ఈ యాత్రలు... మహిళలకు మాత్రమే!

పిల్లలే కాదు, మహిళలూ ఊరు దాటి వెళ్లాలంటే మగవాళ్ల తోడు ఉండాల్సిందే. ఇక విహారయాత్రలంటే కచ్చితంగా ఇంట్లోవాళ్లమీద ఆధార పడాల్సిందే. అలా కాకుండా ఆడవాళ్లే బృందంగా ఏర్పడి ఎలాంటి భయం, ఇబ్బంది లేకుండా హాయిగా పర్యటనలకు వెళ్లొచ్చే ఏర్పాటు ఉండాలనుకుంది కేరళకు చెందిన సజనా అలీ. ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే ‘అప్పూ పత్తాడి’!

Published : 15 Feb 2022 02:00 IST

పిల్లలే కాదు, మహిళలూ ఊరు దాటి వెళ్లాలంటే మగవాళ్ల తోడు ఉండాల్సిందే. ఇక విహారయాత్రలంటే కచ్చితంగా ఇంట్లోవాళ్లమీద ఆధార పడాల్సిందే. అలా కాకుండా ఆడవాళ్లే బృందంగా ఏర్పడి ఎలాంటి భయం, ఇబ్బంది లేకుండా హాయిగా పర్యటనలకు వెళ్లొచ్చే ఏర్పాటు ఉండాలనుకుంది కేరళకు చెందిన సజనా అలీ. ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే ‘అప్పూ పత్తాడి’!

సజన ఒకప్పుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఓసారి స్నేహితులంతా ఒడిశా పర్యటనకు ప్రణాళిక వేసుకున్నారు. ఎనిమిది మంది అందుకు అంగీకరించినా, ఆరోజు వచ్చేసరికి ఒక్కొక్కరూ విరమించుకున్నారు. చివరకు సజనా మాత్రమే వెళ్లొచ్చింది. మరోసారి కేరళలో ఒక ట్రెక్కింగ్‌ పర్యటనకు ప్లాన్‌ చేస్తే 20 మంది వస్తామన్నారు, ఎనిమిది మంది మాత్రమే చివరకు వచ్చారు. వచ్చిన వాళ్లంతా ఓ జీప్‌ తీసుకుని పర్యటనకు వెళ్లొచ్చారు. ఆరోజు వాళ్లకి ఎంతో సరదాగా గడిచిపోయింది. ఇదే విషయాన్ని రాలేని స్నేహితులతో చెబితే వాళ్లు నిరుత్సాహపడ్డారు. రాలేకపోవడానికి వాళ్లలో ఎక్కువ మంది చెప్పిన కారణం గ్రూప్‌లో అబ్బాయిలూ ఉండటంవల్ల ఇంట్లో ఒప్పుకోలేదని. అప్పుడే సజనాకి ఓ ఆలోచన వచ్చింది. కేవలం స్త్రీలు కలిసి వెళ్లే పర్యటనల్ని ఎందుకు ప్లాన్‌ చేయకూడదు అనుకుంది. దాంతో ఉద్యోగం మానేసి ‘అప్పూ పత్తాడి’ ట్రావెల్‌ సంస్థను ప్రారంభించింది. అప్పూ పత్తాడి అంటే మలయాళంలో దూదిపింజె పురుగు అని అర్థం. ఒంటిమీద సన్నని దారాల మాదిరిగా ఉండే ఆ పురుగు గాలిలో తేలుతూ వెళుతుంటుంది. పెద్దగా శ్రమించకుండా గాలి వీచే దిశలో హాయిగా వెళ్తుందీ పురుగు. ఇకపై మహిళలూ అలానే విహరించవచ్చన్న ఉద్దేశంతో సజనా 2016లో అదే పేరుతో ట్రావెల్‌ సంస్థను ప్రారంభించింది.  వెళ్లే చోట మహిళలకు ఇబ్బంది లేకుండా ముందే అన్ని ఏర్పాట్లూ చేస్తుంది సజన. ఈమె తండ్రి ట్రక్‌ డ్రైవర్‌ ఆయన వివిధ ప్రదేశాల్లో చూడదగ్గవి ఏం ఉన్నాయో, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో చెబుతుంటారు. ఆ సమాచారాన్నీ ఉపయోగించుకుంటుంది. మధ్య తరగతి మహిళలకు అందుబాటులో ఉండేలా ధరల్ని నిర్ణయిస్తుంది. అలాగని సౌకర్యాల్లో రాజీ పడదు. వివిధ హోటళ్లు, రెస్టరెంట్లతో ముందుగానే ఒప్పందం కుదుర్చుకోవడంవల్ల ఇది సాధ్యమవుతుంది.

కేరళలో మొదలైన అప్పూపత్తాడి... ప్రస్తుతం దేశవ్యాప్తంగా సేవలు అందిస్తోంది. ఇప్పటివరకూ అయిదువేల మందికి పైగా ఈ సంస్థ సాయంతో పర్యటించారు. కొత్త ప్రాంతం ఏదైనా సజన కూడా ఆ పర్యటనలో భాగమవుతుంది. ఎందుకంటే పర్యటనలంటే తనకూ ఇష్టమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్