Published : 26/02/2022 01:29 IST

పరిశ్రమలతో కాలుష్యం ఉండదిక!

ప్రతి ఒక్కరికీ నచ్చని సబ్జెక్టులుంటాయి. వాటిని త్వరగా చదవడానికీ ఇష్టపడం. ఆమెకీ అంతే! అయితే ఆమె అలా వదిలేయలేదు. పట్టుబట్టి చదివి.. దానిలోనే గొప్ప ప్రయోగాలు చేశారు. అంతేనా! కేంద్ర ప్రభుత్వం చేతే ‘శెభాష్‌’ అనిపించుకున్నారు. ఆ విశేషాలేంటో చదివేయండి.

డాక్టర్‌ ఇ.పూంగుళలిది.. తమిళనాడులో ఇలంతోపు అనే చిన్నగ్రామం. వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటి నుంచి అమ్మానాన్నలకు పొలం పనుల్లో సాయమూ చేసే వారు. గణితంపై ఇష్టంతో బీఎస్‌సీ మేథ్స్‌ ఎంచుకున్నారు. సమస్యల్లా రసాయన శాస్త్రంతోనే! పరమాణువులు, మూలకాలు, సమ్మేళనాలు.. కొరుకుడు పడేవి కాదు. కానీ తప్పదు కదా! అందుకే ఎక్కువ సమయం దీనికే కేటాయించే వారు. క్రమంగా ఇష్టం ఏర్పడి, రసాయన శాస్త్రంలోనే పీజీ, ఎంఫిల్‌ చేశారు.  పరిశ్రమల నుంచి వెలువడే విష వాయువులు పంటలు, పర్యావరణంపై దుష్ప్రభావాలు చూపడం చిన్నప్పట్నుంచే ఆమెకు ఆందోళన కలిగించేది. పెద్దయ్యాక ఈ సమస్య పరిష్కారం కోసం ఏదైనా చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. పుదుచ్చేరి విశ్వ విద్యాలయం నుంచి పీహెచ్‌డీ చేసేప్పుడు పర్యావరణహిత ప్రయోగాలు మొదలు పెట్టారు. విష వాయువులు వెలువడని ప్రత్యామ్నాయాలపై పనిచేస్తూ పరిశోధనశాలల్లోనే గంటల కొద్దీ గడిపేవారు. పర్యావరణానికి హాని కలగని మిశ్రమాల్ని కనిపెట్టాలనేది ఆమె లక్ష్యం. ఆ పనిలో ఉండగా నాన్న చనిపోయారన్న వార్తతో కుంగిపోయారు. అయినా అన్న ప్రోత్సాహంతో తన లక్ష్యం వైపు దృష్టి సారించారు. సీఎస్‌ఐఆర్‌ ఫెలోషిప్‌ పొంది, ఎన్నో పరిశోధనలూ చేశారు.

శాస్త్రవేత్తయ్యాక పరిశ్రమల్లో, మందుల తయారీలో వాడే రసాయనాలతో ఏర్పడే పర్యావరణ కాలుష్యం, దానికి పరిష్కారం సూచిస్తూ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి ప్రతిపాదనపెట్టారు. అది వారికి నచ్చి విమెన్‌ సైంటిస్ట్‌ స్కీమ్‌ (డబ్ల్యూఓఎస్‌) కింద నిధులు కేటాయించారు. పూంగుళలి తన ప్రాజెక్టుకోసం ఐఐటీ మద్రాస్‌ను ఎంచుకొని, అక్కడి రసాయన శాస్త్ర ప్రొఫెసర్‌ జి.శేఖర్‌ సహకారం తీసుకున్నారు. 2-ఎసిల్‌ బెంజో(బి) థియోపెన్‌ అనే సమ్మేళనాన్ని ఉపయోగించి పర్యావరణ హితమైన కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. బెంజో(బి) థియోపెన్‌గా కూడా పిలిచే దీంతో పర్యావరణ హాని లేకుండా పరిశ్రమలు పనిచేయొచ్చనీ నిరూపించారు. ఈ హరిత రసాయన సాంకేతికతకు తాజాగా పేటెంట్‌ హక్కులూ దక్కించుకున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి అభినందనలూ దక్కాయి. ‘చాలారకాల సంశ్లేషణ పద్ధతులు అందుబాటులో ఉన్నా అవన్నీ పర్యావరణానికి ఎంతో కొంత హాని చేసేవే. కొన్ని పద్ధతుల్లో అత్యధిక వేడినీ వినియోగిస్తున్నారు. దీంతో దుర్వాసనతో కూడిన వాయువులు వెలువడటం, పేలుడు ప్రమాదాలు లాంటివి జరుగుతున్నాయి. వీటన్నింటికీ నా విధానంతో అడ్డుకట్ట వెయ్యచ్చు. తక్కువ ఖర్చు, సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ఈ విధానాన్ని అనుసరించి అద్భుత ఫలితాలు తేవొచ్చు’ అంటారు పూంగుళలి. ఇందుకుగానూ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ నుంచి ఫాస్ట్‌ట్రాక్‌ యంగ్‌ సైంటిస్ట్‌గా గుర్తింపు పొందారు. క్లిష్ట రంగాల్లో రాణించే సత్తా మహిళల్లో ఉందంటారీమె. కుటుంబ సహకారమూ ఉంటే విజయం మరింత త్వరగా సాధించవచ్చు అంటారు. తనకు అమ్మ, అన్న అండగా ఉన్నారు. తన విజయంలో వారి కృషి ఎంతోనని చెబుతారు.

- హిదాయతుల్లాహ్‌.బి, ఈనాడు, చెన్నై


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని