Published : 20/02/2022 00:43 IST

తిండి ఖర్చు రూ.91 వేలు!

ఏ ఏడాదికో అని పొరబాటు పడేరు! నెలవారీ ఖర్చది. పైగా అమ్మాయిలంటే.. డైటింగ్‌, కెలొరీలు లెక్కపెట్టుకొని మరీ తింటారు కదా! కానీ ఈమె దానికి విరుద్ధం. పూర్తిగా జంక్‌ఫుడ్‌నే ఇష్టంగా లాగించేస్తోంది. ఎంత తిన్నా లావవదు. అలాగని ఏ కసరత్తులూ చేయదు. ఇంతకీ తన పేరు చెప్పనేలేదు కదూ! సబ్రినా కొరిన్‌మూరే. వృత్తి... బ్యూటీషియన్‌. ఉండేది అమెరికా. మాంచీ ఫుడీ. ఇది తనకు నాన్న నుంచే వచ్చిందని చెబుతుంది. ఉదయం కాఫీ దగ్గర్నుంచి రాత్రి భోజనం వరకూ అన్నీ బయటే. చాక్లెట్‌ బార్‌లు, పిజ్జా, రాప్‌, బ్రౌనీ, చైనీస్‌ వంటకాలు.. వీటినే ఎక్కువగా తింటుంది. రోజుకు కనీసం 3000 - 5000 కెలొరీల వరకూ తీసుకుంటుంది. కొత్త రుచుల్ని ఆస్వాదించడమంటే ఇష్టం. దీనికోసం ఎంత దూరమైనా ప్రయాణిస్తుంది. ‘మొదట్నుంచీ ఆహార ప్రియురాలినే. టిక్‌టాక్‌ గురించి తెలిసి నేనూ ప్రయత్నించా. కానీ పెద్దగా ఆకట్టుకోలేక పోయా. ఇలాగే నచ్చిన ఆహారాన్ని తింటూ, దాన్ని గురించి వివరిస్తూ వీడియో పోస్ట్‌ చేశా. అది చాలామందికి నచ్చింది. నేను నాలా ఉన్నప్పుడే అందరికీ నచ్చుతానని అర్థమైంది. అప్పట్నుంచీ తిండి వీడియోలనే పోస్ట్‌ చేస్తున్నా’ అంటోంది సబ్రినా. ఈమెను టిక్‌టాక్‌లో 3.5 లక్షలకుపైగా, ఇన్‌స్టాలో 1.60 లక్షల మంది అనుసరిస్తున్నారు. తిండిపై అపోహలను తొలగించడంతోపాటు.. దేన్నైనా ఆస్వాదించేలా చేయడం తన ఉద్దేశమట. చాలా మంది ఎంత తిన్నా లావవని తనని చూసి ఈర్ష్య పడుతున్నామని మెసేజ్‌లూ పెడుతుంటారు. ఎంతోమంది రకరకాల డైట్‌లు, కఠినమైన కసరత్తులూ చేసినా బరువు తగ్గలేకపోతోంటే.. నచ్చినవన్నీ లాగించేస్తూ కూడా సన్నజాజి తీగలానే ఉంటోంటే ఈర్ష్య పడరా మరి!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని