Updated : 19/02/2022 06:18 IST

ఆ సత్తా మాకుంది!

అమ్మాయిలంటే నాజూకు, సుకుమారం అనుకుంటారు చాలా మంది. కానీ వీళ్లు మాత్రం ఎంతో శ్రమతో కూడిన వెయిట్‌ లిఫ్టింగ్‌లో సత్తా చాటుతున్నారు! అదీ కష్టాలు, పేదరికంతో పోరాడుతూ...


తల్లి అయ్యాకే ‘ఛాంపియన్‌’!

పెళ్లి... పిల్లలు. ఇంతేనా జీవితం అనుకుందామె. ‘కాదు.. ఏదైనా సాధించాలి’ అని క్రీడల్లోకి అడుగు పెట్టింది. దానికోసం మళ్లీ కాలేజీలో చేరింది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పతకాల బాటలో సాగుతోంది 24 ఏళ్ల రాజనాల పూర్ణ.

ఇంటర్‌లోనే పెళ్లయింది పూర్ణకు. వెంట వెంటనే ఇద్దరు పిల్లలు. కొన్నాళ్లు బాగానే సాగింది. కానీ ఏదో వెలితి... జీవితం అక్కడితో ఆగిపోకూడదు అనుకుంది. తనకిష్టమైన క్రీడలో అడుగుపెట్టింది. అంతర్జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో బంగారు పతకం సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచింది.
విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన ఈశ్వరయ్య, సరస దంపతుల ముగ్గురు ఆడపిల్లల్లో రెండో సంతానం పూర్ణ. ఈమె తండ్రికి క్రీడలంటే ఆసక్తి. చిన్నప్పుడు ఆయనతోపాటు గ్రౌండ్‌కీ, జిమ్‌కూ వెళ్తుండేది. తనకూ క్రీడల్లోకి అడుగుపెట్టాలనే ఉండేది. కానీ ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. జీవితంలో ఏమీ సాధించలేకపోతున్నానన్న ఆవేదన మొదలయింది. ఆ విషయాన్నే భర్త శ్రీకాంత్‌, తల్లిదండ్రులతో పంచుకుంది. క్రీడారంగంలోకి వెళ్తానంటే వాళ్లు ప్రోత్సహించారు. పిల్లల బాధ్యత తీసుకుంటామన్నారు. తండ్రి సూచనతో పవర్‌ లిఫ్టింగ్‌లో సాధన చేయాలనుకుంది. బాబాయి  జి.నీల జిమ్‌ నిర్వహిస్తారు. ఆయన ఆధ్వర్యంలో శిక్షణ ప్రారంభించి కొద్దికాలంలోనే పట్టు సాధించింది.
యూనివర్సిటీ స్థాయి పోటీల్లో పాల్గొనాలంటే చదువుండాలి. అందుకే కష్టమైనా చదువుకోవాలనుకుంది. క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తారని తెలిసి కడప జిల్లా, కమలాపురంలోని ‘సీఎస్‌ఎస్‌ఆర్‌- ఎస్‌ఆర్‌ఆర్‌ఎం’ విద్యాసంస్థల్లో చేరింది. ఆ సంస్థ కరస్పాండెంట్‌ రాజగోపాల్‌రెడ్డి.. ఆమె పర్యటనల ఖర్చుల్ని అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు.
బీఏ రెండో ఏడాది చదువుతోన్న పూర్ణ గత మూడేళ్లలో జాతీయస్థాయిలో జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో మూడు స్వర్ణాలూ, రెండు కాంస్యాలూ దక్కించుకుంది. 2021 డిసెంబరులో టర్కీలో జరిగిన ఆసియా స్థాయి పోటీల్లో 52కిలోల జూనియర్‌ విభాగంలో పాల్గొని నాలుగు స్వర్ణాలు సాధించింది. చికెన్‌ సెంటర్‌ నడుపుతున్న అమ్మానాన్నలు, భర్త సహకారంతో క్రీడల్లో పాల్గొంటున్న ఈమె... కామన్వెల్త్‌ పోటీల్లో పతకం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. సాధిస్తానని కొండంత ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.
- గడ్డం వసంత నాయుడు, ఈనాడు డిజిటల్‌, కడప


సాదియా... సాధించింది!

స్నేహితులంతా సరదా కోసం ఆటలాడితే ఆమె మాత్రం ఐపీఎస్‌ సాధించాలన్న లక్ష్యంతో క్రీడల్లోకి అడుగుపెట్టింది. అదీ ఎంతో కష్టమైన విభాగంలో రాణిస్తోంది షేక్‌ సాదియా!

పవర్‌ లిఫ్టింగ్‌లో తండ్రి సాధించిన విజయాలే స్ఫూర్తి అనే షేక్‌ సాదియా అల్మాస్‌... కఠోర సాధనతో అంతర్జాతీయ వేదికల మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సాదియా తండ్రి సంథానీ... పవర్‌ లిఫ్టింగ్‌లో జాతీయ ఛాంపియన్‌. ప్రస్తుతం మంగళగిరిలో ఓ జిమ్‌ నిర్వహిస్తున్నారు. తండ్రి పర్యవేక్షణలో 2017లో పదో తరగతిలో ఉన్నపుడు సాధన ప్రారంభించిన ఈమె... ఆ ఏడాదే సబ్‌ జూనియర్‌ విభాగంలో రాష్ట్రస్థాయి పోటీల్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. 2018లో రాజస్థాన్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌ సబ్‌ జూనియర్‌ విభాగంలో స్వర్ణం గెలిచింది. తర్వాత జూనియర్‌ విభాగంలో అడుగుపెట్టి అనేక జాతీయస్థాయి అవార్డులు గెలిచింది. గతేడాది డిసెంబరులో ఇస్తాంబుల్‌ (టర్కీ)లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో 57 కేజీల విభాగంలో స్వర్ణం సాధించిందీ యువ తేజం. పవర్‌ లిఫ్టింగ్‌లో స్క్వాట్‌, బెంచ్‌ ప్రెస్‌, డెడ్‌లిఫ్ట్‌ విభాగాలు ఉంటాయి. మూడింటిలో విడివిడిగా, మొత్తంగా విజేతను ప్రకటిస్తారు. తను రెండింటిలో స్వర్ణాలు గెలిచి ఓవరాల్‌ ఛాంపియన్‌ అయింది.  

రోజూ 5-6 గంటలు తండ్రి పర్యవేక్షణలో సాధన చేసే సాదియా ప్రస్తుతం కె.ఎల్‌.యూనివర్సిటీలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈమె లక్ష్యం ఐపీఎస్‌. అందుకు దేహదారుఢ్యం అవసరమని ఈ ప్రాక్టీసు మొదలుపెట్టానంటుంది. సాదియా సోదరి ఇబ్రహీంపట్నం నిమ్రా కాలేజీలో ఎంబీబీఎస్‌ చదువుతోంది. సాదియా ఆహార అవసరాలకూ, టోర్నీలకు వెళ్లేందుకు నెలకు రూ.25వేలు వరకూ ఖర్చవుతుంది. సంథానీ ఆదాయం కుటుంబ పోషణకే సరిపోవడంతో దాతల సాయం తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. హైదరాబాద్‌, మంగళగిరి రోటరీ క్లబ్‌లు ప్రధానంగా ఆర్థిక చేయూతనిస్తున్నాయి. లక్ష్యం ఉన్నా, ఆర్థిక కారణాలతో ఇటువైపు అమ్మాయిలు రాలేకపోతున్నారనీ, వారికోసం ప్రభుత్వ అకాడమీ ఉండాలనీ చెబుతుంది సాదియా. ‘క్రమ శిక్షణ, సాధించాలనే పట్టుదల ఉంటే... ఏదైనా సాధ్యమే’ అని చెప్పే ఈమె... కామన్వెల్త్‌, ప్రపంచ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

- జానకి జయప్రకాష్‌ నారాయణ, ఈటీవీ విజయవాడ


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాం, ఆహ్వానంసిగ్నల్‌ల ద్వారా పంపవచ్చు. ఈ నంబరు కంప్యూటర్‌తో అనుసంధానమై ఉంటుంది. అందువల్ల ఇది సందేశాలకు మాత్రమేనని గమనించగలరు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని