Updated : 13/02/2022 03:50 IST

శ్రీమతుల సందడి...

తెరపై అతను సెలబ్రిటీ.... ఇంట్లో అతను ఆమెకు అభిమాని. చూడచక్కని ఆ జంట ఇంటి ముచ్చట్లు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని అభిమానులకుండటం సహజమేగా! ‘ఇదిగో ఇలా ఉంటాయ్‌!’ అంటూ కన్నులపండగ చేస్తూ సెలబ్రిటీల భార్యలూ సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నారు. పనిలోపనిగా నైపుణ్యాలనూ ప్రదర్శిస్తూ అభిమానులని సంపాదించుకుంటున్నారు.  

నవ్వులతో కలిపి వండేస్తూ...
ప్రముఖ హాస్యనటుడు ఆలీ సతీమణి 48 ఏళ్ల జుబేదా కొన్ని నెలల క్రితం ప్రారంభించిన ‘జుబేదా ఆలీ’ యూట్యూబ్‌ ఛానెల్‌కు అతికొద్దికాలంలోనే 3,72,000 మంది సబ్‌స్క్రైబర్స్‌ వచ్చిచేరారు. హోమ్‌టూర్‌తో మొదలైన ఈమె వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. లక్షలమంది వీటిని వీక్షించడమే కాదు... ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఘుమ ఘుమలాడే సంప్రదాయ వంటలనెలా చేయాలో క్షణాల్లో చేసి చూపిస్తుంది జుబేదా. ఇంటిని సమన్వయం చేసుకోవడం.. కష్టమైన పనులని చిటికెలో చేసుకోవడం ఎలానో ఉత్సాహంగా చెప్పేస్తుంది. తాను చేసిన వంటలను షూటింగ్‌ స్పాట్‌లో భర్త, ఆయనతో పాటు పని చేసే వారికీ ఆప్యాయంగా వడ్డిస్తుంది. అనాథ శరణాలయాలకు వెళ్లి వారికి స్వయంగా ఆహారాన్ని సిద్ధంచేసి అందించే వీడియోలనూ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పెడుతోంది. తనకు తెలిసిన సంస్కృతీ, సంప్రదాయాలను ఆసక్తికరంగా వివరించడంతోపాటు భర్త ఆలీతో కలిసి విహారయాత్రలకు వెళ్తూ ఆయా ప్రాంతవిశేషాలనూ ఉత్సాహంగా అభిమానులకు చేరుస్తోంది.

పెంపకంలో మెలకువలు చెప్పేస్తూ...
కొవిడ్‌ సమయంలో అందరూ ఇల్లు దాటలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు... వాళ్లలో ఉత్సాహం నింపేందుకు మధుమిత సోషల్‌మీడియాలో పౌష్టికాహారంపై అవగాహన కలిగిస్తూ ‘శివమధు’ పేరుతో యూట్యూబ్‌ వీడియోలు చేసింది. ప్రముఖ నటుడు, బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ విజేత శివబాలాజీ భార్య ఈమె. ప్రసవానంతరం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... పిల్లల పెంపకం, పోషకాహార విలువలు, తోటపెంపకం, ఇంటి పరిశుభ్రత, ఫ్యాషన్‌ చిట్కాలు, కుటుంబంతో నిత్యం సంతోషంగా గడపడం వంటి అనేక అంశాలపై వీడియోలు చేస్తూ కోట్లాది వ్యూస్‌ని సొంతం చేసుకుంది మధుమిత. ఇక మనకు తెలియని పర్యాటకప్రాంతాల గురించే కాదు... అమ్మమ్మల కాలంనాటి సంప్రదాయ పిండివంటలనూ చిటికెలో చేసి చూపిస్తుంది. కొన్నిసార్లు భర్తతో కలిసి కూడా వీడియోలు చేస్తోంది. ఏడాదిన్నరలోనే 220 వీడియోలు చేసింది. తన ఛానల్‌కుదాదాపు 5 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు. ఇంతవరకూ 11 కోట్ల వీక్షణలు సొంతం చేసుకుందీ ఛానెల్‌.

డాక్టరు బాబు ఇంట్లో....
బుల్లితెరపై డాక్టరు బాబుగా మహిళలందరికీ అభిమాన నటుడు నిరుపమ్‌. ఇతడి భార్య మంజుల. ఇద్దరూ కలిసి ధారావాహికల్లో నటించారు కూడా. కొద్ది నెలల కిందట మంజుల ప్రారంభించిన యూట్యూబ్‌ ఛానెల్‌(మంజుల నిరుపమ్‌)కు దాదాపు 3.25 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు చేరారు. తెరపై కనిపించే తమ అభిమాన నటుడు ఇంట్లో ఎలా ఉంటాడనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. అటువంటి వారి కోసం మంజుల వీడియోలు చేయడం మొదలుపెట్టింది. భర్తతో కలిసి ఈమె చేస్తున్న వీడియోలకు అభిమానుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. వంటగది నుంచి షాపింగ్‌ వరకు, ఫ్యాషన్‌ నుంచి దుస్తుల ఎంపిక వరకు ఉత్సాహంగా వివరిస్తుంది. మహిళలు స్వయం ఉపాధిని పొందే మార్గాలనూ చూపిస్తోంది. అత్తగారితో కలిసి చేసే సంప్రదాయ వంటకాల నుంచి పోచంపల్లి చీరల ఎంపిక వరకు ఆమె చేసిన పలు వీడియోలకు అభిమానులు ఎక్కువే.

అలాగే నటుడు వరుణ్‌సందేశ్‌ భార్య.. నటి వితికా శేరు యూట్యూబ్‌ ఛానెల్‌కు కూడా లక్షల్లో సబ్‌స్క్రైబర్లున్నారు. మహిళల సమస్యలపై స్పందించే ఈమె గొంతు అందరికీ సుపరిచితమే. ఆరోగ్యసూత్రాలు, ఫ్యాషన్‌, వంటింటి చిట్కాలు, సంప్రదాయ వంటలు నేర్చుకునే సూత్రాలని చెప్పేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తను ర్యాప్‌ గాయని కూడా.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని