Updated : 02/02/2022 04:11 IST

పేదరికంపై విజయాల గోల్‌

ఒకరు అనాథ.. ఇంకొకరు కూలీ కూతురు.. మరొకరు రైతు బిడ్డ... నేపథ్యం ఏదైతే ఏంటట? భారత సాకర్‌ మహిళా జట్టు సభ్యులు... వీళ్లు. జాతీయ జట్టుని శిఖరాగ్రాన నిలిపేందుకు అహరహం శ్రమిస్తున్న క్రీడారత్నాలు...  పేదరికాన్ని గోల్‌పోస్ట్‌లోకి నెట్టేసి విజయనాదం చేస్తున్న ఈ అమ్మాయిలతో ‘వసుంధర’ మాట కలిపింది.


అనాథ కాదు.. దేశ భరోసా

భారత జట్టులో కీలకమైన సంధ్యా రంగనాథన్‌ నేపథ్యం తెలిస్తే ఎవరైనా కంటతడి పెడతారు. కడలూరు జిల్లా బన్రూట్టికి చెందిన పాతికేళ్ల సంధ్య చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ చదువుకునేది. సహాధ్యాయినులనే తోబుట్టువులు, బంధువులనుకునేది. అప్పుడప్పుడు మైదానానికి వెళ్లి ఆటలాడేది. ఈ క్రమంలో సీనియర్లు తనకి ఫుట్‌బాల్‌ పరిచయం చేశారు. కొన్నాళ్లకే ఆటలో మెలకువలు నేర్చుకుంది. జిల్లాస్థాయి, జాతీయస్థాయి పోటీల్లో మెరిసింది. కానీ మధ్యలో ఎన్నో కష్టాలు. చదువు ఆగిపోయే పరిస్థితీ వచ్చింది. పోటీలకు వెళ్లేందుకు కూడా డబ్బులుండేవి కాదు. అప్పుడు స్నేహితులు, దాతలే ఆదుకునేవారు. వారి చేయూత, ప్రోత్సాహంతో కసిగా ఆడేది. ఇలా.. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని చివరికి జాతీయ జట్టుకి ఎంపికైంది. గతేడాది డిసెంబరులో జరిగిన జాతీయ క్రీడల్లో మూడు మ్యాచుల్లో ఏకంగా 12 గోల్స్‌ చేసి సత్తా చాటింది. యూఏఈ, బహ్రెయిన్‌, స్వీడెన్‌, బ్రెజిల్‌ తదితర దేశాల్లో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లోనూ తానేంటో నిరూపించుకుంది. స్పెయిన్‌లో 2018లో జరిగిన సీవోటీఎఫ్‌ ఉమెన్స్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో మొరాకోపై సంధ్య తన తొలి అంతర్జాతీయ గోల్‌ చేసింది. ఆపై వెనుదిరిగి చూడలేదు.


రైతు బిడ్డ..

సేలం నగరానికి చెందిన మరియమ్మాళ్‌ బాలమురుగన్‌.. చిన్నవయసులో రెండు అంతర్జాతీయ టోర్నీలు ఆడింది. పద్దెనిమిదేళ్ల మరియని భారత జట్టు భవిష్యత్తు ఆశాకిరణంగా ఫుట్‌బాల్‌ విశ్లేషకులు వర్ణిస్తున్నారు. తనది వ్యవసాయ కుటుంబం. కటిక పేదరికం అనుభవించిన మరియ కన్నవాళ్ల కష్టాలు తీరాలంటే తను ఉన్నతస్థానంలో ఉండాలనుకుంది. అందుకు ఆటే మార్గమని నమ్మింది. 2018లో ‘ఖేలో ఇండియా టోర్నీ’లో అదిరిపోయే ప్రదర్శనతో వెలుగులోకి వచ్చింది తను. అండర్‌-16, అండర్‌-17కి ఆడిన తర్వాత భారతజట్టులో చోటు సంపాదించుకుంది. తాజాగా కేరళలో జరిగిన జాతీయ మహిళా ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో తనదైన ప్రతిభ చూపిందీ అమ్మాయి.


కూలీ కూతురి ప్రతిభ  

సేలం అమ్మాయి కార్తీక అంగముత్తు తల్లిదండ్రులు మిల్లులో పనిచేసే కూలీలు. కూతురిని చదివించే స్తోమత లేక చదువు మధ్యలోనే ఆపేశారు. అలాంటిది తమ బిడ్డ ఫుట్‌బాల్‌ జాతీయ జట్టులో స్థానం సంపాదిస్తుందని ఏనాడూ ఊహించి ఉండరు. చిన్నచిన్న పనులు చేస్తూ కన్నవాళ్లకు సాయపడే కార్తీక ఖాళీగా ఉన్నప్పుడు ఫుట్‌బాల్‌ ఆటపై దృష్టి పెట్టింది. ఆమెలోని ప్రతిభకి మెరుగులద్దారు స్థానిక కోచ్‌. ఆలస్యంగా ఫుట్‌బాల్‌ ఆటను ఎంచుకున్నా.. తన దూకుడైన ఆట తీరుతో అత్యంత వేగంగా జాతీయ జట్టులో చోటు సంపాదించుకుంది. కూతురి గొప్పతనం తెలుసుకున్న కార్తీక తల్లిదండ్రులు ఇంట్లో ఖర్చులు తగ్గించుకొని మరీ తనకి మంచి ఆహారం అందేలా చూస్తున్నారు. 2019-20లో జాతీయ జట్టులో స్థానం సంపాదించింది కార్తీక.


ఎస్‌ఐగా.. క్రీడాకారిణిగా...

చెన్నై నగర వీధుల్లో అల్లరి మూకల్ని అదుపులో పెడుతూ.. కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నప్పుడు జనాల్ని అప్రమత్తం చేస్తూ బిజీగా ఉంటుంది ఇందుమతి. మరోవైపు మైదానంలో చిరుతలా కదులుతూ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. స్పోర్ట్స్‌ కోటాలో ఎస్‌.ఐ. ఉద్యోగం దక్కించుకొని, భారత మహిళా ఫుట్‌బాల్‌ జట్టు తరపున ఆడుతోంది. ఆమె కూడా ఒక కూలీ కూతురే. స్కూళ్లో వ్యాయామ ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో ఫుట్‌బాల్‌పై మమకారం పెంచుకుంది. చదువు, ఆటల్ని సమన్వయం చేస్తూ రెండింట్లోనూ రాణించేది. చేసేది కూలి పని అయినా కూతురిని అన్నివిధాలా ప్రోత్సహించేవాళ్లు కన్నవాళ్లు. అలా ఒక్కో మెట్టే ఎక్కుతూ జాతీయ జట్టు తలుపు తట్టింది ఇందుమతి. అన్నట్టు.. కొవిడ్‌ వారియర్‌గా తమిళనాడు రాష్ట్ర పోలీసు విభాగం నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకుంది తను.


జూనియర్‌గా మెరిసి..

భారత జట్టు గోల్‌కీపర్‌ సౌమ్యా నారాయణసామి చిరునామా కూడా పేదరికమే. తల్లిదండ్రులు సన్నకారు రైతులు. పంట పండితేనే కడుపు నిండా తిండి దొరికేది. చిన్నప్పుడు అమ్మానాన్నలతో కలిసి పొలం పనులకు వెళ్లేది. ఇంటి పక్కన వీధుల్లో, స్కూళ్లో అన్నిరకాల ఆటలాడేది. ఆమె చురుకుదనాన్ని ఒక మాజీ ఫుట్‌బాల్‌ ఆటగాడు పసిగట్టి శిష్యురాలిగా చేసుకున్నాడు. అప్పట్నుంచి తన ఆట మైదానానికి మారింది. పెద్దగా కష్టపడకుండానే రాష్ట్ర, జాతీయ జట్టులో స్థానం దక్కించుకుంది సౌమ్య. 2018లో అండర్‌-19 దేశ జట్టుకు ఎంపికై థాయ్‌లాండ్‌, పాకిస్థాన్‌తో మ్యాచ్‌ల్లో అద్భుతమైన ప్రతిభ చూపింది. మూడేళ్లలో సీనియర్‌ జట్టులో కీలక సభ్యురాలైంది.

- బి.హిదాయతుల్లాహ్‌, ఈనాడు, చెన్నై


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని