Updated : 13/02/2022 09:21 IST

పేదింటి విద్యార్థినికి...రూ.2.8 కోట్ల స్కాలర్‌షిప్‌

బాగా పేరున్న విద్యాసంస్థలో చదవాలన్నది ఆ అమ్మాయి కల. ఉన్నత చదువులకు పేదరికం ఎప్పుడూ అడ్డంకే. కానీ పేద రైతు కుటుంబానికి చెందిన మంగైజువాలి నిరుత్సాహ పడలేదు. తన కలను సాకారం చేసుకునే మార్గాల్ని అన్వేషించింది. ఇప్పుడు దాన్ని నిజం చేసుకోబోతోంది. అందుకోసం ఏకంగా రూ.2.8 కోట్ల ఉపకారవేతనాన్ని సాధించింది. స్విట్జర్లాండ్‌ అగ్రోటెక్‌ సంస్థ సింగెంటా గ్రూప్‌ ఏటా ప్రపంచవ్యాప్తంగా పేద రైతు కుటుంబాలకు చెందిన అయిదుగురు విద్యార్థినులకు ఉపకారవేతనం అందిస్తుంటుంది. ఈ ఏడాది మన దేశం నుంచి 18 ఏళ్ల మంగై మాత్రమే దీనికి ఎంపికైంది. దీంతో బంగ్లాదేశ్‌లోని ప్రఖ్యాత ‘ఆసియన్‌ యూనివర్శిటీ ఫర్‌ వుమెన్‌’లో చదువుకోవడానికి అర్హత సాధించింది. పాలిటిక్స్‌, ఫిలాసఫీ, ఎకనామిక్స్‌, పబ్లిక్‌ హెల్త్‌ విభాగాల్లో తను అండర్‌ గ్రాడ్యుయేషన్‌ చేయనుంది.  

మిజోరం రాష్ట్రం తింగ్‌శూల్‌కు చెందిన మంగైజువాలిది వ్యవసాయ కుటుంబం. కూతురి ఆసక్తిని గమనించిన అమ్మానాన్నలు ఇబ్బందులెన్నెదురైనా తనను బాగా చదివించాలనుకున్నారు. అది వారికి ఆర్థిక భారం కాకూడదనుకునేది మంగైజువాలి. దాని కోసం రకరకాల ప్రయత్నాలు చేసింది. ‘చివరికి నా కల నెరవేరింది. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో స్థానం, ఆర్థిక చేయూత అందుకోవడం గర్వంగా ఉంది. ‘సింగెంటా ఉపకారవేతనం’ గురించి తెలుసుకుని దరఖాస్తు చేసుకున్నా. ఎన్నోరకాల పరీక్షలు పెట్టారు. స్కూల్‌ స్థాయిలో మార్కుల్నీ పరిగణనలోకి తీసుకున్నారు. అయిదేళ్ల డిగ్రీ చేసేందుకు అందిన ఉపకార వేతనమిది. ఈ కోర్సును పూర్తిచేసి నాలాంటి మరెందరో విద్యార్థినులకు స్ఫూర్తిగా నిలుస్తా’ అని చెబుతున్న మంగైజువాలిని ఆ రాష్ట్ర ప్రముఖులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. మిజోరం గవర్నర్‌ డాక్టర్‌ కంభంపాటి హరిబాబు, ఆయన సతీమణి డాక్టర్‌ జయశ్రీ రాజ్‌భవన్‌కు పిలిపించి మరీ అభినందించారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని