డ్రోన్లతో.. రైతుకు సాయం చేస్తోంది

పేద రైతు కుటుంబం నుంచి వచ్చినా... పెద్ద చదువులు చదివింది.  చిన్నప్పటి నుంచి రైతుల కష్టాలు చూసిన తనకు సాగులోని సాదక బాధకాలన్నీ తెలుసు. దాంతో పొలాలకు ఉపయోగపడే డ్రోన్స్‌ డిజైన్‌లో తమ్ముడితో చేయి

Updated : 15 Mar 2022 05:35 IST

పేద రైతు కుటుంబం నుంచి వచ్చినా... పెద్ద చదువులు చదివింది.  చిన్నప్పటి నుంచి రైతుల కష్టాలు చూసిన తనకు సాగులోని సాదక బాధకాలన్నీ తెలుసు. దాంతో పొలాలకు ఉపయోగపడే డ్రోన్స్‌ డిజైన్‌లో తమ్ముడితో చేయి కలిపి, రైతులకు అధిక దిగుబడి వచ్చేలా చేస్తోంది 28 ఏళ్ల దేవిక.  ఈ రంగంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఆమె వసుంధరతో పంచుకుంది...

నాకు ఊహ తెలిసేసరికే మా కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. నాన్న రైతు. అమ్మ గృహిణి. తను పదోతరగతి వరకే చదువుకుంది. నన్నూ, తమ్ముడు దేవన్‌ను బాగా చదివించాలని కలలు కనేది. అది మా కుటుంబానికి మరింత భారమవకూడదని, పశువులను పెంచి పాలవ్యాపారం చేస్తూ.. నాన్నపై ఆర్థికభారం పెరగకుండా చూసేది. అలా మా చదువుకు చేయూతైంది. నేను ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో, ఆ తర్వాత తమ్ముడు ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో చేరాం. విద్యారుణంతో చదువుకుంటుండగా, నాన్న చనిపోయారు. ఆ సమయంలో మాకు అన్నీ అమ్మే.. అయ్యింది. చదువు పూర్తయి చెన్నైలో ఓ ప్రైవేటు సంస్థలో మేనేజర్‌గా చేరా. తమ్ముడు సొంతంగా ఏదైనా చేయాలనే వాడు. 2018లో కేరళలో వరదలొచ్చి పొలాలన్నీ జలమయమయ్యాయి. చిన్నప్పటి నుంచి రైతుల ఇబ్బందులు తెలిసిన మేం వారి కోసం ఏదైనా చేయాలనుకున్నాం. తమ్ముడు చదువుకునేటప్పుడు డ్రోన్‌ ప్రాజెక్టు చేశాడు. దాన్నే కెరియర్‌గా మార్చుకున్నాం. ఉద్యోగం మానేసి మా సొంతూరు కొచ్చీకు వచ్చేశా.

తొలి డ్రోన్‌..

పొలాల్లో ఎరువులు చల్లే డ్రోన్‌ చేయాలనుకున్నాం. మావద్ద అంత పెట్టుబడి లేదు. మా స్టార్టప్‌ను ఓ పోటీలో ప్రదర్శిస్తే కేంద్ర వ్యవసాయ విభాగం తరఫున ప్రధానమంత్రి ఇనీషియేటివ్‌ నుంచి కొంత పెట్టుబడి అందింది. టీసీఎస్‌ ఫౌండేషన్‌ వంటి పలు సంస్థలు మా ఆలోచనను మెచ్చి నిధులిచ్చాయి. వీటితోపాటు బ్యాంకు రుణాన్నీ తీసుకున్నాం. 2020, జులైలో ‘ఫ్యూస్‌లేజ్‌ ఇన్నోవేషన్స్‌’ను ప్రారంభించాం. తెగుళ్లు, వ్యాధులు, వాటికి తగిన మందులు, ఎరువుల గురించి అధ్యయనం చేశాం. ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ సాయంతో మరింత అవగాహన సంపాదించాం. మెంటార్స్‌ సూచనలు, సలహాలు తీసుకున్నాం. పొలాలకు జీవరసాయనాలు మాత్రమే చల్లాలనుకున్నాం. పర్యావరణ పరిరక్షణతోపాటు నేల సారవంతమయ్యేలా, భూగర్భ జలాలు కలుషితమవకుండా మేం చేస్తున్న ప్రయత్నమది. రైతుకు తక్కువ ఖర్చు అయ్యేలా చూడాలనుకున్నాం. ఎరువును చల్లడానికే కాకుండా, ఏ ప్రాంతంలో పంటకు వ్యాధి సోకిందో లేదా ఏ ప్రాంతంలో పంట బలహీనంగా ఉందో గుర్తించే సాంకేతికతనూ డ్రోన్‌లో అమర్చాం. అవసరమయ్యే చోట మాత్రమే ఇది ఎరువును చల్లుతుంది. ఇలా ఎరువులు చల్లే డ్రోన్‌ కేరళలో మాదే మొదటిది.

అతి తక్కువగా..

ఒక ఎకరంలో ఏడెనిమిది నిమిషాల్లోపే మా డ్రోన్స్‌ జీవరసాయనాలను సమానంగా చల్లుతాయి. దీనికయ్యే ఖర్చు రూ.800లోపే. ఇది కూలీల ఖర్చుకన్నా చాలా తక్కువ. ఒక డ్రోన్‌తో మొదలుపెట్టాం. ఇప్పుడు మావద్ద నాలుగున్నాయి. రిమోట్‌తో ఆపరేట్‌ చేయడానికి పైలట్లకు శిక్షణనిచ్చాం. రోజుకి ఒక డ్రోన్‌ దాదాపు 50 ఎకరాలకుపైగా ఎరువులను చల్లగలదు. రెండేళ్లలోపే 400మందికిపైగా రైతుల వద్ద మేం పనిచేశాం. కేరళసహా తమిళనాడు, మహారాష్ట్రకు కూడా వెళ్లి పనిచేస్తున్నాం. కేంద్ర వ్యవసాయ విభాగం, సివిల్‌ ఏవియేషన్‌ ఆమోదించిన తొలి స్టార్టప్‌ కేరళలో మాదే. ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌, కేరళ సెంటర్‌ ఫర్‌ పెస్ట్‌ మేనేజిమెంట్‌ సహా సింథైట్‌ ఇండస్ట్రీస్‌, హ్యారీసన్‌ సంస్థలు మా క్లైంట్స్‌ కావడం గర్వంగా అనిపిస్తుంది. సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా, భువనేశ్వర్‌, కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వ శాఖ గతేడాదిలో నిర్వహించిన హ్యాక్‌థాన్‌లో ‘బెస్ట్‌ పెరఫార్మింగ్‌ స్టార్టప్‌’గా మాది నిలిచింది. అడ్వాన్స్‌ టెక్నాలజీతో డోన్స్‌ రూపొందించి రైతులకు చేరువ చేయాలన్నదే మా భవిష్యత్తు లక్ష్యం. అమ్మ మా ఇద్దరినీ చూసి గర్వపడటం, చాలా మంది యువత మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రంగంలోకి రావడానికి ఆసక్తి చూపడం సంతోషంగా అనిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్