Published : 10/02/2022 00:12 IST

30 దాటకుండానే మెరిశారు

‘గుర్తింపు దక్కాలంటే ఏళ్ల అనుభవం కావాలి’ .. ఈ మాట వీళ్లని చూస్తే అనలేమేమో! తమ అసమాన ప్రతిభతో దేశ, విదేశాల్లో గుర్తింపు తెచ్చుకోవడమే కాదు. ఫోర్బ్స్‌నూ మెప్పించారు మరి! ఈ ఏడాది దేశంలో 30 ఏళ్లలోపు ప్రతిభావంతుల జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో సాధారణ నేపథ్యాల అమ్మాయిలు వీళ్లు. అక్కడిదాకా ఎలా చేరారు? చదివేయండి.

మొదటి అడుగులోనే..: నిమిషా సజయన్‌

నటించిన తొలి చిత్రంతో గుర్తింపు అరుదేమీ కాదు. కానీ అంతర్జాతీయ అవార్డులూ దక్కించుకుంది. పైగా పాతికేళ్లు నిండని అమ్మాయంటే గొప్పేగా! సినిమా అంటేనే అందాల లోకం. దానిలో అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న నిమిషా ముసలి పాత్రలో కనిపించడానికీ అంగీకరించింది. అందం కంటే కథకీ, పాత్రకీ ప్రాధాన్యమిచ్చే ఈమె తీరే ఫోర్బ్స్‌ జాబితాలో నిలబెట్టింది. నిమిషాది మధ్యతరగతి కుటుంబం. అమ్మానాన్నలది కేరళ, ముంబయిలో స్థిరపడ్డారు. ఆమె ఇక్కడే పుట్టి పెరిగింది. మాస్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ తర్వాత మలయాళ సినిమా ‘తొండిముతాలమ్‌ ద్రిక్సక్షియుమ్‌’తో ఆరంగేట్రం చేసింది. దీనిలో తన నటనకు రాష్ట్ర స్థాయితోపాటు టోరంటో ఇంటర్నేషనల్‌ సౌత్‌ ఏషియన్‌ ఫిల్మ్‌ అవార్డునూ అందుకుంది. పెద్ద దర్శకులు, నటుల దృష్టిని ఆకర్షించి అవకాశాల్ని దక్కించుకుంది. ఈక్రమంలోనే ఎన్నో అవార్డులూ వరించాయి. ఛాలెంజింగ్‌ పాత్రలను ఇష్టపడతాననే ఈమె.. సామాజిక సమస్యలను ఎత్తి చూపే ఉత్తమ మార్గం సినిమానే అంటుంది.


చదువును డిజైన్‌ చేసుకుని: రియా మిర్చందానీ

ఒకరి చదువును ఫలానా డిగ్రీ, పీజీ ఇలా చెబుతాం. రియాది మాత్రమిలా చెప్పడం కష్టం. తనది ముంబయి. బ్రౌన్‌ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చేసింది. కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థినే అయినా బయాలజీ, లిటరరీ ఆర్ట్స్‌, ఫిలాసఫీ ఇలా ఎన్నో మైనర్‌ సబ్జెక్టులు చదివింది. ప్రొడక్ట్‌ డిజైన్‌, మానవ వలస వంటి అంశాలనూ అధ్యయనం చేసింది. మొదట్నుంచీ లిబరల్‌ స్టడీస్‌కే తన ఓటు. ఏది చదవాలన్న ఎంపిక విద్యార్థి చేతిలో ఉండాలంటుంది. ఆమె అధ్యయనాలకు తగ్గట్టే సంస్థలు స్కాలర్‌షిప్‌ ఇచ్చి మరీ చదువుకునే వీలు కల్పించాయి. పరిశ్రమేదైనా, సమస్యను భిన్న మానవ కోణాల్లో చూడాలంటుందీమె. మైక్రోసాఫ్ట్‌ సహా పలు అంతర్జాతీయ సంస్థల్లో ప్రొడక్ట్‌ మేనేజర్‌గా చేసింది. ప్రస్తుతం ‘వాట్సప్‌ పే’కి దేశంలో ప్రొడక్ట్‌ లీడ్‌గా పనిచేస్తున్న ఈమె తన ఆలోచన, వ్యూహాలతో ఏడాదిలోనే దాని వినియోగదారుల సంఖ్యను 13 రెట్లు పెంచింది. టస్సెల్‌ లోన్స్‌ అనే సంస్థకు సహ వ్యవస్థాపకురాలు కూడా. పలు విశ్వవిద్యాలయాల్లో ఇన్‌స్ట్రక్టర్‌, మెంటార్‌. స్టాండప్‌ కమెడియన్‌, టూర్‌ గైడ్‌.. ఇలా చెబుతూపోతే ఈమె ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇంతకీ తన వయసు 28 ఏళ్లే!


చెట్టు కొమ్మతో మొదలెట్టి..: వందనా కటారియా

గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌.. నాలుగు పాయింట్లతో క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది మన అమ్మాయిల హాకీ జట్టు. వాటిల్లో మూడు వందనా కటారియావే. దేశం నుంచి ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్‌ సాధించిన మొదటి అమ్మాయి కూడా. దీంతో 28 ఏళ్ల వందన పేరు మారుమోగింది. ఇది సాధించడానికి ఆమె దాటిన అవరోధాలెన్నో. ఈమెది ఉత్తరాఖండ్‌లో రోషన్‌బాద్‌ అనే చిన్న పల్లె. దళిత కుటుంబం. ఎనిమిదిమంది సంతానంలో తనొకరు. చిన్నప్పుడే ఆటల పట్ల ఆకర్షితురాలైంది. చుట్టుపక్కల వాళ్లు అమ్మాయిని గడప దాటనివ్వొద్దనేవారు. నాయనమ్మా అమ్మాయిలు ఇంటిపనికే అని బయట అడుగుపెట్టనిచ్చేది కాదు. ఈమె నాన్న మల్లయోధుడు. ఆట విలువ ఆయనకు తెలుసు గనక ఆమెకు తోడు నిలిచేవారు. కానీ హాకీ స్టిక్‌ కూడా కొనలేని పరిస్థితి. చెట్ల కొమ్మలతోనే సాధన చేసేది. స్కూల్‌ కోచ్‌ వందన ప్రతిభను గుర్తించి సాయమందించాడు. రెండేళ్లలోనే జూనియర్‌, మరో నాలుగేళ్లలో సీనియర్‌ జట్లలో చోటు దక్కించుకుంది. జూనియర్‌ వరల్డ్‌ కప్‌లో దేశం కాంస్య పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించింది. 2016 ఆసియన్‌ ఛాంపియన్‌షిప్‌లో జట్టుకు సారథ్యం వహించి, జట్టును గెలిపించింది కూడా. ఆటలో వేగంతోపాటు దూకుడుగా వ్యవహరించే వందన జూనియర్‌ స్థాయి నుంచే జట్టులో ముఖ్యమైన సభ్యురాలు. అందుకే ఒలింపిక్స్‌ క్వార్టర్స్‌లో ఓడినప్పుడు అగ్రకులాల వాళ్లు ఆమె ఇంటి ముందు సంబరాలు చేస్తే.. యావత్‌ దేశం ఆమె పక్షాన నిలిచి, మద్దతు తెలిపింది.


 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని