పట్టుబట్టింది... 16 పతకాలు కొట్టింది

పురుషాధిక్య రంగాల్లో సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగమూ ఒకటి. కానీ ఆ అమ్మాయి పట్టుబట్టి అదే చదివింది. దానికోసం కంప్యూటర్స్‌ చదివే అవకాశమొచ్చినా వదులుకుంది. ఏకంగా 16 స్వర్ణాలు సాధించింది. బుష్రా మతీన్‌ దీన్ని ఎంచుకోవడం

Published : 14 Mar 2022 01:48 IST

పురుషాధిక్య రంగాల్లో సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగమూ ఒకటి. కానీ ఆ అమ్మాయి పట్టుబట్టి అదే చదివింది. దానికోసం కంప్యూటర్స్‌ చదివే అవకాశమొచ్చినా వదులుకుంది. ఏకంగా 16 స్వర్ణాలు సాధించింది. బుష్రా మతీన్‌ దీన్ని ఎంచుకోవడం వెనుక ఓ ఉద్దేశమూ ఉందంటోంది. అదేంటో చదివేయండి.

బుష్రా చాలా తెలివైన అమ్మాయి. తనకి ఇంటర్మీడియెట్‌లో 93శాతం మార్కులు, ఇంజినీరింగ్‌ రాష్ట్ర ప్రవేశపరీక్షలో వెయ్యిలోపు ర్యాంకు వచ్చాయి. దీంతో మంచి కళాశాలలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చదివే అవకాశమొచ్చింది. అందరూ కంప్యూటర్స్‌ వెనుక పరుగెట్టి, విదేశాలవైపు చూస్తే.. గ్రామాల పరిస్థితేంటని వాళ్ల నాన్న జహీరుద్దీన్‌ తరచూ బాధ పడుతుండేవారు. ఆయన ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజనలో జూనియర్‌ ఇంజినీర్‌. నాన్న బాధ నిజమే కదా అనుకుంది... తను సివిల్‌ ఇంజినీరింగ్‌ వైపు అడుగులు వేసింది. వీళ్లది కర్ణాటకలోని రాయచూరు. ఆడపిల్లలకు సివిల్‌ ఇంజినీరింగ్‌ కష్టమని చాలా మంది వారించారు. వాళ్ల నాన్న ఈ విభాగంలో డిప్లొమానే చేశారు. తను డిగ్రీ చేస్తే ఆయన కలనూ నెరవేర్చొచ్చనుకుంది. ఇంజినీరింగ్‌ను 9.73 సీజీపీఏతో పూర్తిచేయడమే కాక (విశ్వేశ్వరయ్య సాంకేతిక విశ్వవిద్యాలయం) 16 బంగారు పతకాలనూ గెలుచుకుంది. తన బ్రాంచి, విశ్వవిద్యాలయ పరిధిలోనే అత్యధిక మార్కులు, అన్ని సెమిస్టర్లలో ప్రథమ ర్యాంకు, ఎక్కువ మార్కులు సాధించిన మహిళా విద్యార్థి.. ఇలా పలు విభాగాల్లో ఈ పతకాలు దక్కాయి. వీటిని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా చేతుల మీదుగా అందుకుంది. ఆ విశ్వవిద్యాలయ పరిధిలో అత్యధికంగా ఒక విద్యార్థి 13 స్వర్ణపతకాలు సాధించగా.. బుష్రా తనను అధిగమించింది.

‘మా అన్నయ్య కూడా సివిల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశాడు. ప్రైవేటు కాంట్రాక్టులు చేస్తున్నాడు. వాళ్ల అనుభవం, గ్రామీణ రహదారులపై వాళ్ల దగ్గరున్న సమాచారాన్ని పరిశీలించేదాన్ని. కొన్ని ప్రాంతాలు ఎంత అభివృద్ధి చెందుతున్నా కనీస మౌలిక సదుపాయాలు లేని గ్రామాలు ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి. వాటి స్వరూపం మార్చాలంటే ఇది సరిపోదనిపించింది. పెద్ద స్థాయిలో ప్రయత్నించాలి. అందుకే సివిల్‌ సర్వీసెస్‌ రాయాలని నిర్ణయించుకున్నా‘ అంటోన్న బుష్రా సంబంధిత శిక్షణనూ మొదలుపెట్టింది. వెనుకబడిన గ్రామాలకు సదుపాయాలు కల్పించడంతోపాటు సివిల్‌ ఇంజినీరింగ్‌లో అమ్మాయిలూ రాణించగలరని నిరూపించడమే తన లక్ష్యమంటోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్