Published : 01/03/2022 00:46 IST

కొవిడ్‌ తగ్గినా... సేవలు ఆగలేదు!

కొవిడ్‌ సమయంలో ఎంతోమంది పెద్ద మనసు చేసుకుని తమకు వీలున్నంతలో నలుగురికీ సాయం అందించారు. వారిలో విజయవాడకు చెందిన సరిత ఒకరు. కొవిడ్‌ తీవ్రత తగ్గినా ఇప్పటికీ వంట చేసుకోలేని వృద్ధులకు ఆహారం పంపిస్తూ వారి ఆకలి తీరుస్తున్నారామె!

కొవిడ్‌ రెండో దశలో చాలామంది వృద్ధులూ, కరోనా బాధితులూ బయటకు రాలేకపోవడం చూసి ఇంట్లోనే వంటచేసి వాళ్లందరికీ ఆహారం పంపించారు విజయవాడ గవర్నర్‌పేటకు చెందిన జి.సరిత. ఈమె భర్త సతీష్‌ ఆటోమొబైల్‌ వ్యాపారి. పిల్లలిద్దరూ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. భోజనాలు అందిద్దామని భర్త, పిల్లల్ని అడిగినపుడు వాళ్లు ప్రోత్సహించడంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టానంటారు సరిత. వాట్సాప్‌ గ్రూప్‌లలో తన మొబైల్‌ నంబరు పెడుతూ ఎవరికైనా ఆహారం కావాలంటే సంప్రదించమని అడిగారు. ఆ సమయంలో నగరం నలుమూలలకూ ఈమె ఇంటి నుంచి ఆహారం వెళ్లింది. రోజూ దాదాపు 40 కుటుంబాలకు పార్శిళ్లు పంపారు. విదేశాల్లో ఉన్నవారు సైతం వృద్ధులైన తమ తల్లిదండ్రులకు ఆహారం అందించమంటూ ఈమెను సంప్రదించేవారు. దాదాపు 10 వేల మందికి మధ్యాహ్న భోజనం అందించారపుడు. మూడో విడతలోనూ ఈ సేవల్ని కొనసాగించారు. ప్రస్తుతం కొవిడ్‌ తీవ్రత తగ్గినా అన్నార్తులు ఎక్కడైనా ఉంటారని వారి కోసం సేవల్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ రోజుకి 20 నుంచి 30 కుటుంబాలకు ఈమె ఇంటినుంచి భోజనం వెళ్తుంది. నగరంలోని కానూరు నుంచి కృష్ణలంక వరకూ ఎక్కడివారు కోరినా భోజనం పంపిస్తారు. ఉదయం ఆరింటి నుంచి పనులు మొదలుపెట్టి.. పన్నెండింటికల్లా వంట పూర్తిచేయడం, ఆపైన పార్శిళ్లు కట్టడం, ఇళ్లకు పంపించడం అన్నీ ఆమే చేసుకుంటారు. తన కుటుంబానికి ఎలా వండుతారో అదే రుచితో, నాణ్యతతో వీటినీ వండుతారు. ఆహారంలో అన్నం, పప్పు, రెండు కూరలు, సాంబారు, పచ్చడి, పులిహోరా, ఒక పండు, స్వీటు పెడతారు. ఎవరైనా ‘ఎందుకింత కష్టం పనివాళ్లని పెట్టి వండించవచ్చు’గా అంటే ‘నా చేత్తో వంటచేసి పంపిస్తే ఎంతో తృప్తి ఉంటుంది. అది తిన్నవాళ్ల నుంచి వచ్చే చిన్న ప్రశంసతో నా కష్టం మర్చిపోతా’ అంటారు సరిత. ఈమె సేవల్ని చూసి తెలిసినవాళ్లు అప్పుడప్పుడూ తమ వంతు సాయం చేస్తుంటారు. అన్నార్తులకు సాయం అందించే ‘అమృత హస్తం’ లాంటి సంస్థలకూ ఆహారం వండి అందిస్తానంటారు సరిత.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని