ఇప్పపువ్వు లడ్డూ కావాలా..!

ఆ పూలతో అక్కడి మహిళలంతా సారా చేసేవారు. తర్వాత ప్రభుత్వ ప్రాజెక్టులో భాగంగా ఆ పూలతో లడ్డూలు చేయడం నేర్చుకున్నారు. అయితే వాటిని వినియోగదారులకు చేర్చలేకపోయారు. నాలుగేళ్ల కిందట రజియా షేక్‌ ఆ ఆదివాసీ గ్రామాలకు వెళ్లినపుడు ఈ విషయం తెలుసుకుంది. తయారీ, మార్కెటింగ్‌లలో కొత్త విధానాలతో విజయం సాధించింది. వందల మంది ఆదివాసీ మహిళలను సాధికారత దిశగా నడిపిస్తోన్న రజియా స్ఫూర్తి కథనమిది.

Updated : 04 Mar 2022 05:51 IST

ఆ పూలతో అక్కడి మహిళలంతా సారా చేసేవారు. తర్వాత ప్రభుత్వ ప్రాజెక్టులో భాగంగా ఆ పూలతో లడ్డూలు చేయడం నేర్చుకున్నారు. అయితే వాటిని వినియోగదారులకు చేర్చలేకపోయారు. నాలుగేళ్ల కిందట రజియా షేక్‌ ఆ ఆదివాసీ గ్రామాలకు వెళ్లినపుడు ఈ విషయం తెలుసుకుంది. తయారీ, మార్కెటింగ్‌లలో కొత్త విధానాలతో విజయం సాధించింది. వందల మంది ఆదివాసీ మహిళలను సాధికారత దిశగా నడిపిస్తోన్న రజియా స్ఫూర్తి కథనమిది.

జియా షేక్‌ విజయవాడలో ఎమ్మెస్సీ మైక్రోబయోలజీ చదివింది. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వ ప్రాజెక్టు ‘సేఫ్‌ మదర్‌హుడ్‌’లో పరిశోధకురాలిగా చేరింది. రజియా స్వస్థలం చత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌. తన విధుల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలూ, అటవీ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక మొక్కలను అధ్యయనం చేసేది. ఆ సమయంలో కామనార్‌ గ్రామానికి చెందిన మహిళా బృందాలు ఇప్పపువ్వుతో చేసే లడ్డూల్ని చూసి ఆశ్చర్యపోయింది. అవి ఆరోగ్యానికి చాలా మంచివని తెలుసుకుంది. కానీ వాటిని వినియోగదారులకు చేర్చడంలో ఆ మహిళలు విఫలం అవుతున్నారని గుర్తించింది.

టీ, బిస్కెట్లు కూడా...

ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఇప్పపూలతో మరిన్ని ఉత్పత్తులు చేయించి మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనుకుంది రజియా. ‘ఇక్కడి మహిళలందరికీ నా ఆలోచన చెప్పా. వారి లడ్డూలకు కొత్త వాసన, రుచి చేర్చడంతోపాటు మరికొన్ని ఉత్పత్తుల తయారీపై ప్రయోగాలు చేశాం. ఆరు నెలలు వాళ్లతోనే ఉండి, ఓ పోషకాహార నిపుణుడు, కొందరు టెక్నీషియన్ల సాయంతో మొదట లడ్డూ, హల్వా వంటివి మొదలుపెట్టాం. తర్వాత మరికొందరు మహిళలకు శిక్షణ ఇచ్చి ఉత్పత్తుల సంఖ్యను పెంచుతూ వచ్చాం. టీ, బిస్కెట్లు, ఎనర్జీ బైట్‌, స్వీట్లు సహా పలు పదార్థాలను చేయడం ప్రారంభించాం. ఇప్ప పువ్వులకు అల్లం, బెల్లం, యాలకులు కలిపి లడ్డూలను చేస్తే కొత్త రుచి వచ్చింది. నమ్మకం కుదిరాక ‘బస్తర్‌ ఫుడ్స్‌’ పేరుతో తక్కువ ధరలకే విక్రయించడం మొదలుపెట్టాం. అలా ముందుగా వీటిని వినియోగదారులకు రుచి చూపి, దగ్గర చేయడానికి ప్రయత్నించాం. ఈ ప్రయోగం విజయవంతమైంది. కొనుగోలుదారులు పెరగడంతో... తయారీనీ పెంచాం. పది మహిళా స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి అందరికీ విప్ప పువ్వు ఉత్పత్తుల తయారీలో శిక్షణనిచ్చాం. దీంట్లో ప్రయోగాలు, కొత్త ఉత్పత్తుల తయారీనీ ప్రోత్సహించాం. వీటికి సంబంధించి వర్క్‌షాపులను నిర్వహించి ప్రతి ఒక్కరినీ ఇందులో భాగస్వాములను చేయగలిగా. ఎగ్జిబిషన్లు, ఆహార ఉత్సవాల్లో ఈ ఉత్పత్తుల ప్రదర్శన జరపడంతో వీటిపట్ల అవగాహన పెరిగింది. అలాగే హిమోగ్లోబిన్‌ శాతం తక్కువగా ఉన్నట్లు వైద్యశాఖ ద్వారా తెలుసుకుని ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడి వారికి ఇప్పపూల లడ్డూలు ఉచితంగా ఇచ్చాం. వీటిని తీసుకున్నవారిలో హిమోగ్లోబిన్‌ స్థాయులు పెరిగినట్లు పరీక్షల్లో తేలడంతో చాలా సంతోషించాం. దీంతో మరి కొందరికీ ఈ తరహా సహాయాన్ని అందించాలనే ఉత్సాహం మా బృంద సభ్యులకు పెరిగింది. అంతేకాదు, పలు ప్రభుత్వాసుపత్రుల నుంచి ఇప్పపూల లడ్డూలకు ఆర్డర్లు మొదలయ్యాయి. అక్కడున్న రోగుల కోసం ప్రభుత్వం మా నుంచి లడ్డూలు కొనుగోలు చేయడం మా బృందాల్లో ఉత్సాహాన్ని పెంచింది. ‘బస్తర్‌ ఫుడ్స్‌’కు సంబంధించి ఛత్తీస్‌గఢ్‌లో వివిధ ప్రాంతాలకు చెందిన 350 మందికి పైగా మహిళలు పనిచేస్తున్నారు. ఓ వైపు పొలం పనులు చూసుకుంటూనే తీరికవేళల్లో పనిచేస్తూ నెలకు నాలుగైదు వేల రూపాయలు సంపాదిస్తున్నారు. మా ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో ఉంచి దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నాం’ అని వివరించారు రజియా. ఇప్పటికే బస్తర్‌లో ఇప్పపువ్వు లడ్డూలతోపాటు టీకి కూడా మంచి డిమాండ్‌ ఏర్పడింది. త్వరలో మరిన్ని కొత్త ఉత్పత్తులను తీసుకువస్తామని చెబుతున్న రజియా.. మహిళలకు ఉపాధి కల్పిస్తూనే బస్తర్‌ అంటే నక్సల్స్‌, వెనకబాటుతనం అన్న ముద్రను చెరిపేసి ఇప్పపూల ఉత్పత్తులకు ప్రఖ్యాతిగా మార్చాలన్నదే తన లక్ష్యమంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్