కష్టం తెలిపి.. కోట్ల అభిమానుల్ని పొందింది

ఓ సినిమాలో ఎన్ని మలుపులు ఉంటాయో... అంతకు మించిన వాటినే జీవితంలో చూసిందా అమ్మాయి. జీవితంపై ఆశ చిగురించిన మరు నిమిషమే సమాధి అవుతూ వచ్చింది. అలాంటి సమయంలో ఆమె చేసిన చిన్ని ప్రయత్నం తన జీవితాన్నే మార్చేసింది. అంతేనా..

Published : 04 Feb 2022 00:48 IST

ఓ సినిమాలో ఎన్ని మలుపులు ఉంటాయో... అంతకు మించిన వాటినే జీవితంలో చూసిందా అమ్మాయి. జీవితంపై ఆశ చిగురించిన మరు నిమిషమే సమాధి అవుతూ వచ్చింది. అలాంటి సమయంలో ఆమె చేసిన చిన్ని ప్రయత్నం తన జీవితాన్నే మార్చేసింది. అంతేనా.. లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తూ గిన్నిస్‌ రికార్డ్స్‌లో చోటునూ దక్కించుకుంది. ఆ అమ్మాయెవరో, తన   విశేషాలేంటో.. చదివేయండి.

ఒకప్పుడు పూట గడవడమే కష్టంగా ఉండేది లిజిచికి. ఈమెది చైనా. ఇప్పుడు ఆ దేశంలోనే అత్యధిక  సబ్‌స్క్రైబర్స్‌ ఉన్న యూట్యూబర్‌. ప్రభావవంతమైన యువతలో ఒకరు. చుట్టూ పర్వతాలు, కొండల మధ్యనున్న ఓ మారుమూల పల్లె ఈమెది. చిన్నతనంలోనే అమ్మానాన్న విడాకులు తీసుకున్నారు. నాన్న దగ్గర పెరుగుతున్నామెకు కొద్దికాలానికే ఆయన దూరమయ్యారు. దీంతో నాన్నమ్మ, తాతయ్యలు చేరదీశారు. తాత చుట్టుపక్క ప్రాంతాల్లో పేరున్న చెఫ్‌. ఆయన ప్రభావంతో చిన్నప్పటి నుంచే గరిటె పట్టింది. సంప్రదాయ విధానంలో వంటకాలు, చేనేతల్లో ప్రావీణ్యం సంపాదించింది.

ఆమెకి 14 ఏళ్ల వయసులో ఆయనా మరణించాడు. కుటుంబ పోషణ కోసం చదువు మానేసి.. కూలి పనులకు వెళ్లింది. తరువాత దగ్గరలోని పట్ణణం వెళ్లి... ఎలక్ట్రిక్‌, వెయిటర్‌ వంటి పనులు చేసింది. నాన్నమ్మకు ఆరోగ్యం క్షీణించడంతో తిరిగి సొంతూరికి వచ్చేసింది. వేరే దారిలేక ఇంట్లో ఉంటూనే పొలం పనులు చూసుకునేది. లిజిచి తన జీవితంపై ఎన్నో ప్రశ్నలు. తనకంటూ ఎవరో ఒకరు ఉన్నారన్న ధైర్యం పెంచుకున్న కొద్దిరోజులకే వాళ్లు దూరమవుతూ రావడం ఆమెకు ఆందోళన కలిగించేది. ఆ విషయాన్నే ఓరోజు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. మనసు కాస్త తేలికపడ్డట్టుగా అనిపించింది. తర్వాతి నుంచి తన రోజువారీ పొలం పనులను వీడియోగా పోస్ట్‌ చేసింది. చిన్న వయసులోనే ఎవరి సాయం లేకుండా సేంద్రియ వ్యవసాయం చేస్తోందంటూ ఆ వీడియో వైరలైంది. ఆ ప్రోత్సాహం ఆమెకు కొండంత బలాన్నిచ్చింది. తాత నేర్పిన కిటుకులతో సాగుపద్ధతులపై వీడియోలు రూపొందించేది. ఆపై సంప్రదాయ వంటకాల్నీ పరిచయం చేసింది. ఈమె చేనేత వస్త్రాల తయారీలోనూ దిట్టే. ధరించేదీ ఆ దుస్తులే. యంత్రాల సాయం లేకుండా... చేతులతోనే అందమైన డిజైన్లు రూపొందిస్తుంది. వెదురుతో అందమైన వస్తువులను తయారు చేయగలదు. సంప్రదాయ పద్ధతుల్లో చేస్తున్నా.. ఆధునికతకు ప్రాధాన్యమిస్తుంది. ఈ తరానికి నచ్చేలా తీర్చిదిద్దుతుంది. అందుకే యువత ఆమె వీడియోలంటే మరీ మరీ ఇష్టం.

ఆహారమైనా, ఇంట్లో వస్తువులైనా.. సేకరించడం దగ్గర్నుంచి పూర్తి చేయడం వరకూ అన్నింటినీ పొందుపరుస్తుంది. ఈ తీరు ఆమెకు ప్రపంచవ్యాప్త అభిమానులను సంపాదించిపెట్టింది. ఇంత చేస్తున్నా.. ఆమెకు వీడియోలు తీయడంపై పెద్దగా అవగాహన లేదు. అవసరమైతే చెట్లు కూడా ఎక్కేది. అలాంటివి తీసేప్పుడు ఇబ్బంది పడేది. ఆదరణ, ఆదాయం వస్తుండటంతో ముగ్గురితో ఓ బృందం ఏర్పాటు చేసుకుంది. ఆమె యూట్యూబ్‌ ఛానల్‌ను కోటి 66 లక్షల మందికిపైగా అనుసరిస్తున్నారు. చైనీస్‌ భాషలో ఇంత మంది సబ్‌స్క్రైబర్లున్న  తొలి యూట్యూబర్‌ తనే. అందుకే గిన్నిస్‌ వరల్డ్‌ బుక్‌ రికార్డులో చోటు దక్కింది. తన జీవిత ప్రయాణాన్నే చూపి యువతలో సానుకూల దృక్పథాన్ని నింపుతోంది. అందుకే, లిజిచి ఆ దేశంలో ప్రభావవంతమైన వారిలో ప్రముఖురాలైంది. ప్రతి కష్టాన్నీ సానుకూలంగా మలచుకుని ముందుకు సాగుతున్న ఆమె జీవితం మనకూ పాఠమే! కాదంటారా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని