవడమే కాదు, ప్రపంచ ప్రఖ్యాత సంస్థలోని విద్యావిభాగంలో ఉన్నత పదవికి ఎంపికైంది. అంతర్జాతీయ స్థాయిలో సేవలందించాలన్న తన కలను సాకారం చేసుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే అమ్మాయిలు ఆకాశమే హద్దుగా ఎదుగుతారని నిరూపించింది. ఆమే దివ్యశర్మ.

హరియాణాలోని కలయత్‌ నగరానికి చెందిన దివ్య శర్మ ఇటీవల పారిస్‌లోని యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో) హెడ్‌క్వార్టర్స్‌లో సీనియర్‌ రీసెర్చ్‌ కన్సల్టెంట్‌గా ఎంపికైంది. విధుల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా విద్యావ్యవస్థల్ని, విధానాల్ని పర్యవేక్షించనుంది. ఇంతటి కీలకమైన పదవికి ఎంపికైన దివ్యశర్మ.. తన కుటుంబాన్నే కాదు, యావత్‌దేశాన్ని గర్వపడేలా చేసింది.
దివ్య తండ్రి ముఖేశ్‌ శర్మ ప్రభుత్వ ఆస్పత్రిలో టెక్నికల్‌ ఆఫీసర్‌. తన కుమార్తెను ఉన్నత చదువులు చదివించాలని అనుకున్నారు. అందుకు తగ్గట్టే ఆమె చదువుల తల్లిగా మారిపోయింది. ప్రాథమిక విద్యను కలయత్‌లోనే చదువుకున్న దివ్య.. మొహాలీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌)లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకుంది. 2016లో జర్మనీకి వెళ్లి గణితశాస్త్రంలో పీహెచ్‌డీ చేసింది. ఆ తర్వాత పారిస్‌లోని ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కో-ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ)లో ఇంటర్న్‌షిప్‌లో చేరింది.
దివ్య శర్మ.. చిన్నతనం నుంచి చదువులో ముందుండటమే కాదు.. విద్యాభ్యాసాన్ని ఒక కొత్త కోణంలో చూస్తుండేది. విద్యా వ్యవస్థను మెరుగుపర్చాలన్న తపన.. ఈ అంశంలో అంతర్జాతీయ స్థాయిలో సేవలందించాలనే కోరిక ఆమెలో బలంగా నాటుకుపోయాయి. తన కల సాకారం కావాలంటే అంతర్జాతీయ సంస్థ యునెస్కో ద్వారానే సాధ్యమవుతుందని భావించి దరఖాస్తు పంపించింది. ఇటీవల పిలుపు రావడంతో తన అకడమిక్‌ మెరిట్‌, ప్రతిభతో యునెస్కో సెలెక్షన్‌ కమిటీని మెప్పించింది. అలా యునెస్కో విద్యావిభాగంలో సీనియర్‌ రీసెర్చ్‌ కన్సల్టెంట్‌గా ఎంపికైంది. 28 ఏళ్ల వయసులో దివ్య శర్మ ఇంత గొప్ప విజయాన్ని సాధించడం పట్ల కుటుంబసభ్యులు సంతోషంలో మునిగితేలుతున్నారు. బంధువులు, స్థానికులు దేశ ప్రజల నుంచి ఆమెకు అభినందనలు వెల్లువెత్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్