Updated : 06/02/2022 05:28 IST

ఫ్యాషన్‌ ప్రపంచంలో.. రారాణులు

అందంగా, ఆధునికంగా కనిపించాలని కోరుకోని అమ్మాయెవరు? కానీ చాలామందికి ఈ ఫ్యాషన్‌ ప్రపంచం ఓ కొరకరాని కొయ్యే! వాటిపై పట్టు సాధించి, ఇతరులకూ ఆ పరిజ్ఞానాన్ని పంచుతున్నారు కొందరమ్మాయిలు. అంతేనా.. అనుసరించే వారి సంఖ్యను పెంచుకుంటూ దేశంలోనే పేరున్న ఇన్‌ఫ్లూయెన్సర్లుగానూ ఎదిగారు. వారిలో కొందరు వీరు..

దేశీవాటికే మొదటి ప్రాధాన్యం

మీనాక్షి పమ్నానిది హైదరాబాద్‌. తెలుగులో ప్రాచుర్యం పొందిన కొద్దిమంది ఇన్‌ఫ్లూయెన్సర్లలో ఈమె ఒకరు. కామర్స్‌లో డిగ్రీతోపాటు మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌నూ పూర్తిచేసింది. ఫ్యాషన్‌ రంగంపై ఆసక్తితో 2014లో బ్లాగును రూపొందించింది. ఆపై టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లకు మారింది. ద షిమ్మర్‌ గర్ల్‌ పేరిట తన పోస్టులను ఉంచుతోంది. సంప్రదాయ, పెళ్లి వస్త్రాలపై ముఖ్యంగా దేశీయ బ్రాండ్‌లకు ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. వీటితోపాటు ఎన్నో ఫ్యాషన్‌, బ్యూటీ, ట్రావెల్‌, లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌లతో కలిసి పనిచేస్తోంది. జులై పేరుతో సొంత లేబుల్‌నీ నిర్వహిస్తోంది. ఈమె ఖాతాను రెండు లక్షలకుపైగా  అనుసరిస్తున్నారు. ఈమె భర్త రవితేజ క్రికెటర్‌.

చిన్నచూపు చూసినా.. దీపా ఖోస్లాది చామన ఛాయ. ఓ ఫ్యాషన్‌ షోలో పాల్గొనడానికి వెళితే.. ఆమె రంగును విమర్శించి తన స్థానంలో వేరొకరిని ఎంపిక చేశారు. కసిగా ప్రయత్నించి వాళ్లే స్వయంగా ఆహ్వానించే స్థాయికి ఎదిగింది. ఇండీవైల్డ్‌ అనే సంస్థను ప్రారంభింది. చెన్నైలో స్థిరపడిన పంజాబీ. నెదర్లాండ్స్‌లో ఇంటర్నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌లో డిగ్రీ, లండన్‌లో మాస్టర్స్‌ చేసింది. తర్వాత ఓ ప్రముఖ సంస్థలో సోషల్‌ మీడియా మేనేజర్‌గా చేసింది. ఫ్యాషన్‌ రంగంపై అభిరుచితో ఇన్‌ఫ్లూయెన్సర్‌ అయ్యింది. మొదట వెబ్‌సైట్‌, ఆపై ఇన్‌స్టాలోనూ కొనసాగిస్తోంది. ఈమె ఖాతాకు 15 లక్షలకుపైగా ఫాలోవర్లున్నారు. డియోర్‌, మ్యాక్‌ కాస్మొటిక్స్‌, మెబ్లీన్‌ వంటి సంస్థలతో పనిచేసింది. లండన్‌ బిల్‌బోర్డ్స్‌తోపాటు లైఫ్‌సైట్‌, వోగ్‌ వంటి ప్రముఖ బ్యూటీ మేగజీన్ల కవర్లపైనా మెరిసింది. ‘ఛేంజ్‌ మేకర్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌’ వంటి అవార్డులందుకుంది. పోస్ట్‌ ఫర్‌ ఛేంజ్‌ అనే ఎన్‌జీఓను స్థాపించి, గ్రామీణ ప్రాంత అమ్మాయిలకు ఉచితంగా నెలసరి ఉత్పత్తులు అందిస్తోంది. లింగ సమానత్వం, మానసిక ఆరోగ్యం, మహిళా సాధికారత వంటివాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బ్రిటిష్‌ దౌత్యవేత్త, సహాధ్యాయి ఒలెగ్‌ బుల్లర్‌ని పెళ్లాడింది. మూడుసార్లు కేన్స్‌ రెడ్‌కార్పెట్‌పై నడిచిన దీప గత ఏడాది దానిద్వారా తల్లిపాల ప్రాముఖ్యంపై సందేశాన్నీ ఇచ్చింది. ఈమె టెడెక్స్‌ స్పీకర్‌ కూడా.

సోనమ్‌ కపూర్‌ మెచ్చింది.. ఫ్యాషన్‌.. ఉన్నతస్థాయి వాళ్లకేనా? అందరికీ ఎందుకు కాదంటుంది కోమల్‌ పాండే. ఈ ఆలోచనే ఈమెను ఫ్యాషన్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ని చేసింది. ఈమెది దిల్లీ. కామర్స్‌లో డిగ్రీ చేసింది. టీచరవ్వడం ఈమె చిన్ననాటి కల. అమ్మ చీర కట్టి తమ్ముడికి పాఠాలు చెప్పేది. తర్వాత దాన్నే భిన్నంగా కట్టడానికి ప్రయత్నిస్తూ ఫ్యాషన్‌ రంగంపై ఆసక్తిని పెంచుకుంది. ఫ్యాషనంటే ఖరీదైన దుస్తులు, ఉన్నత స్థాయి వాళ్లకేనన్న మాటలు వింటూ పెరిగింది. అది మార్చాలనుకుని ఓ బ్లాగును రూపొందించి సాధారణ డ్రెస్‌ను ఆధునికంగా మార్చి చూపెట్టేది. ఫేస్‌బుక్‌లోనూ ‘ఈరోజు లుక్‌’ అంటూ ఫొటోలుంచేది. ఇవి అమ్మాయిల్ని ఫిదా చేసేవి. కొద్దికాలంలోనే అనుసరించేవాళ్లూ పెరిగారు. దీన్ని గమనించి పాప్‌క్సో అనే సంస్థ ఆమెకు అవకాశమిచ్చింది. అలా పాపులారిటీ పెరిగింది. ఏడాదిన్నర తర్వాత బయటికొచ్చి సొంతంగా తన పేరిటే యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించింది. దానికి పదిలక్షలకు పైగా ఫాలోవర్లున్నారు. ఓసారి పండగలవేళ చుడీదార్‌ని ఆధునికంగా ఎలా ధరించొచ్చని పెట్టిన పోస్టును బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ ఆమె ఫొటోతో సహా పోస్టు చేయడమే కాక ప్రయత్నించింది కూడా. అలా గుర్తింపూ పెరిగింది. వివిధ సంస్థలకు అంబాసిడర్‌ ఈమె. తన ఇన్‌స్టా ఖాతాకు పదిహేను లక్షలకిపైగా ఫాలోవర్లున్నారు. ప్రభావిత ఇన్‌ఫ్లూయెన్సర్‌గా అవార్డులనూ అందుకుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని