ఆమెలా మరెవరూ కాకూడదనే లక్ష్యంతో...

అరుదైన చర్మ సమస్య ఆమె తల్లి ప్రాణాలను తీసింది. వీటన్నింటికీ కారణమవుతున్న చర్మ ఉత్పత్తుల గురించి ఆమె అధ్యయనం చేసింది.  రసాయన రహిత ఉత్పత్తులను తయారు చేయాలనుకుంది. ఆ ప్రయోగాలు విజయవంతమవడమే కాదు... తనను వ్యాపారవేత్తనూ చేశాయి.

Updated : 16 Feb 2022 02:53 IST

అరుదైన చర్మ సమస్య ఆమె తల్లి ప్రాణాలను తీసింది. వీటన్నింటికీ కారణమవుతున్న చర్మ ఉత్పత్తుల గురించి ఆమె అధ్యయనం చేసింది.  రసాయన రహిత ఉత్పత్తులను తయారు చేయాలనుకుంది. ఆ ప్రయోగాలు విజయవంతమవడమే కాదు... తనను వ్యాపారవేత్తనూ చేశాయి. 32 ఏళ్ల కృతికా కుమరన్‌ స్ఫూర్తి కథనమిది.  

కృతిక కోయంబత్తూరులో ఇంజినీరింగ్‌ చేసింది. చర్మ సంబంధ సమస్యతో వాళ్ల అమ్మ చాలా కాలం బాధపడటం చూసింది కృతిక. దానికోసం వాడిన స్టెరాయిడ్స్‌ ఆవిడ కిడ్నీలను దెబ్బ తీశాయి. చివరికి ఆవిడ చనిపోయారు. ఇదంతా తనను తీవ్ర వేదనకు గురిచేసింది. సబ్బులు, క్రీంల గురించి లోతుగా తెలుసుకోవాలనుకుంది. ఆన్‌లైన్‌లో నేచురల్‌ కాస్మొటాలజీ కోర్సు పూర్తి చేసింది. తన తల్లిలా మరెవరూ ఇలాంటి సమస్యల బారిన పడకూడదని సహజసిద్ధ చర్మ ఉత్పత్తులను తయారు చేయడానికి పూనుకుంది. ఎన్నో ప్రయోగాల అనంతరం ఉత్పత్తులకు మేక పాలను వినియోగించాలని నిర్ణయించుకుంది.

సహజసిద్ధంగా.. 2017లో తన వద్ద ఉన్న రూ.10 వేలనే పెట్టుబడిగా పెట్టి ‘విల్‌వా’ స్టార్టప్‌ను ప్రారంభించింది. ఉత్పత్తుల తయారీని వంటింటి నుంచి మొదలుపెట్టింది. ముందుగా కోల్డ్‌ ప్రెస్డ్‌ సోప్స్‌ తయారీని ప్రారంభించింది. ఆస్ట్రేలియాలో ఎంబీఏ చేసిన కుమరన్‌తో వివాహమైంది. ఆ తర్వాత భర్త ప్రోత్సాహం కృతికను ఉత్సాహంగా ముందడుగు వేసేలా చేసింది. కాశిపాలెయంలో యూనిట్‌ ప్రారంభించింది. మొదటి ఉత్పత్తి సక్సెస్‌ కావడానికి ఎన్నో ప్రయోగాలు చేశా అంటుంది కృతిక. ‘ఎట్టకేలకు విజయాన్ని సాధించా. పాలు, నూనెలు, వెన్న, ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ వంటి సహజసిద్ధమైనవే వాడా. సబ్బు తయారీతో మొదలైన నా ప్రయోగాలు చర్మ, శిరోజాలకు వినియోగించే పలురకాల ఉత్పత్తుల వరకు కొనసాగాయి. అంతేకాదు, దోమలకాటూ చర్మంపై ప్రభావం చూపుతుంది. అందుకే వీటి నుంచి చర్మసంరక్షణకూ ప్రత్యేక ఉత్పత్తులను రూపొందిస్తున్నా. వీటితోపాటు మస్కారాలు, లిప్‌స్టిక్స్‌, పరిమళద్రవ్యాలు కూడా తయారుచేస్తున్నాం. ఇవన్నీ పూర్తిగా రసాయన రహితమైనవి. మాకు కావాల్సిన మునగాకు నూనెను ఈరోడ్‌ నుంచి, లావెండర్‌ నూనెను కశ్మీరు నుంచి, అలాగే కేరళ నుంచి తులసి, నిమ్మగడ్డి, పుదీనా నూనెలను తెప్పిస్తాం, బీ వాక్స్‌ పంజాబ్‌ నుంచి వస్తుంది. అసలు వీటిని ఎక్కడెక్కడ నుంచి తెప్పించాలన్న విషయంలో చాలా శ్రమపడ్డాం. ఏయే ప్రాంతాల్లో నాణ్యమైనవి లభ్యమవుతాయో తెలుసుకోవడం పెద్ద ఛాలెంజ్‌. ఎంత చిన్న విషయంలోనైనా రాజీ పడదలచుకోలేదు. మొదట ఇన్‌స్టాలో మా ఉత్పత్తుల గురించి సమాచారం ఇచ్చా. అలా రెండేళ్లు పూర్తిగా సామాజిక మాధ్యమాలే వేదికగా నిలిచాయి. ఆ తర్వాత కోవైలో మా సొంత స్టోర్‌ను ఏర్పాటు చేశాం. ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా ఆర్డర్లు ఎక్కువగా వస్తాయి. ‘విల్‌వా’ పూర్తిగా వీగన్‌ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. నెలకు 8 వేలకు పైగా ఆర్డర్లు వస్తుంటాయి. ఒక బాస్కెట్‌ సుమారు రూ.1500 ఉంటుంది. సగటున ప్రతి నెల కోటి రూపాయలకు పైగా వ్యాపారం జరిగే స్థాయికి మా బ్రాండ్‌ ఎదిగింది. ఏటా రూ.15 కోట్లు టర్నోవర్‌ సాధిస్తున్నాం.  ప్రస్తుతం కొన్ని రకాల చర్మతత్వాలకు సరిపడే ఉత్పత్తులను అందిస్తున్నాం. త్వరలో అన్ని రకాల చర్మాలకు సరిపోయేలా తయారీ చేపడుతున్నాం. మా అమ్మలా మరెవరూ రసాయనాలున్న ఉత్పత్తులను వాడి వ్యాధుల బారిన పడకూడదన్నది నా లక్ష్యం’ అంటోన్న కృతిక మన సంప్రదాయ వరి వంగడాలకు ప్రాచుర్యం కల్పిస్తోంది. తనే 40 ఎకరాల్లో సంప్రదాయ వంగడాలను పండించి విక్రయిస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి స్థానిక వరి ధాన్యాన్ని సేకరించి వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది. అనుకోకుండా వ్యాపారవేత్తగా మారిపోయిన ఈ అమ్మాయి ఇప్పుడు వంద మందికి పైగా సిబ్బందికి, మరెందరో రైతులకూ ఉపాధి కల్పిస్తోంది. పలు పురస్కారాలనూ అందుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్