Updated : 12/02/2022 04:49 IST

ఆత్మరక్షణ కోసం చేరి... అంతర్జాతీయ స్థాయికి

సాధారణంగా క్రీడల్లో విజయాలు సాధించే వాళ్లు చిన్న వయసులో సాధన మొదలు పెడతారు. కానీ ఈ అమ్మాయి టీనేజీ దాటుతుండగా బాక్సింగ్‌లో చేరింది. అదీ ఆత్మరక్షణ విద్య నేర్చుకోవాలనుకుని. అలాంటి తను పట్టుదలకు కఠోర సాధనను తోడు చేసుకుని ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ‘ఐఎమ్మెమ్‌ఎఫ్‌-2021’ పోటీల్లో మన దేశం తరఫున పతకాన్ని అందుకున్న ఏకైక క్రీడాకారిణిగా నిలిచింది చెన్నైకి చెందిన 21 ఏళ్ల వృద్ధి కుమారి.

బుదాబీ పామ్స్‌ స్పోర్ట్స్‌ అరెనా వేదికగా ఇంటర్నేషనల్‌ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్‌ ఫెడరేషన్‌ (ఐఎమ్మెమ్‌ఎఫ్‌) వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌- 2021 పోటీలు జరిగాయి. 56 దేశాల నుంచి 400 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఆటమ్‌ వెయిట్‌ క్యాటగిరీ (సీనియర్స్‌)లో పోటీ హోరాహోరీగా జరిగింది. చివరివరకు ప్రత్యర్థిపై విజయాన్ని సాధించడానికి పోరాడింది వృద్ధి కుమారి. ఏదైనా చివరి వరకూ పోరాడాలి అని అమ్మ చిన్నప్పటి నుంచి చెబుతూ ఉండేది. ఆ మాట మాత్రమే తన చెవుల్లో మార్మోగుతూ ఉండేది. ఆ మాటల స్ఫూర్తికి తన బలమైన పంచ్‌, కిక్స్‌ తోడై రజత పతకాన్ని సాధించింది. మాతృదేశానికి గౌరవాన్ని తెచ్చిపెట్టింది.

అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ వేదికపై పోటీలోకి అడుగుపెట్టడం వృద్ధి కుమారికి తొలిసారి కావడంతో ఉత్సాహంగా ఉన్నా, కొంత ఆందోళన, ఒత్తిడికి గురైంది. తుదిపోటీల్లో తన ప్రత్యర్థులు ఖజకిస్తాన్‌, ఐర్లాండ్‌కు చెందిన వారు. వీరిద్దరూ ఈ రంగంలో ఎన్నో పతకాలను కైవసం చేసుకున్న వారు. వారితో పోరాటం వృద్ధికి సవాలే. అయినా భయం లేకుండా తలపడింది. ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రణాళిక, గురువు అందించిన శిక్షణతో తన సత్తా చాటిందీమె.

తృప్తిగా లేదు...

వృద్ధి లక్ష్యం స్వర్ణ పతకం. ‘ఈ సారి నా లక్ష్యం చేజారింది. చాలా అసంతృప్తిగా ఉంది. ఎప్పటికైనా దేశానికి స్వర్ణాన్ని సాధించి తీరతా. బాక్సింగ్‌ అంటే స్వీయరక్షణకు పనికొస్తుందని చేరాను. అలాగే ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనిపించింది కూడా. అందుకే ఈ క్రీడనెంచుకున్నా. అప్పుడు నాకు 19 ఏళ్లు. ఆ తర్వాత మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (ఎమ్మెమ్‌ఏ) గురించి తెలిసి దాన్నీ జత చేసుకున్నా. మా గురువు అజిత్‌ శిఖామణి శిక్షణ చాలా కఠినంగానే ఉంటుంది. అయినా ఈ క్రీడ నాకు చాలా నచ్చింది. ఈ రంగంలో ఏదైనా సాధించాలని నిర్ణయించుకున్నా. చేరిన రెండేళ్లలోపే బాక్సింగ్‌లో జాతీయ ఛాంపియన్‌గా రెండు సార్లు గెలిచా. అంతర్జాతీయ స్థాయిలో ఇదే మొదటిసారి. దీని కోసం ఏడాదిపాటు కష్టపడ్డా. మొదట రోజుకి గంటన్నర సాధన చేసేదాన్ని. ఆ తర్వాత మూడు గంటలకు పెంచుకున్నా. చివరకు అది ఆరేడు గంటలకు చేరింది. ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌పోటీలో పాల్గొనే అర్హత సాధించడం గర్వంగా అనిపించింది. రజత పతకాన్ని సాధించి, మన దేశం ఇలా సాధించిన ఏకైక క్రీడాకారిణిగా నిలవడం గర్వంగా ఉంది. ఈ పోటీలు నాకు చాలా అనుభవాలను నేర్పాయి. నా పంచ్‌ చాలా శక్తివంతంగా ఉందని ప్రత్యర్థులు చెప్పినప్పుడు చాలా సంతోషం కలిగింది. ఇవన్నీ నా ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. మరిన్ని విజయాలు సాధించి రేపటి తరానికి స్ఫూర్తిగా నిలవాలని ఉంది. వారికంటూ ఈ రంగంలో ఓ మార్గాన్ని ఏర్పరుస్తా. అమ్మ అందించే ప్రోత్సాహం నన్ను మరింత ముందడుగు వేయిస్తుంది’ అని చెబుతున్న వృద్ధి 2019లో స్టేట్‌ అమెచ్యూర్‌ బాక్సింగ్‌, 2020లో నేషనల్‌ మువా థాయ్‌, 2021లో ఎమ్మెమ్‌ఏ ఇండియా నేషనల్స్‌, 2021లో ఓపెన్‌ ఎమ్మెమ్‌ఏ నేషనల్స్‌లో స్వర్ణపతకాలను అందుకుంది. ’


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని