Updated : 14/02/2022 09:59 IST

Valentines day: వీరి ప్రేమకు.. సాటేది

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా...

తేనెకంటే తియ్యనైనది, పండ్లకంటే మధురమైనది, వెన్నెలకంటే హాయైనది... ప్రేమ కాకుండా ఇంకేం ఉంటుంది. కానీ, ప్రేమ అందరికీ అంత సులభంగా దక్కదు. దాని కోసం పోరాటం చేయాలి, త్యాగాలకూ సిద్ధమవ్వాలి, కఠిన పరీక్షల్ని ఎదుర్కోవాలి. ఇక్కడున్న యువతులు అలాంటివాళ్లే. ప్రేమబంధం కోసం పేగు బంధాన్నీ వదులుకున్న రాకుమారి ఒకరైతే, ‘చూపులు కలవకపోయినా మనసులు కలిశాయి’ అంటుందో అమ్మాయి. వీర మరణం పొందిన ఓ సైనికుడి ‘జ్ఞాపకాల ప్రేమ’లోనే బతుకుతున్నది ఒకరైతే, ప్రేమ కోసం స్వదేశం వదిలి భారత్‌కు వచ్చేసింది మరో ప్రేమికురాలు. అవే ఈ వీర ప్రేమగాథలు!


  తెలిసీ.. నిరీక్షణ!

‘ఎప్పటికైనా మేం మళ్లీ కలుసుకుంటాం. ఆ సమయం వచ్చేంతవరకూ అతనికోసం నిరీక్షిస్తూ ఉంటా..’ యుద్ధంలో మరణించిన ఓ యోధుడిని తలచుకుంటూ అతని ప్రేయసి అన్న మాటలివి.

ఈ ప్రేమకథలో కథానాయకుడు.. కార్గిల్‌ యుద్ధంలో మరణించి, ప్రతిష్ఠాత్మక పరమ్‌వీర్‌చక్ర అవార్డుని అందుకున్న కెప్టెన్‌ విక్రమ్‌బాత్రా. అతని ప్రేమ జ్ఞాపకాలతో 22 ఏళ్లుగా జీవితాన్ని గడుపుతున్న ఆ ప్రేయసి డింపుల్‌ చీమా. వాళ్ల ప్రేమకథ పెళ్లివరకూ చేరకుండా అడ్డుకున్న శత్రువు భారత్‌-పాక్‌ యుద్ధం. అది వాళ్లని శాశ్వతంగా విడదీసినా డింపుల్‌ మాత్రం విక్రమ్‌ని భర్తగానే భావించి వేరే పెళ్లి చేసుకోకుండా తమ ప్రేమ గొప్పతనాన్ని చాటింది. 1995లో పంజాబ్‌ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఇంగ్లిష్‌ చదువుకుంటున్నప్పుడు వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలూ పెళ్లికి అంగీకరించారు. ఇంతలో విక్రమ్‌కి ఆర్మీలో చేరే అవకాశం వచ్చింది. ‘అప్పటికే మా నిశ్చితార్థమైంది. కార్గిల్‌ యుద్ధం మొదలవడంతో పెళ్లి వాయిదా పడింది. అతను నన్ను కలవడానికి వచ్చిన ప్రతిసారీ ‘మన పెళ్లెప్పుడు?’ అనడిగేదాన్ని ఓసారి ‘పెళ్లెప్పుడైనా కానీ... నువ్వు నా భార్యవే’ అంటూ తన రక్తాన్ని నాకు సింధూరంగా దిద్దాడు. అప్పుడు నేను.. ‘విక్రమ్‌.. నువ్వీ మధ్య సినిమాలెక్కువగా చూస్తున్నావా’ అంటూ ఆటపట్టించాను. ఆ రోజు మేం తనివితీరా నవ్వుకున్నాం. కానీ ఆ నవ్వులు మా నుంచి అంతే త్వరగా దూరమవుతాయని అనుకోలేదు. విక్రమ్‌ కార్గిల్‌ యుద్ధంలో మరణించాడు. అతని జ్ఞాపకాలు మాత్రం నాతో ఇంకా బతికే ఉన్నాయి’.. అంటోంది డింపుల్‌. చనిపోయేనాటికి విక్రమ్‌ వయసు 25. డింపుల్‌కి 22 ఏళ్లు. అప్పట్నుంచీ వాళ్ల ప్రేమ మొదలయిన చండీగఢ్‌లోనే ఉంటోంది. ‘తల్లిదండ్రులుగా మాకూ ఇది బాధాకరమైన విషయమే. ఎన్నాళ్లని ఒంటరిగా ఉంటావ్‌. పెళ్లిచేసుకోమన్నా ఆమె వినలేదు. ఏడాదికి రెండుసార్లు మమ్మల్ని తనింటికి ఆహ్వానిస్తుంది. మాతో ఉంటే.. విక్రమ్‌తో ఉన్నట్టే అంటుంది’ అంటాడు విక్రమ్‌ తండ్రి గిరిధర్‌లాల్‌. కార్గిల్‌ యుద్ధం ముగిసి 22 ఏళ్లవుతున్నా డింపుల్‌ తన గురించి ప్రపంచానికి తెలియాలనుకోలేదు. ఈమధ్య విక్రమ్‌ జీవితంపై షేర్‌షా అనే సినిమా తీయాలనుకున్నప్పుడు డింపుల్‌ గురించి తెలిసింది. ఆమె పాత్రని పోషించిన కియారా అడ్వాణి ఆమెతో మాట్లాడాకే ఆమె గొప్పతనం, ఓ గొప్ప ప్రేమకథ ప్రపంచానికి తెలిశాయి.


పాట కలిపింది ఇద్దరినీ...

సమీరా, రషీద్‌... ఇద్దరూ అంధులే. అయినా ఒకరి గుండెల్లో మరొకరు దివ్వెలుగా మారి తమ జీవితంలోకి కొత్త వెలుగు తెచ్చుకున్నారు.

సమీరా సొంతూరు కాజీపేట. డిగ్రీకి హైదరాబాద్‌ వచ్చింది. ఇంటర్‌ వరకూ మిషనరీ స్కూల్లో చదువుకుంది. డిగ్రీలో ఫీజు తానే కట్టుకోవాల్సి వచ్చింది. ‘అమ్మానాన్నలకు నేనొక్కదాన్నే. టెన్త్‌లో ఉన్నపుడు నెలల వ్యవధిలోనే వాళ్లు అనారోగ్యంతో చనిపోయారు. తాత, బాబాయివాళ్లు ఉన్నా వాళ్ల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దాంతో నా చదువు ఆర్థిక భారం నాపైనే పడింది. ఆ సమయంలోనే అంధ గాయకులకు పాటల ప్రోగ్రామ్‌లలో అవకాశాలిచ్చే ‘ఇట్రాడ్‌’ గురించి తెలిసి సంప్రదించా. అప్పటికే రషీద్‌ అందులో గాయకుడు. వాళ్లది నిజామాబాద్‌. ‘ఇట్రాడ్‌’ ప్రవేశ పరీక్షకు తనే మాకు జడ్జి. ‘మౌనంగానే ఎదగమని’ పాట పాడి బృందంలో చోటు సంపాదించా’ అని చెబుతుంది సమీరా. తర్వాత రషీద్‌ దగ్గర శిక్షణ తీసుకునేది. చదువుకోసం పాటలు పాడుతోందని తెలుసుకుని ఎంతో ఓపిగ్గా నేర్పించేవాడు. ఆ ప్రయాణంలోనే తనకు రషీద్‌పైన ఇష్టం ఏర్పడింది. కానీ ఆ మాట చెప్పే ధైర్యం చేయలేదు. డిగ్రీ తుది సంవత్సరంలో ‘నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా’ అని సమీరాతో చెప్పాడు రషీద్‌. ‘సంతోషమనిపించినా... అది జరిగే పని కాదు. మావాళ్లు సరేననాలి. వాళ్లు సరేనన్నా, మీవాళ్లు అంగీకరించరు’ అని బదులిచ్చింది. ‘మీవాళ్లని ఒప్పించేశా మావాళ్లని ఒప్పించే పనిలో ఉన్నా’ అన్నాడు రషీద్‌. ఆ మాటలతో అతడి మీద తనకున్న ప్రేమ మరింత పెరిగింది. ‘మావాళ్లు సులభంగానే అంగీకరించారట, కానీ వాళ్లింట్లోనే సమస్య. ఇద్దరికీ కళ్లు కనిపించవు. పిల్లలూ, సంసార బాధ్యతలూ భారమవుతాయన్నారు. చూపున్న అమ్మాయి భార్యగా వస్తే బాగుంటుందని వాళ్ల భావన. రషీద్‌కేమో నాకంటే బాగా వేరెవరూ తనని అర్థం చేసుకోలేరని నమ్మకం! ‘మేమూ బతికి చూపిస్తాం. అవకాశం ఇవ్వండి’ అని రషీద్‌ అంటే, మతం అడ్డంకిగా చూపారు. తన కోసం మతం మార్చుకోవడానికి సిద్ధమయ్యా. దాంతో వాళ్ల పెదనాన్న ముందుకొచ్చి అందరినీ ఒప్పించారు’ అంటూ తమ పెళ్లికి ఎదురైన కష్టాల్ని గుర్తుచేసుకుంటుంది సమీరా. 2020లో వీళ్లు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ‘కళ్లు ఉన్నవాడు భర్తగా వచ్చినా నన్ను రషీద్‌కంటే బాగా చూసుకోలేడు. మా మధ్య పోట్లాటలు ఉండవని చెప్పను కానీ మేం మాట్లాడుకోని రోజంటూ లేదు, ఉండదు’ అంటుంది సమీరా.


రాచరికాన్ని వీడి...

అమ్మాయిల అందమైన పెదాలపై విరిసే నవ్వుకు అబ్బాయిలు ప్రేమలో పడిపోతారు. అయితే ఓ అబ్బాయి చిరునవ్వుకు ఓ రాకుమారి తన హృదయాన్నే ఇచ్చేసింది. అతనితో తన జీవితాన్ని పంచుకోవడానికి రాచరికాన్ని వీడటానికీ వెనుకాడలేదు.

జపాన్‌ మాజీ యువరాణి మకో.. కోట్ల ఆస్తి, రాచరికపు స్థాయిని వదులుకొని,  సాధారణ పౌరుడు, తోటి విద్యార్థి కీ కొమురోను గత ఏడాది అక్టోబరులో వివాహం చేసుకుంది. వీళ్లిద్దరూ టోక్యో ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ యూనివర్శిటీలో సహాధ్యాయులు. కొమురో చిరునవ్వు చూసి, తొలిచూపులోనే ప్రేమలో పడిపోయానంటుంది మకో. ఆ తర్వాత అతడిలోని పట్టుదల, ఆత్మవిశ్వాసం ఆమెకు మరింత నచ్చాయి. మకో మనసునూ కొమురో అర్థం చేసుకున్నాడు. 2013 డిసెంబరులో మకోకు తన ప్రేమను తెలియజేశాడు. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. దొరికిన ఈ ఒక్క జీవితాన్ని మనసుకు నచ్చినవాడితో కలిసి బతకాలనుకుందామె. మకోతో జీవితాంతం కలిసి ఉంటానని మాటిచ్చాడు కొమురో. మూడేళ్లపాటు సాగిన వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసింది. మకో తల్లిదండ్రులు, బంధువులు వ్యతిరేకించారు. సాధారణ పౌరుడిని వివాహం చేసుకుంటే రాచరికాన్ని వదులుకోవాల్సి వస్తుందని చెప్పి చూశారు. ఆ దేశ ప్రజలూ సామాజిక మాధ్యమాల ద్వారా వీరి ప్రేమబంధాన్ని తక్కువ చేశారు. ఎన్ని సమస్యలెదురైనా తన నిర్ణయం మార్చుకోలేదు మకో. అన్నింటికీ సిద్ధపడిన ఆమె 2017లో  వివాహం చేసుకుందామని నిశ్చయించుకుంది. అప్పుడే నిశ్చితార్థమైనా.. పలుకారణాల వల్ల పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ఫాడమ్‌ యూనివర్శిటీ లా స్కూల్‌లో డిగ్రీ పూర్తి చేసిన కొమురో, ప్రస్తుతం న్యూయార్క్‌కు చెందిన ఓ లా ఫారంలో పనిచేస్తున్నాడు. అన్ని అడ్డంకుల్నీ దాటుకుని గత ఏడాది అక్టోబరులో ఒక్కటయ్యారు. ఎలాంటి ఆడంబరాలూ లేకుండా సాదాసీదాగా వివాహ వేడుక జరిగింది. వారసత్వం, కోట్ల రూపాయలు పోయినా.. మనసైన వాడు జతగా నిలిచాడన్న ఆనందం ఆమెది. అందుకే తమ ప్రేమ ముందు ఆస్తులు, ఆడంబరాలు విలువైనవేం కాదంటుంది. న్యూయార్క్‌లోని ఓ అద్దె ఇంట్లో తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభించిందీ ప్రేమజంట.


ఖండాంతరాలను దాటింది

మనవాళ్లు విదేశీయులను పెళ్లి చేసుకోవడం అక్కడే స్థిరపడటం ఇప్పడు సాధారణమే. కానీ ప్రేమించిన వ్యక్తి కోసం ఖండాలను దాటి మనదేశం  వచ్చేవాళ్లు అరుదు. ఆ కోవకే చెందుతుంది హన్నా శామ్యూల్‌.

హన్నా హార్మన్‌ది అమెరికా. వైజాగ్‌ అబ్బాయి అభిషేక్‌ శామ్యూల్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకుంది. వివాహమయ్యాక భర్త వెంటే భారత్‌కి వచ్చి ఇక్కడ స్థిరపడింది. సగటు తెలుగింటి కోడలు మాదిరిగానే చీర, చుడీదార్‌, ముక్కుపుడక, మెడలో నల్లపూసలు.. ధరిస్తుంది. తెలుగు భాష గలగలా మాట్లాడేయగలదు. రాయడం కూడా నేర్చుకుంటోంది. మన వంటల్నీ వండేస్తోంది. అంతేకాదు.. భారతీయ సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా ఆ విశేషాలతోపాటు తన కొత్త జీవితంలో మార్పుల్నీ అందరితో పంచుకుంటోంది.  ఆహారం నుంచి వేసుకునే దుస్తులు, సీరియళ్లు, సినిమాలు వంటి ఎన్నో విషయాలకు అందులో చోటిస్తోంది. ఆకట్టుకునేలా చేయడానికి హాస్యాన్నీ జోడిస్తోంది. తెలుగు బంధాల పేర్లు తెలుసుకోవడమే కాదు.. ఇతరులకీ అర్థమయ్యేలా సంబంధాలతో సహా విడమరిచి చెబుతోంది. ప్రేమ కోసం అయినవాళ్లనీ, స్నేహితుల్నీ, పుట్టి పెరిగిన దేశాన్ని వదిలొచ్చింది. భర్త ఇంటిపేరును జోడించుకుంది. ఇక్కడి బంధాలు, సంస్కృతులతో చక్కగా ఇమిడిపోయింది. తగ్గట్టుగానే అత్తింటివాళ్లు, భర్త ఆమెని ఆదరించి, ప్రోత్సహిస్తున్నారు. వాళ్లు తనతో ఎలా ప్రేమగా ఉంటున్నారో, వాళ్లతో తనెలా కలిసిపోయిందో తెలిపే వీడియోలనూ పంచుకుంటుంటుంది. అప్పుడప్పుడూ తన దేశ వంటకాల్నీ వాళ్లకి రుచి చూపిస్తోంది. తను పంచుకునే వీడియోల్లో భిన్న సంస్కృతుల వాళ్లు ఒకటైనప్పుడు ఎదురయ్యే సవాళ్లను తెలియజేయడమే కాదు.. ఆ బంధంలో మనస్ఫూర్తిగా ఇమడటానికి తాను చేస్తోన్న ప్రయత్నమూ ఆదర్శవంతమే.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని