మాధురిదీక్షిత్‌ అలా చేశాక... సెలబ్రిటీ అయిపోయా!

ఆమె తనలోని లోపాన్ని వదిలిపెట్టి... నైపుణ్యాల్ని నమ్మింది! తన వైకల్యాన్ని గురించి దిగులు పెట్టుకోలేదు. తనకొచ్చిన డ్యాన్స్‌తో లక్షలమంది అభిమానుల్ని సంపాదించుకుంది. వాళ్లలో నటి మాధురీదీక్షిత్‌ కూడా ఒకరు కావడం విశేషం... సోమ్యా జైన్‌కి ఇదెలా సాధ్యమైందో తెలుసుకుందాం...

Published : 11 Mar 2022 00:51 IST

ఆమె తనలోని లోపాన్ని వదిలిపెట్టి... నైపుణ్యాల్ని నమ్మింది! తన వైకల్యాన్ని గురించి దిగులు పెట్టుకోలేదు. తనకొచ్చిన డ్యాన్స్‌తో లక్షలమంది అభిమానుల్ని సంపాదించుకుంది. వాళ్లలో నటి మాధురీదీక్షిత్‌ కూడా ఒకరు కావడం విశేషం... సోమ్యా జైన్‌కి ఇదెలా సాధ్యమైందో తెలుసుకుందాం...

కటీ రెండు కాదు... 2000 సార్లు చావు అంచుల వరకూ వెళ్లొచ్చాను. కారణం... నూటికో, కోటికో ఒక్కరికొచ్చే అరుదైన వ్యాధి నాకు రావడమే. వైద్య పరిభాషలో దీన్ని వ్యాధి అనరు. మాన్యుఫ్యాక్చర్‌ డిఫెక్ట్‌ అంటారు. మాది మధ్యప్రదేశ్‌లోని ధార్‌ ప్రాంతం. చిన్నప్పుడు చక్కగా ఉండే దాన్ని. డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. నాలుగేళ్ల వయసు నుంచీ డ్యాన్స్‌ చేసేదాన్ని. బంధువుల ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా నా సందడి ఉండాల్సిందే! చదువుల్లోనూ ముందుండేదాన్ని. ఆనందంగా సాగిపోతున్న నా జీవితం... తొమ్మిదేళ్ల వయసప్పట్నుంచీ మారిపోయింది. కుడి దవడ లాక్కుపోయి... ముఖంలో మార్పు మొదలయింది. దాంతో అందరి పిల్లల్లా బడికీ, కాలేజీ వెళ్లకుండా ఆ సమయాన్ని ఆసుపత్రి మంచంపై గడిపాను. ఆ చిన్న వయసులో యాంజియోగ్రామ్‌ చేయించుకోవడం అంటే ఎంత బాధగా ఉంటుందీ? అయినా కుంగిపోలేదు. నాకంత శక్తి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతుంటాను.. ఇప్పుడు తలుచుకుంటే! ఆ ధైర్యం, మొండి పట్టుదల మా అమ్మానాన్నల నుంచే వచ్చాయి. నేనెప్పుడైనా  స్థైర్యాన్ని కోల్పోయినా అమ్మే అండగా ఉండేది. ఆమె ఇచ్చిన ధైర్యంతోనే ఆపరేషన్‌ థియేటర్లలోకి భయం లేకుండా వెళ్లొచ్చేదాన్ని. ఇప్పుడు నా ముఖం మీకిలా కనిపిస్తుందంటే కారణం అందులో 80 శాతం క్రెడిట్‌ని డాక్టర్లు, ప్లాస్టిక్‌ సర్జరీలకే ఇవ్వాలి. 2011 నుంచీ నాకు కాస్త ఉపశమనం దొరికింది. అందుకు కారణం డ్యాన్స్‌. ఇండోర్‌లో బీబీయే చదివాను. మంచి మార్కులు వచ్చాయి. కానీ ఏం లాభం? 200 సంస్థలకి నా దరఖాస్తుని పంపాను. ఒక్కరూ ఉద్యోగం ఇవ్వలేదు. నా స్నేహితురాలు పల్లవి, నేనూ ఇంటర్వ్యూకి వెళ్లాం. అర్హతలు నాకే ఎక్కువున్నాయి. కానీ ఇంటర్వ్యూ చేసే అతను నన్ను చూశాక... పల్లవికి ఉద్యోగం ఇచ్చారు. ‘ఫ్రంట్‌ ఆఫీస్‌ ఉద్యోగం కాబట్టి అందం ముఖ్య’మన్నారు. ఇది నా మనసుని తొలిచివేసింది. ఆ బాధతోనే పట్టుదలగా ఓ సంస్థను ప్రారంభించాను. అందులో 15 మందికి ఉద్యోగాలిచ్చాను. ఇప్పుడు మా సంస్థకు 200 మంది అంతర్జాతీయ క్లైంట్లు ఉన్నారు. ఉద్యోగానికి కావాల్సింది అందం కాదు అర్హతలు అని నిరూపించాను.

ఏం చేసినా నా అభిరుచి అయిన డ్యాన్స్‌ని మాత్రం మరిచిపోయేదాన్ని కాదు. నా డ్యాన్స్‌ వీడియోలని టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేసేదాన్ని. దాన్ని బ్యాన్‌ చేయడంతో యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లని వేదికగా మార్చుకున్నా. లాక్‌డౌన్‌ సమయంలో చేసిన వీడియోలకు లక్షల వ్యూస్‌ వచ్చాయి. యూట్యూబ్‌లో ఐదులక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాలో నా రీల్స్‌ని ఏడు లక్షలమంది చూశారు. వీటిలో ఒకదాన్ని నటి మాధురీదీక్షిత్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతోపాటు నేహాకక్కర్‌, రోహన్‌ప్రీత్‌ వంటివారు ప్రశంసించడంతో నేను చిన్నపాటి సెలబ్రిటీని అయిపోయాను. ఇప్పుడూ అదే చెబుతున్నా అందంతో నాకు పనిలేదు. నేను ఎలా ఉన్నా నేనే అందమైన అమ్మాయిని అని నమ్మేంత ఆత్మవిశ్వాసం నాకుంది. నేనే కాదు... మీలో చాలామంది నమ్మాల్సింది కూడా ఇదే. ఎవరి లోపాలు వాళ్లకుంటాయి. వాటిని అంగీకరించి ముందుకు వెళ్లడమే జీవితం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్