యుద్ధభూమి నుంచి వందల మందిని తరలించి..

బాంబులు, ఫిరంగుల శబ్దాలతో ఉక్రెయిన్‌ మార్మోగిపోతోంది. అక్కడి నుంచి బతికి బయటపడి.. మాతృదేశానికి చేరుకుంటామో లేదో అనే భయంతో ప్రాణాలను గుప్పెట పెట్టుకొని భారతీయులంతా క్షణాలను యుగాలుగా గడిపారు.

Published : 21 Mar 2022 01:56 IST

బాంబులు, ఫిరంగుల శబ్దాలతో ఉక్రెయిన్‌ మార్మోగిపోతోంది. అక్కడి నుంచి బతికి బయటపడి.. మాతృదేశానికి చేరుకుంటామో లేదో అనే భయంతో ప్రాణాలను గుప్పెట పెట్టుకొని భారతీయులంతా క్షణాలను యుగాలుగా గడిపారు. అటువంటి ఆ యుద్ధవాతావరణం నుంచి మనవారినందరినీ ప్రాణాలకు తెగించి మరీ మాతృభూమికి చేర్చి ధైర్యసాహసాలను ప్రదర్శించారీ మహిళాపైలట్లు.


దిశా ఆదిత్య మన్నూర్‌... గుజరాత్‌, భుజ్‌కు చెందిన దిశా విమానం నడపాలని కలలు కనేది. అనుకున్నట్లుగానే న్యూజిలాండ్‌లో పైలట్‌ శిక్షణ పూర్తిచేసింది. 2017లో ఎయిర్‌ ఇండియాలో చేరింది. విధుల్లో భాగంగా ఎన్నో దేశాలకు ప్రయాణికులను సురక్షితంగా చేర్చింది. ఎయిర్‌ ఇండియా పైలట్‌ ఆదిత్య మన్నూర్‌తో వివాహమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించడానికి ఎయిర్‌ ఇండియా సిద్ధపడుతున్నప్పుడు దిశా తనకు కూడా ఇందులో అవకాశాన్నివ్వాలని కోరింది. అక్కడకు బయలుదేరిన అయిదుగురు పైలట్లలో ఏకైక మహిళ దిశ. అలా ఈ పైలట్ల బృందం ఫిబ్రవరి 22న దిల్లీ నుంచి ఉక్రెయిన్‌కు ఏ1-1947 ఎయిర్‌క్రాఫ్ట్‌లో వెళ్లి, అక్కడ చిక్కుకున్న 242 మంది భారతీయులను సురక్షితంగా మాతృదేశానికి చేర్చింది. ఇందులో దిశా చాటిన ధైర్యం మహిళలందరికీ గర్వకారణంగా నిలిచింది. గతంలోనూ పలు క్లిష్టమైన సందర్భాల్లోనూ దిశ తన ధైర్యాన్ని, మానవత్వాన్నీ చాటింది. కొవిడ్‌ సమయంలోనూ భర్తతో కలిసి విమానాన్ని నడిపి అమెరికా, హాంకాంగ్‌, ప్యారిస్‌, సింగపూర్‌ దేశాల నుంచి ఆక్సిజన్‌, మందులను తరలించడంలో బాధ్యతలను పంచుకుంది. ‘ఉక్రెయిన్‌ వెళ్లే ముందు అమ్మానాన్న, అత్తయ్యతో చెప్పగా వారంతా భయపడ్డారు. ఇది నా బాధ్యత అని చెప్పా. ఎలాగో ఒప్పించి బయలుదేరా. అక్కడ యుద్ధం జరుగుతున్న చోటుకి అతి దగ్గర ప్రాంతంలోనే విమానాన్ని ల్యాండ్‌ చేశాం. ఆ విమానాశ్రయంలో రెండు విమానాలు మాత్రమే ఉన్నాయి. కొన్ని క్షణాలు భయమనిపించింది. అంతలోనే మనవాళ్లను తరలించే ప్రక్రియలో వేగంగా మా పని ముగించాం. ఇటువంటిచోట్లకు వెళ్లే ముందు తీసుకోవాల్సిన ప్రత్యేక శిక్షణని ముంబయిలో పూర్తిచేశా. మనదేశ విద్యార్థులను ఇక్కడకు తరలించి, వారి తల్లిదండ్రుల కళ్లల్లో నిండిన సంతోషాన్ని చూశా. ఈ ఆపరేషన్‌లో నేనూ ఉండటం సంతోషంగా, గర్వంగా ఉంది’ అని చెబుతోంది దిశ.


శివానీ కర్లా... ‘ఆపరేషన్‌ గంగలో భాగస్వామ్యం వహిస్తావా’ అని వైమానిక అధికారులు అడిగిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా సిద్ధమని చెప్పింది మహిళాపైలట్‌ శివానీ కర్లా. ఉక్రెయిన్‌ నుంచి భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించే ఆ ఆపరేషన్‌లో పాల్గొనడం గర్వంగా భావించిందీమె. ఓవైపు సోదరుడి వివాహవేడుకలు జరుగుతున్నా వెనుకడుగు వేయలేదు. ‘అక్కడ మాకోసం వేయికళ్లతో మన దేశ విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. మమ్మల్ని చూసిన వెంటనే వారి ముఖాల్లో చిరునవ్వు కనిపించింది. 249 మందిని ఉక్రెయిన్‌ నుంచి రొమేనియా, హంగేరీలకి తాత్కాలికంగా తరలించి.. ఆ తర్వాత మార్చి ఎనిమిదిన దిల్లీ విమానాశ్రయంలో దింపాం. అక్కడకు చేరుకోగానే ప్రతి ఒక్కరి తల్లిదండ్రుల ముఖాల్లో పట్టలేని ఆనందాన్ని చూశా. వారంతా మమ్మల్ని చూసి చప్పట్లు కొడుతూ ప్రశంసిస్తుంటే గర్వంగా అనిపించింది. అప్పుడే అమ్మానాన్నల మాటలూ గుర్తొచ్చాయి. మొదట ఇంట్లో అందరూ భయపడ్డారు. ఆ తర్వాత ఒప్పుకొని ఓ మాట చెప్పారు. అదేంటంటే... భారతీయులను తరలించడం మాత్రమే కాదు, వారిని కుటుంబాలతో కలపడానికి ప్రయత్నిస్తున్నావు. వెళ్లిరా అన్నారు. అది నిజమే అనిపించింది’ అని చెబుతున్న శివానీ తాను బుడాపెస్ట్‌ నుంచి విద్యార్థులతో తిరిగి వస్తున్న దృశ్యాలను వీడియో తీసి సామాజికమాధ్యమాల్లో పొందుపరిచింది. ప్రస్తుతం లక్షమందికి పైగా దీన్ని వీక్షించడమే కాదు, శివానీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని