Published : 24/02/2022 00:59 IST

వ్యాపారం కోసం నటన మానేసింది!

ఆష్కా గోరడియా హిందీ ధారావాహికలు చూసే వారికి చిర పరిచితురాలే. అక్కడ ‘బిగ్‌బాస్‌’ షోలోనూ పాల్గొంది. కొన్ని టీవీ షోలకు వ్యాఖ్యాత కూడా. దాదాపు రెండు దశాబ్దాలు ఆ రంగంలో రాణించిన ఆమెకు వ్యాపారంలోకి ప్రవేశించాలనే కోరిక పుట్టింది. అందులోనూ రసాయనాలు వాడని సౌందర్య సాధనాలు తేవాలనుకుంది. ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టి విజయవంతంగా దూసుకెళ్తోంది. ఇదంతా ఎందుకో, ఎలా చేస్తోందో చూడండి...

నని తెరమీద చూసుకోవాలనే కోరిక ఆష్కాకు చిన్నప్పట్నుంచీ బలంగా ఉండేది.  అందుకే పదహారేళ్లకే గుజరాత్‌ నుంచి ముంబయి చేరుకుంది. బుల్లితెర నటిగా కెరీర్‌ ప్రారంభించింది. ‘నాగిన్‌’ లాంటి ప్రఖ్యాత హిందీ ధారావాహికల్లో తన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. మోడల్‌గానూ రాణించింది. దేశ వాణిజ్య రాజధానిలో ఉండటంవల్ల తనకూ వ్యాపారంలో అడుగుపెట్టాలన్న ఆశయం ఏర్పడిందంటుంది ఆష్కా. వృత్తిరీత్యా తను రోజూ కాస్మెటిక్స్‌ ఎక్కువ మోతాదులో వినియోగించాల్సిందే. కానీ.... అవి చర్మంపైన దుష్ప్రభావం చూపడాన్ని గమనించింది. అందుకే... రసాయనాలు వినియోగించని ఉత్పత్తులు తేవాలనుకుంది. చాలా ఏళ్ల అధ్యయనం తర్వాత ఈ రంగంలో అనుభవం ఉన్న ప్రియాంక్‌ షా, అషుతోష్‌ వాలానీ సహ వ్యవస్థాపకులుగా 2018లో ‘రినీ కాస్మెటిక్స్‌’ పేరుతో సౌందర్య సాధనాల తయారీ రంగంలో అడుగుపెట్టింది. రసాయనాలూ, జంతు సంబంధ పదార్థాలూ వినియోగించని ఉత్పత్తుల్ని తెస్తోంది. సరికొత్తగా కనిపించడం కోసం మేకప్‌లో ప్రయోగాలు చేయాలనుకునే వారికి తగ్గట్టుగా తన కాస్మెటిక్స్‌ ఉండాలనేది ఆమె ఆలోచన. దాంతో గుజరాత్‌లో 50 లక్షల పెట్టుబడితో, 50 మంది ఉద్యోగులతో తయారీ యూనిట్‌ని ప్రారంభించింది. ప్రారంభంలో ఫ్యాబ్‌ 5 ఇన్‌ 1 లిప్‌స్టిక్‌, బోల్డ్‌ 3డీ ఐల్యాషెస్‌లతో పాటు మరికొన్ని పరిమిత కాస్మెటిక్స్‌ను తయారు చేసి... ఈ-కామర్స్‌ సైట్లలో అమ్మకాలు మొదలుపెట్టింది. కొద్దికాలంలోనే ఆ ఉత్పత్తులకు మంచి గుర్తింపు వచ్చింది. దాంతో తన సౌందర్య ఉత్పత్తుల పరిధి విస్తరించి చెక్‌మ్యాట్‌ లిప్‌స్టిక్‌, మేకప్‌ రిమూవింగ్‌ బామ్‌, స్ట్రాబ్‌ క్వీన్‌ హైలైటర్స్‌, బ్రష్‌ సెట్‌లను అందిస్తోంది. సురక్షితమైనవీ, పర్యావరణహితమైనవీ కావడంతో ఈ ఉత్పత్తులకు గిరాకీ ఏర్పడింది.

మధ్య తరగతి లక్ష్యంగా... సాధారణంగా బ్రాండ్‌ అనగానే ధర ఎక్కువగా ఉంటుంది. ఆష్కా మాత్రం మధ్య తరగతిని లక్ష్యంగా పెట్టుకుని తన ఉత్పత్తులు రూ.500కే లభించేలా ధర నిర్ణయించింది. దాంతో నగరాలతోపాటు పట్టణాల్లోనూ వీరికి మార్కెట్‌ ఏర్పడింది. ‘మేకప్‌ మనల్ని మరింత అందంగా చూపాలి. అదే సమయంలో చర్మానికి హాని కలిగించకూడదు. మా ఉత్పత్తులతో మహిళలు మేకప్‌లోనూ సహజంగా ఉండేలా చేస్తున్నాం. 18-35 ఏళ్ల వారిని లక్ష్యంగా పెట్టుకున్నాం. డిజిటల్‌ ప్రపంచంలో ఎక్కువగా ఉండే ఈ వయసు మహిళలు... తమను తాము ఎప్పటికప్పుడు కొత్తగా చూసుకోవాలనుకుంటారు. వినియోగదారుల నమ్మకమే విజయానికి తొలిమెట్టుగా భావించి పనిచేస్తున్నాం’ అంటోంది ఆష్కా. అందరు వ్యాపారుల మాదిరిగానే కొవిడ్‌ సమయంలో వీరూ కష్టాలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ముడిసరకు కోసం ఇబ్బంది పడాల్సి వచ్చింది. అదే సమయంలో ఉత్పత్తులకి డిమాండ్‌ కూడా పెరిగింది. దాంతో స్థానికంగా దొరికే ముడి పదార్థాల్ని ఎక్కువగా ఉపయోగించేలా వీరి పరిశోధనాభివృద్ధి విభాగం పని చేసింది. గత మూడు నెలల్లోనే తమ ఉత్పత్తుల్ని 75వేల మంది కొన్నారనీ, రూ.100 కోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామనీ చెబుతుందీమె.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని