అమ్మాయిలూ ఆలయాలు కట్టేస్తారు!

ఆలయ విశిష్టత దాని శిల్పకళ మీద కూదా ఆధారపడి ఉంటుంది. రామప్ప నుంచి లేపాక్షి వరకూ ఉదాహరణలెన్నో. దానివల్లే శిల్పకారులకు ప్రాధాన్యం ఎక్కువ. ఈ వృత్తిలో సృజనాత్మకతతోపాటు శారీరక దృఢత్వమూ అవసరం. అందుకేనేమో

Updated : 15 Mar 2022 05:27 IST

ఆలయ విశిష్టత దాని శిల్పకళ మీద కూదా ఆధారపడి ఉంటుంది. రామప్ప నుంచి లేపాక్షి వరకూ ఉదాహరణలెన్నో. దానివల్లే శిల్పకారులకు ప్రాధాన్యం ఎక్కువ. ఈ వృత్తిలో సృజనాత్మకతతోపాటు శారీరక దృఢత్వమూ అవసరం. అందుకేనేమో ఈ రంగంలో అమ్మాయిలు తక్కువ. కానీ అదంతా గతం. ఇప్పుడా హద్దులు చెరిపేస్తున్నారు అమ్మాయిలు.

శిరీష వాళ్ల మామయ్య యాదాద్రి ఆలయ శిల్పుల్లో ఒకరు. ఆయన చెక్కిన సజీవ శిల్పాలు శిరీషను ఎంతో ఆకర్షించేవి. ఇదెక్కడ నేర్చుకున్నారని అడిగితే తిరుపతిలోని ‘శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థ’లో అని చెప్పారాయన. ‘అమ్మాయిలకీ నేర్పిస్తారా’ అని అడిగింది. ‘ఎవరైనా నేర్చుకోవచ్చు’ అన్నారాయన. అప్పటికి శిరీష చదువుతోంది ఏడో తరగతే! సరిగ్గా నాలుగేళ్ల తర్వాత... ఆ సంస్థలో ఆమే ఓ విద్యార్థి అయింది. అక్కడ చదువుతున్న అమ్మాయిలందరిదీ దాదాపు ఇదే నేపథ్యం.

పది ఉత్తీర్ణులైతే చాలు..

ఈ శిక్షణ సంస్థది దాదాపు ఆరు దశాబ్దాల చరిత్ర. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా సంస్థ ఇదొక్కటే. శిల్పాలు చెక్కడం శ్రమే అయినా, కొందరు అమ్మాయిలు తమ ప్రతిభను చాటడానికి దీన్నో మంచి అవకాశంగా భావిస్తున్నారు. వీరి సంఖ్య పెరుగుతోంది. సంస్థ అందిస్తోన్న ‘డిప్లొమా ఇన్‌ ట్రెడిషినల్‌ స్కల్ప్చర్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ (డీటీఎస్‌ఏ)’ నాలుగేళ్ల కోర్సులో చేరుతున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వాళ్లు దీని ప్రవేశ పరీక్షకు అర్హులు. ఇక్కడ చదువుకున్న వారు ఫైన్‌ ఆర్ట్స్‌లో బ్యాచిలర్స్‌, మాస్టర్స్‌ చేయడానికి అర్హులు. ఈ సంస్థలో ఆలయ నిర్మాణం, శిలా శిల్ప, సుధా (సిమెంట్‌) శిల్ప, లోహ శిల్ప, దారుశిల్ప, సంప్రదాయ వస్త్రవర్ణ చిత్రలేఖన విభాగాలున్నాయి. ప్రస్తుతం 18 మంది విద్యార్థినులు న్నారు. ఆలయ నిర్మాణంలో ఐదుగురు శిక్షణ పొందుతున్నారు. ఆలయ రూపకల్పన నుంచి ఉప పీఠాలు, అధిష్ఠాన రకాలు, జాలకం, శిఖరం, ఆలయ ఆకృతులు, తోరణాలు, నాళాలు, పాదాలు, విమాన గోపురం... ఇలాంటివన్నీ నేర్చుకుంటారిక్కడ.

‘ప్రారంభంలో కోర్సు పూర్తిచేయగలనా అన్న సంశయం ఉండేది. తర్వాత ఒక్కో అంశంపైనా అవగాహన వచ్చింది. ఆలయాలను సొంతంగా డిజైన్‌ చేయడమే కాదు, నిర్మించగలను కూడా’ అంటోంది శిరీష. ‘చిత్ర లేఖనంపై ఆసక్తి. ఆలయ డిజైనింగ్‌ నుంచి నిర్మాణం, శిల్పాలను చెక్కడం వరకూ అన్నింటా శిక్షణ తీసుకున్నా. కష్టమైన పనే! అయినా ఆలయ నిర్మాణంలో భాగమయ్యే అవకాశం రాబోతున్నందుకు గర్వంగా ఉంది’ అంటోంది సంగీత. సంస్థ పూర్వ విద్యార్థుల్లో శ్రీవాణి (తెలంగాణ), స్వాతి (ఆంధ్రప్రదేశ్‌) దేవదాయ శాఖలో ‘ఆలయ నిర్మాణాల పరిశీలకుల’ (అసిస్టెంట్‌ స్తపతి) హోదాల్లో పనిచేస్తున్నారు. సౌసల్య, రమ్యశ్రీ... ఆలయ డిజైనర్లుగా పని చేస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్