సరిహద్దు మార్గాల్లో.. దూసుకెళుతోంది!

ఆమెకేమో.. మోటార్‌సైకిల్‌ నడపడమిష్టం. ఇంట్లో వాళ్లు ససేమిరా అన్నారు. ‘అమ్మాయిలు బైకులు ఎందుకు నడపకూడదు?’ అనుకుందామె. పట్టుదలతో నేర్చుకోవడమే కాదు.. దేశంలోనే అత్యంత ఎత్తునున్న ప్రదేశానికి బైకుపై చేరుకొని జాతీయ జెండాను ఎగరేసింది.. కంచన్‌ ఉగుర్‌సాందీ!

Updated : 01 Feb 2022 04:08 IST

ఆమెకేమో.. మోటార్‌సైకిల్‌ నడపడమిష్టం. ఇంట్లో వాళ్లు ససేమిరా అన్నారు. ‘అమ్మాయిలు బైకులు ఎందుకు నడపకూడదు?’ అనుకుందామె. పట్టుదలతో నేర్చుకోవడమే కాదు.. దేశంలోనే అత్యంత ఎత్తునున్న ప్రదేశానికి బైకుపై చేరుకొని జాతీయ జెండాను ఎగరేసింది.. కంచన్‌ ఉగుర్‌సాందీ!

కంచన్‌ది ఝార్ఖండ్‌లోని సెరైకెలా. పేద గిరిజన కుటుంబం. చిన్నప్పటి నుంచీ చదువుపై ఆసక్తి. ఎప్పుడూ ముందంజలో ఉండే ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేవి. దీంతో చదువు కొనసాగిస్తూ వెళ్లింది. బెంగళూరు నుంచి ఫార్మసీలో డిగ్రీ పట్టా పొందింది. గ్రామంలోని కుర్రాళ్లు మోటారు సైకిళ్లపై తిరుగుతోంటే వాటిపై మనసు పారేసుకుంది. తనూ నేర్చుకోవాలనుకుంది. ఇంట్లో చెబితే ‘అవి అబ్బాయిలవి. నువ్వు నడపకూడ’దన్నారు. పట్టుబడితే.. కాస్త దిగొచ్చి స్కూటర్‌ నేర్చుకోనిచ్చారు. దీంతో ఎలాగైనా నేర్చుకోవాలన్న పట్టుదల పెరిగిందామెకు. కంచన్‌కు 2019లో దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో క్లినికల్‌ ఫార్మసిస్ట్‌గా ఉద్యోగమొచ్చింది. జీతం అందుకోగానే ఆమె చేసిన మొదటిపని కొంత మొత్తం చెల్లించి లోను ద్వారా బైకు తీసుకోవడమే. అప్పటికి దాన్ని పట్టుకోవడం కూడా రాదామెకు. ఆఫీసులోని సీనియర్ల సాయంతో నేర్చుకుంది. పట్టురాగానే ఒంటరిగా ఆగ్రాకు వెళ్లింది. ఆ ప్రయాణం చాలా ఆనందాన్నిచ్చిందామెకు. దీంతో రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, లద్దాఖ్‌, లేహ్‌.. ఇలా ఎన్నో ప్రదేశాలను చుట్టేసింది. సరిహద్దుల్లోని జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) గురించి తెలిసింది. పహారా కాస్తూనే వాతావరణ పరిస్థితులకు, శత్రువులకు ఎదురోడుతూ సైనికులు ఈ రహదారులను నిర్మిస్తున్నారని తెలిసి, వాళ్లని కలిసి కృతజ్ఞతలు చెప్పాలనుకుంది. ఆ క్రమంలోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మిస్తున్న ఉమ్లింగల రహదారి గురించి తెలుసుకుంది. అక్కడికి ఒంటరిగా ప్రయాణించాలనుకుంది. అనుమతి కోసం దరఖాస్తు చేసుకుని, పొందింది. అక్కడికి చేరుకుని ఆ ఘనత సాధించిన తొలి బైకర్‌గా నిలిచింది.
‘ఈ ప్రయాణంలో వాతావరణం ఎన్నో పరీక్షలు పెట్టింది. కొద్ది నిమిషాలకే పరిస్థితులు ఊహించని రీతిలో మారిపోయేవి. ఒక్కోసారి విపరీతమైన చలైతే, ఇంకోసారి మంచువాన, మబ్బు పట్టి ఒకటే చీకటి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. ప్రమాదమే. వీటన్నింటినీ లెక్కచేయకుండా రేయింబవళ్లు పనిచేస్తోన్న ఇంజినీర్లు, జవాన్లను ఈ ప్రయాణంలో చూశా. అదే ప్రయాణాన్ని కొనసాగించేలా ప్రోత్సహించింది. ప్రపంచానికి ఎత్తైన ప్రదేశంలో 17 మలుపులు దాటుకుంటూ ఉమ్లింగ లా పాస్‌కు చేరుకున్నా. ఇప్పటివరకూ అక్కడికి సామాన్యులెవరూ వెళ్లలేదు. అలాంటిది జాతీయ జెండాను ఎగరేసే అవకాశమూ వచ్చింది. చాలా గర్వమనిపించింది. మోటారు సైకిళ్లంటే అబ్బాయిలకే అన్న మాట చిన్నప్పటి నుంచీ వింటూ వచ్చా. అలాంటి నాకు బైక్‌పై ప్రయాణించడమే కాకుండా.. జాతీయ జెండాను ఎగురవేసే అవకాశమూ దక్కడంతో ఆనందంతో ఏడ్చేశా కూడా’ అంటోంది కంచన్‌. అంతేకాదు.. ఏదైనా సాధించాలనిపిస్తే ధైర్యంగా ప్రయత్నించాలనీ.. ఎప్పుడూ తమ సామర్థ్యాలను తక్కువ అంచనా వేసుకోవద్దని అమ్మాయిలకు సందేశమిస్తోంది. అందుకు తననే ఉదాహరణగా చూపెడుతోంది. ఈ ప్రయాణమిచ్చిన ఉత్సాహంతో భూటాన్‌, మయన్మార్‌, కజికిస్థాన్‌లోని రహదారుల్లోనూ ప్రయాణిస్తానని చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్